బ్యాంకు డిపాజిట్ల‌పై రూ.5 ల‌క్ష‌ల బీమా

బ్యాంకు డిపాజిట్ల‌పై బీమా భ‌రోసా పెంచ‌డంతో డిపాజిట్లు పెరిగే అవకాశం ఉంది

బ్యాంకు  డిపాజిట్ల‌పై రూ.5 ల‌క్ష‌ల బీమా

బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముకు మరింత భద్రత కల్పిస్తూ బ‌డ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు శుభవార్త ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని రూ. 5లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని, ప్రజలు ఈ విషయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్‌ 16(1) నిబంధల ప్రకారం… బ్యాంకులు విఫలమైనప్పుడు, నష్టాల్లో కూరుకున్నప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై బీమా కవరేజీ ఇస్తారు. ఆర్‌బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌(డీఐసీజీసీ) ఈ బీమా అందిస్తుంది. ఖాతాదారుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండానే బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డిపాజిటర్లకు నిర్దేశించిన గరిష్ఠ మొత్తం వరకూ బీమా భద్రత కల్పిస్తోంది.

పొదుపు, ఫిక్స్‌డ్‌, కరెంట్‌ ఖాతాలు, రికరింగ్‌ డిపాజిట్లపై ఈ బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం ఖాతాదారుల డిపాజిట్లపై రూ. లక్ష వరకు బీమా సదుపాయం ఉంది. దీన్ని పెంచాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో బీమా కవరేజీని రూ. 5లక్షల వరకు పెంచుతూ నేడు బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో ఈ బీమా భద్రత అంశం ప్రాముఖ్యంగా మారిన విషయం తెలిసిందే.

బ్యాంకుల్లో మోసాలు పెరిగిపోవడం, కొంత మంది బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని కుచ్చుటోపీలు పెడుతున్న ఘటనలు ఎక్కువవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఖాతాదారుల్లో విశ్వాసం కలిగించేదిగా ఉంది. సామాన్యులు బ్యాంకులో తాము డిపాజిట్ చేసుకున్న సొమ్ము భద్రత విషయంలో నెలకొన్న ఆందోళనను తొలగించి, కొత్త బడ్జెట్ ఓ భరోసాను ఇచ్చింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly