పీపీఎఫ్ ఖాతా ముగింపు స‌మ‌యంలో కీల‌క విష‌యాలు

ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.9 శాతం వార్షిక వ‌డ్డీ ల‌భిస్తుంది. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులకు పీపీఎఫ్ ఖాతా మంచి ఆప్ష‌న్‌

పీపీఎఫ్ ఖాతా ముగింపు స‌మ‌యంలో కీల‌క విష‌యాలు

ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సి కింద ప‌న్ను ఆదా చేసుకునేందుకు పీపీఎప్ పెట్టుబ‌డులు మంచి ఆప్ష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు. ఇందులో పెట్టుబ‌డుల‌పై కాకుండా వ‌డ్డీపై కూడా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలకు స‌రిప‌డే నిధిని స‌మ‌కూర్చుకోవ‌చ్చు. చిన్న పెట్టుబ‌డుదారులు పెద్ద మొత్తంలో నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఒక మార్గంగా పీపీఎఫ్‌ను ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్షలు ఖాతాలో జ‌మ‌చేయ‌వ‌చ్చు.

పీపీఎఫ్ మెచ్యూరిటీ కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు. పీపీఎప్ ఖాతా మ‌రో రెండు మూడేళ్ల‌లో మెచ్యూరిటీ పూర్త‌వుతుంద‌న్న‌వారు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య‌మైన అంశాలు…

1.15 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత పీపీఎఫ్ ఖాతా నుంచి మొత్తం విత్‌డ్రా చేసుకొని ఖాతాను మూసివేయ‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతా ఉన్న‌ బ్యాంకు లేదా పోస్టాఫీస్ నుంచి ఫారం సి తీసుకొని ఖాతా మూసివేసి మొత్తం న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేందుకు కోర‌వ‌చ్చు.

2.పీపీఎఫ్ ఖాతాను మ‌రింత కాలం కొన‌సాగించాల‌నుకుంటే ఐదేళ్ల చొప్పున పొడ‌గించుకునే అవ‌కాశం ఉంది. దీనికోసం ఫారం హెచ్ స‌మ‌ర్పించాలి.

3.మెచ్యూరిటీ ముగిసే మూడేళ్ల‌కు ముందు గ‌రిష్ఠంగా ప్ర‌తి ఏడాది రూ.1.5 ల‌క్ష‌లు పెట్టుబ‌డులు పెడితే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. పన్ను ఆదాతో పాటు, ఎక్కువ వ‌డ్డీ ల‌భిస్తుంద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 14 వ సంవ‌త్స‌రంలో చేసే పెట్టుబ‌డులు రెండేళ్ల‌లో, 15 వ సంవ‌త్స‌రంలో చేసే పెట్టుబ‌డులు ఏడాదిలో వెన‌క్కి వ‌స్తాయ‌ని చెప్తున్నారు.

4.పీపీఎఫ్ ఖాతా ఆర్థిక సంవ‌త్స‌రాన్ని అనుస‌రిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వ‌ర‌కు లెక్కిస్తుంది. మార్చి 31 న ఖాతా ప్రారంభించినా, ఆ త‌ర్వాత ఏడాది నుంచి కొత్త సంవ‌త్స‌రంగా భావిస్తుంది. 15 ఏళ్ళు ఖాతా నిర్వహించవలసి ఉంటుంది .

5.ఏదైనా ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మిన‌హాయించి 15 ఏళ్ల వ‌ర‌కు పూర్తి న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేందుకు వీల్లేదు. ఆరోగ్య చికిత్స‌, ఉన్న‌త విద్య వంటి కార‌ణాల‌తో పూర్తిగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఏడ‌వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంది. ఖాతా నుంచి నాలుగో ఏడాది చివ‌ర్లో ఉన్న మొత్తం నుంచి 50 శాతం లేదా అంత‌కు ముందు ఏడాది ఖాతాలో ఉన్న మొత్తం నుంచి 50 శాతం… ఏది త‌క్కువ‌గా ఉంటే అది ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly