దీపావ‌ళికి పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకుంటున్నారా?

మీ ల‌క్ష్యాల‌కు, అవ‌స‌రాల‌కు త‌గిన ప‌థ‌కాల‌ను ఎంచుకొని పెట్టుబ‌డులు ప్రారంభించాలి

దీపావ‌ళికి పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకుంటున్నారా?

ప్ర‌తీ కుటుంబంలో వెలుగులు నింపే దీపావ‌ళి పండ‌గ రోజు పెట్టుబ‌డులు ప్రారంభిస్తే భ‌విష్య‌త్తు కాంతివంత‌మవుతుంది. అయితే పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు స‌రైన సాధ‌నాలు ఏంటి ఎందులో డిపాజిట్ చేస్తే మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు . మార్కెట్లో చాలా రకాల పెట్టుబ‌డి విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి చాలా ర‌కాల ఆప్ష‌న్ల‌ల‌లో ఏది ఎంచుకోవాల‌న్న‌ది మీ ఆర్థిక ప‌రిస్థితి, రిస్క్‌, వ‌య‌సు, పెట్టుబ‌డుల మొత్తం, కాల‌ప‌రిమితి, ఆర్థిక ల‌క్ష్యాల ఆధారంగా ఎంచుకోవాలి.

అయితే దీర్ఘ‌కాల పెట్టుబ‌డులు చేయ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణుల సూచ‌న‌. సంప‌ద అనేది ఒక రోజులో సృష్టించేది కాదు. దానికి స‌మ‌యం ప‌డుతుంది. స్వ‌ల్ప‌కాల ఒడుదొడుకుల‌తో పెట్టుబ‌డుల విష‌యాల్లో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దు. ఆర్థిక ల‌క్ష్యాల‌ను సాధించాలంటే స‌రైన సాధ‌నాలు ఎంచుకొని ఒడుదొడుకుల‌ను ఎదుర్కొని పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి.

పెట్టుబ‌డుల‌ను ఎలా ప్లాన్ చేస్తున్నారు?

పెట్టుబ‌డుల‌ను ప్రారంభించేముందు ఎంత మాత్రం రిస్క్ తీసుకోగ‌ల‌రో దానిపై స్ప‌ష్ట‌త ఉండాలి. ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితి, వ‌య‌సు, బాధ్య‌త‌లు, దీర్ఘ‌కాలిక లక్ష్యాల‌ను దృష్టిలో ఉంచుకొని రిస్క్ తీసుకోవాలి. దీనికోసం అవ‌స‌ర‌మైతే ఆర్థిక స‌ల‌హాదారుల నుంచి సూచ‌న తీసుకోవాలి. మార్కెట్ ప‌రిస్థితుల ఆధారంగా ఫండ్ల‌ను ఎంచుకోవాలి. అయితే ఏ పెట్టుబ‌డులు అయినా అన్ని వేళ‌లా లాభాన్నే అందించ‌వు. ఒక్కోసారి కొంత ఒడుదొడుకుల‌కు గుర‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే పోర్ట్‌ఫోలియోలో వైవిధ్య‌త ఉండాలి. వివిధ పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఎంచుకుంటే ఒక‌దాంట్లో న‌ష్టం వ‌చ్చినా మ‌రోదానిలో లాభం పొంద‌వ‌చ్చు.

పెట్టుబ‌డుల‌కు 10 ఆప్ష‌న్స్

1. బంగారం, సంబంధిత పెట్టుబ‌డులు

ధ‌న‌త్ర‌యోద‌శి లేదా దీపావ‌ళి రోజు బంగారం కొనుగోలు చేస్తే శుభం క‌లుగుతుంద‌ని ప్ర‌జ‌ల విశ్వాసం. బంగారం కొనుగోలు అనేది సాంప్ర‌దాయంగా వ‌స్తున్న పెట్టుబ‌డి విధానం. అందుకే పోర్ట్‌ఫోలియోలో బంగారం పెట్టుబ‌డుల‌ను కూడా చేర్చాలి. పోర్ట్‌ఫోలియోలో 10 నుంచి 15 శాతం బంగారానికి కేటాయించాలి. బంగారాన్ని నాణేలు లేద బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేయ‌డం కంటే ఎలక్ర్టానిక్ రూపంలో లేదా బాండ్ల రూపంలో కొనుగోలు చేస్తే త్వ‌ర‌గా ఎక్స్‌ఛేంజ్ చేసుకోవ‌డంతో పాటు క‌చ్చిత‌మైన వ‌డ్డీరేటును పొంద‌వ‌చ్చు. మార్కెట్లో ధ‌ర పెరిగితే ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో లాభం పెరిగే అవ‌కాశం ఉంటుంది.

2. ఫిక్స్‌డ్ డిపాజిట్లు

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు భ‌ద్ర‌త‌తో కూడుకొని ఉంటాయి. పొదుపు ఖాతాల‌కంటే దీనిపై వ‌డ్డీ రేట్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. స్వ‌ల్ప‌కాలిక అవ‌స‌రాల‌కు ఎఫ్‌డీలు మంచి ఆప్ష‌న్. వివిధ కాల‌ప‌రిమితుల‌ను క‌లిగి ఉంటాయి. ఏడు రోజుల‌కు కూడా ఎఫ్‌డీల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

3. రిక‌రింగ్ డిపాజిట్‌

రిక‌రింగ్ డిపాజిట్‌లో క‌చ్చిత‌మైన మొత్తాన్ని వాయిదాల ప‌ద్ధ‌తిలో క్ర‌మానుగ‌తంగా డిపాజిట్ చేసుకోవాలి. నెల‌కు కొంత మొత్తంతో పొదుపు చేయ‌డంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు స‌మానంగా వ‌డ్డీని పొంద‌వ‌చ్చు.

4. ఈక్విటీ పెట్టుబ‌డులు

ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు స‌రైన‌వి. క‌నీసం 3 నుంచి 5 సంవ‌త్స‌రాలు అయినా ఇందులో పెట్టుబ‌డులు కొన‌సాగించాలి. లార్జ్‌క్యాప్ల‌లో మంచి లాభాల‌ను ఇచ్చే స్టాక్‌ల‌ను ఎంచుకోవాలి. రుణాల‌తో ఉన్న కంపెనీల షేర్ల జోలికి వెళ్ల‌కూడ‌దు. కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగంలో, ఫార్మా, వంటి రంగాల్లో కూడా వ‌చ్చే ఏడాది వ‌ర‌కు మంచి ఫ‌లితాల‌ను ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

5. మ్యూచువ‌ల్ పండ్లు

మ్యూచువ‌ల్ పండ్ల ద్వారా వివిధ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక్క‌డ‌ నిపుణులు ఫండ్ల ప‌నితీరును గురించి ఎల్ల‌ప్ప‌డూ పరిశీలిస్తుంటారు కాబ‌ట్టి ఆందోళ‌న ఉండ‌దు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో పెట్టుబ‌డుల‌ను మార్చుకునేందుకు లేదా ఉప‌సంహ‌రించుకునేందుకు వీలుంటుంది. వివిధ ర‌కాల ఫండ్ల‌లో రిస్క్ ఆధారంగా పెట్టుబ‌డులు చేస్తే మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.

6. సిప్

ఈ దీపావ‌ళికి పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకునేవారికి సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌రైన మార్గం. కొంత క‌చ్చిత‌మైన మొత్తంతో ప్రతి నెల పెట్టుబ‌డులు చేయ‌డంతో దీర్ఘ‌కాలానికి సంప‌ద సృష్టించుకోవ‌డంతో పాటు పెట్టుబ‌డులు క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాటు అవుతుంది. నెల‌కు రూ.500 నుంచి కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. మీపై ఆధార‌ప‌డిన వారిపేరుపై కూడా సిప్ ప్రారంభించ‌వ‌చ్చు.

7. ఈటీఎఫ్ (ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు)

ఈటీఎఫ్‌లు మ్యూచువ‌ల్ ఫండ్ల వంటివే కానీ స్టాక్‌ల మాదిగిగా ట్రేడవుతాయి. పెట్టుబ‌డుదారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను ఇత‌ర రంగాల్లో లేదా ఇత‌ర విభాగాల్లో పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం ఉంటుది.

8. రియ‌ల్ ఎస్టేట్‌

రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు స్థిర పెట్టుబ‌డులు. ఇవి దీర్ఘ‌కాలంలోఎక్కువ రాబ‌డిని కూడా ఇవ్వ‌వ‌చ్చు.

9. పీపీఎఫ్

పీపీఎఫ్ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి ప‌థ‌కం. దీని కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు. పెట్టుబ‌డులు, వ‌డ్డీ, ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. ప్ర‌స్తుతం వ‌డ్డీ రేట్లు 8 శాతంగా ఉన్నాయి.

10. నెల‌వారి ఆదాయ ప‌థ‌కం (ఎంఐఎస్‌)

పోస్టాఫీస్ నెల‌వారి ఆదాయ ప‌థ‌కంలో క్యాష్ లేదా చెక్కు రూపంలో ప్రారంభించ‌వ‌చ్చు. డిసెంబ‌ర్ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్లు 7.3 శాతంగా ఉన్నాయి. నెల‌వారిగా వ‌డ్డీ చెల్లిస్తారు. నెల‌కు క‌నీసం రూ.1500 నుంచి రూ.4.5 ల‌క్ష‌ల వ‌ర‌కు, ఉమ్మ‌డిగా అయితే రూ.9 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly