పీపీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 3 ముఖ్య‌మైన విష‌యాలు

పీపీఎఫ్ ఖాతా ప్రారంభించే ముందు ఖాతా నిలిచిపోతే పున‌రుద్ధ‌రించుకోవడం ఎలా? ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు ఉన్న నిబంధ‌న‌లు తెలుసుకోవాలి.

పీపీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 3 ముఖ్య‌మైన విష‌యాలు

ల‌క్ష‌ల మంది పెట్టుబ‌డుదారులు ఇప్పుడు పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌ను ఎంచుకుంటున్నారు. సాంప్ర‌దాయ పెట్టుబ‌డుదారులు అదేవిదంగా రిస్క్ తీసుకునేవారు కూడా పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. పెట్టుబ‌డుల‌పై క‌చ్చిత‌మైన రాబ‌డి, వ‌డ్డీ ఆదాయంపై , అదేవిధంగా పెట్టుబ‌డుల‌పై కూడా పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌డం వంటివి పెట్టుబ‌డుదారుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

  1. పీపీఎఫ్ ఖాతా ఎప్పుడు నిలిచిపోతుంది?

పీపీఎఫ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం, ఒక‌రు ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలు ప్రారంభించేందుకు వీల్లేదు. ఒక‌వేళ రెండో ఖాతా ఉన్నా దానిని నిలిపేసి మొద‌టి ఖాతాతో క‌లుపుతారు. అయితే త‌ల్లిదండ్రులు త‌మ మైన‌ర్‌ పిల్ల‌ల పేరుతో పీపీఎఫ్ ఖాతాను తెరిచే అవ‌కాశ‌ముంటుంది.

ఒక సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌ల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన‌ప్ప‌టికీ తిరిగి రీఫండ్ అవుతాయి. పరిమితికి మించిన డిపాజిట్ల‌పై ఎటువంటి వ‌డ్డీ వ‌ర్తించ‌దు. త‌మ సొంత ఖాతాతో పాటు మైన‌ర్ ఖాతాలో డిపాజిట్ రూ.1.5 ల‌క్ష‌లు దాట‌కుండా చూసుకోవాలి.

15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ గ‌డువు ముగిసిన త‌ర్వాత పోస్టాఫీస్ లేదా బ్యాంకులో ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా డిపాజిట్ కొన‌సాగిస్తే వాటిని రెగ్యుల‌ర్ డిపాజిట్‌గా ప‌రిగ‌ణించ‌రు. అవి కూడా ఎటువంటి వ‌డ్డీ లేకుండా తిరిగి రీఫండ్ చేస్తారు.

పీపీఎఫ్‌లో ఉమ్మ‌డి ఖాతాకు వీలుండ‌దు. నామినీ అవ‌కాశం ఉంటుంది. మైన‌ర్ ఖాతాకు కూడా ఇదేవిధంగా ఉంటుంది.

  1. ముంద‌స్తు ముగింపు

పీపీఎఫ్ ఖాతా నుంచి కేవ‌లం పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు మాత్ర‌మే వీలుంది. అదే విధంగా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా రుణం కూడా పొందే అవ‌కాశం ఉంటుంది. అయితే ఏదైనా అత్య‌వస‌ర ప‌రిస్థితుల్లో (ఖాతాదారుడు లేదా వారిపై ఆధార‌ప‌డిన వారి వైద్య చికిత్స నిమిత్తం, పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం) మాత్ర‌మే ఖాతాను ముంద‌స్తుగా మూసివేసే అవ‌కాశాన్ని 2016 నుంచి అందుబాటులోకి తెచ్చారు. అయితే దీనికి క‌నీసం ఖాతా ప్రారంభించిన 5 సంవ‌త్స‌రాల త‌ర్వాతే వీలుంటుంది. అయితే ముంద‌స్తుగా ఉప‌సంహ‌రించుకుంటే వ‌డ్డీ రేటు ఒక‌టి శాతం త‌క్కువ‌గా ఉంటుంది.

  1. ఖాతాను పున‌రుద్ధ‌రించుకోవ‌డం ఎలా?

పీపీఎఫ్ గ‌డువు 15 సంవ‌త్స‌రాలు. ఖాతాను యాక్టివ్‌గా ఉంచేందుకు ఏడాదికి క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది లేదా ఖాతా నిలిచిపోతుంది. అయితే అప్ప‌టివ‌ర‌కు ఖాతాలో ఉన్న మొత్తంపై వ‌డ్డీ ల‌భిస్తుంది. అయితే ఖాతా యాక్టివ్‌గా లేక‌పోతే పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌లు, రుణాలు లేదా ముంద‌స్తుగా ఖాతాను మూసివేసేందుకు వీలుండ‌దు. ఖాతాను తిరిగి పున‌రుద్ధ‌రించేందుకు డిపాజిట్ చేయ‌ని ప్ర‌తీసారికి రూ.50 తో పాటు ఏడాది క‌నీస డీపాజిట్ రూ.500 చెల్లించ‌వ‌ల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly