అక్ష‌య తృతీయ‌కి బంగారం కొంటున్నారా?

ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం బంగారం అమ్మితే వ‌చ్చిన లాభాల‌పై ప‌న్ను ప‌డుతుంది

అక్ష‌య తృతీయ‌కి బంగారం కొంటున్నారా?

అక్ష‌య తృతీయ రోజు బంగారం కొంటే మంచి జ‌రుగుతుంద‌ని వారి న‌మ్మ‌కం. దీంతో బంగారం డిమాండ్ బాగా పెరిగిపోతుంది. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టంతో డిమాండ్ మ‌రింత పెరిగింద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. కొన్ని నెల‌ల క్రితం బంగారం ధ‌ర ప‌దిగ్రాముల‌కు రూ.33,500 ఉండ‌గా, ఇప్పుడు రూ.31,500 గా ఉంది. చాలా వ‌ర‌కు జువెల‌రీ సంస్థ‌లు అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త స్కీముల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు.

అయితే బంగారం కొనేట‌ప్పుడు, అమ్మేట‌ప్పుడు ఎంత ప‌న్ను ప‌డుతుంది అనేది తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. దేశంలో బంగారాన్ని వివిధ రూపాల్లో కొనుగోలు చేస్తారు. ఆభ‌ర‌ణాలు, నాణేలు, ఈటీఎఫ్, డిజిట‌ల్ గోల్డ్‌, సార్వ‌భౌమ ప‌స‌డి బాండ్లు ఇలా చాలా ర‌కాలుగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన‌ప్పుడు దాని విలువ‌పై 3 శాతం జీఎస్‌టీతో పాటు త‌యారీ ఛార్జీలు ప‌డ‌తాయ‌న్న విష‌యం తెలుసుకోవాలి. ఇక్క‌డ బంగారం ఎక్కువ‌గా దిగుమ‌తి చేసుకుంటారు కాబ‌ట్టి డాల‌ర్ ధ‌ర ఆధారంగా బంగారం ధ‌ర‌లు మారుతుంటాయి. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం, బంగారం క్యాపిట‌ల్ గెయిన్స్‌పై ట్యాక్స్ ప‌డుతుంది. అది ఏ రూపంలో ఉంద‌నేదానిపై ఆధార‌ప‌డి ప‌న్ను వ‌ర్తిస్తుంది.

బంగారం విక్ర‌యిస్తే ప‌న్ను ఎంత‌?
ఆదాయ ప‌న్ను దీర్ఘ‌కాలం లేదా స్వ‌ల్ప‌కాల రాబ‌డిపై ఆధార‌ప‌డి ప‌న్ను ఉంటుంది. కొనుగోలు చేసిన మూడేళ్ల‌లో తిరిగి అమ్మేస్తే వ‌చ్చిన లాభాన్ని స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌నంగా ప‌రిగ‌ణిస్తారు. మూడేళ్ల త‌ర్వాత విక్ర‌యిస్తే దీర్ఘ‌కాలంగా లెక్కిస్తారు. స్వ‌ల్ప‌కాలిక రాబ‌డి మీ మొత్తం స్థూల ఆదాయంలోకి క‌లిపి మీ శ్లాబు ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు. మ‌రోవైపు దీర్ఘ‌కాలిక రాబ‌డిపై ప‌న్ను సెస్‌తో క‌లిపి 20.8 శాతంగా ఇండెక్సేష‌న్ బెనిఫిట్స్‌తో క‌లిపి ప‌డుతుంది లేదా ద్ర‌వ్యోల్బ‌ణం త‌ర్వాత కొనుగోలు ధ‌ర‌ను లెక్కిస్తారు.

గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు
గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబ‌డులు ఫిజిక‌ల్ గోల్డ్‌లో పెట్టుబ‌డులు చేస్తాయి. దీంతో బంగారం ధ‌ర‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేయ‌వ‌చ్చు. గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులు గోల్డ్ ఈటీఎఫ్‌ల‌కు వెళ్తాయి. గోల్ట్ ఈటీఎఫ్‌ల‌తో పోలిస్తే వ్య‌య నిష్ప‌త్తి గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్‌లో ఎక్కువ‌గా ఉంటుంది. సాధార‌ణంగా గోల్ట్ ఫండ్లు, గోల్ట్ ఈటీఎఫ్‌ల వ్య‌య నిష్ప‌త్తిని క‌లుపుకుంటాయి. బంగారం ధ‌ర పెరిగితే గోల్ట్ ఈటీఎఫ్ నిక‌ర ఆస్తి విలువ పెరుగుతుంది. త‌గ్గితే త‌గ్గుతుంది.

గోల్డ్ ఈటీఎఫ్ విక్ర‌యించ‌డం ద్వారా వ‌చ్చి లాభాలు లేదా గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్ల లాభాల‌పై ప‌న్ను ఫిజిక‌ల్ గోల్డ్ మాదిరిగానే వ‌ర్తిస్తుంది. స్వ‌ల్ప‌కాలిక లాభాలు 36 నెల‌ల కంటే త‌క్కువ‌గా ఉంటే పెట్టుబ‌డుదారుడి ఆదాయానికి జ‌త‌చేసి దాని ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది. దీర్ఘ‌కాలిక రాబ‌డి 36 నెల‌ల కంటే ఎక్క‌వ‌గా ఉంటే 20.8 శాతం ప‌న్ను ఇండెక్సేష‌న్ బెనిఫిట్స్‌తో క‌లిపి ఉంటుంది.

సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు
ఇవి ప్ర‌భుత్వం జారీ చేసే ప‌సిడి ప‌థ‌కాలు. వీటిని ఫిజిక‌ల్ గోల్డ్‌కు ఇది ప్ర‌త్నామ్నాయంగా భావించ‌వ‌చ్చు. బాండ్ ధ‌ర ప్ర‌కారం చెల్లించి మెచ్యూరిటీ త‌ర్వాత తిరిగి డ‌బ్బు పొంద‌వ‌చ్చు. ఈ బాండ్ల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఎనిమిదేళ్ల కాల‌ప‌రిమితితో కూడిన ఈ బాండ్లు , ఐదేళ్ల త‌ర్వాత ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఇవి స్టాక్ ఎక్స్‌ఛేంజీల‌లో కూడా ట్రేడ‌వుతాయి. ఈ బాండ్ల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా వ‌చ్చిన లాభాల‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. గోల్డ్ బాండ్లు సంవ‌త్స‌రానికి 2.50 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. వ‌డ్డీ ఆరు నెల‌ల‌కోసారి ల‌భిస్తుంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం బాండ్ల‌పై ప‌న్నుఉంటుంది.

డిజిట‌ల్ గోల్డ్ ప‌న్ను
చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు ఎంఎంటీసీ భాగ‌స్వామ్యంతో డిజిట‌ల్ గోల్డ్‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. పెట్టుబ‌డుదారులు త‌క్కువ మొత్తం పెట్టుబ‌డితో ఈ డిజిట‌ల్ గోల్డ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఫిజిక‌ల్ గోల్డ్,ఈటీఎఫ్‌, మ్యూచుల్ ఫండ్ల మాదిరిగానే డిజిట‌ల్ గోల్డ్ పై కూడా ప‌న్ను వ‌ర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly