చిన్న వ్యాపార‌స్తుల‌కు 5 ర‌కాల క‌రెంట్ అకౌంట్ లు

క‌రెంటు ఖాతాలు అధిక లావాదేవీలు జరిపే వాణిజ్య సంస్థల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.

చిన్న వ్యాపార‌స్తుల‌కు 5 ర‌కాల క‌రెంట్ అకౌంట్ లు

వ్యాపారాన్ని ప్రారంభించిన‌ప్పుడు ముఖ్యంగా చేయ‌వ‌ల‌సిన ప‌నుల‌లో క‌రెంటు (అకౌంట్) ఖాతాను తెర‌వ‌డం ఒక‌టి. క‌రెంటు ఖాతాను తెర‌వ‌డం సుల‌భ‌మే అయితే ఈ ఖాతాను ఏ బ్యాంకులో ప్రారంభించాలి, ఏబ్యాంకులు అత్య‌ధిక ప్ర‌యోజ‌నాలను అందిస్తున్నాయి అనేది గుర్తించ‌డమే క‌ష్ట‌మైన ప‌ని. చాలా వ‌ర‌కు ప‌బ్లిక్‌, ప్రైవేట్ రంగ బ్యాంకులు విస్తృత స్థాయిలో క‌రెంటు ఖాతాల‌ను అందిస్తున్నాయి. మీరు కొత్త‌గా ప్రారంభించిన‌ వ్యాపారం కోసం క‌రెంటు ఖాతాను తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదా మీ ప్ర‌స్తుత బ్యాంకు అందించే సౌక‌ర్యాల‌తో సంతృప్తిగా లేరా? అయితే భార‌త‌దేశంలో చిన్న వ్యాపార‌స్తుల‌కు అందుబాటులో ఉన్న ఈ 5 క‌రెంటు ఖాతాల వివ‌రాల‌ను ప‌రిశీలించండి. మీరు ఏ బ్యాంకులో క‌రెంటు ఖాతా తెర‌వాలో ఎలా ఎంచుకుంటారు? చాలా మంది, బ్యాంకులు ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌పై ఆధార‌ప‌డి బ్యాంకు ఖాతాను తెరుస్తుంటారు.
బ్యాంకు ఖాతాను తెర‌వ‌డంలో వ‌డ్డీ రేట్లు ప్ర‌ధాన ప్రాత పోషిస్తాయి. అయితే క‌రెంటు ఖాతా విష‌యంలో ఈ విధంగా చేయ‌డం మంచిది కాదు. క‌రెంటు ఖాతాను తెరిచేప్పుడు బ్యాంకులు అందించే ఇత‌ర సౌక‌ర్యాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌లసి ఉంటుంది.

క‌రెంట్‌ ఖాతా అంటే ఏమిటి?

‘కరెంట్ ఖాతా ’ వాణిజ్య అవసరాల కోసం, రోజు వారీ లావాదేవీలు జరిపే వారికోసం ఉద్దేశించింది. ఒక రోజుకు చేయాల్సిన లావాదేవీలపై పరిమితులు ఉండవు. దీనిలో ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఒకవేళ మీ ఖాతాలో న‌గ‌దు లేని స‌మ‌యంలో కూడా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. వ్యాపారాలు చేసుకునే వారికి వ‌ర్కింగ్ క్యాపిటెల్ నిర్వ‌హ‌ణ‌లో స‌హాయ‌ప‌డుతుంది. ఈ ర‌క‌మైన ఖాతాలు, చిన్న వ్యాపార‌స్తుల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కు, భాగస్వామ్య సంస్థలకు, ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

క‌రెంట్ ఖాతా- వివ‌రాలు:

 • ఈ ఖాతాను వ్యాపార‌స్తులు, వారి వ్యాపార లావాదేవీల కోసం తెరుస్తారు.
 • ఈ ఖాతాలోని డిపాజిట్ల‌పై వ‌డ్డీ చెల్లించ‌రు.
 • సాధార‌ణ పొదుపు ఖాతాతో పోలిస్తే, నిర్వ‌హించాల్సిన క‌నీస బ్యాలెన్స్ అధికంగా ఉంటుంది.
 • క‌నీస బ్యాలెన్స్‌ను నిర్వ‌హించ‌క‌పోతే, బ్యాంకులు అప‌రాధ రుసుము వ‌సూలు చేస్తాయి.
 • ఓవ‌ర్‌డ్రాఫ్ట్ సౌక‌ర్యం ఉంటుంది. మీ ఖాతాలో న‌గదు లేక‌పోయినా కొంత ప‌రిమితి వ‌ర‌కు అద‌న‌పు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
 • ఓవ‌ర్ డ్రాప్ట్ మొత్తంపై బ్యాంకులు వ‌డ్డీని వ‌సూలు చేస్తాయి.
 • లావాదేవీల సంఖ్య‌, డిపాజిట్‌, విత్‌డ్రా చేసే మొత్తాల‌పై ఎలాంటి ప‌రిమితి లేదు.

క‌రెంటు ఖాతా - ప్ర‌యోజ‌నాలు:

 • క‌రెంటు ఖాతాను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల మీ క్రెడిట్ విశ్వ‌స‌నీయ‌త‌ పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు నిర్వ‌హించ‌డం ప‌ట్ల మీ నిబ‌ధ్ధ‌త‌ను రుజువు చేస్తుంది.
 • డిపాజిట్‌ల‌పై ఎలాంటి ప‌రిమితి ఉండ‌దు. అద‌న‌పు ఓవ‌ర్‌డ్రాప్ట్ సౌక‌ర్యంతో వ్యాపార‌స్తులు త‌మ కార్య‌కాలాపాల‌ను సుల‌భ‌త‌రం చేసుకోవ‌చ్చు.
 • ఈ రకం ఖాతాలో చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఎటువంటి ఆల‌స్యం లేకుండా నేరుగా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.
 • ఒక‌టి కంటే ఎక్కువ ప్ర‌దేశాల నుంచి న‌గ‌దు బ‌దిలీ, ఇన్‌వ‌ర్డ్ చెల్లింపులు, పేఆర్డ‌ర్‌, డిమాండ్ డ్రాఫ్ట్ సౌక‌ర్యం వంటి వేల్యూ యాడెడ్ సేవ‌లు ఉచితంగా పొంద‌వ‌చ్చు.
 • కొన్ని బ్యాంకులు వ్య‌క్తిగ‌త సేవ‌లు అందిచండం ద్వారా వినియోగ‌దారుల‌కు మంచి మ‌ద్ద‌తును అందిస్తున్నాయి.

క‌రెంటు ఖాతాను ఎంచుకునే ముందు ఈ కింది అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి.
ప్ర‌దేశం:

క‌రెంటు ఖాతా తెరిచే బ్యాంకు వ్యాపారం ఉన్న ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర‌గా ఉంటే వ్యాపార అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లావాదేవీలు జ‌రుపుకునేందుకు వీలుగా ఉంటుంది. వ్యాపార అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా, నెట్ బ్యాంకింగ్‌, మోబైల్ బ్యాంకింగ్‌, ఎటీఎమ్‌/ బ్యాంక్ నెట్ వ‌ర్క్‌లు ఉండాలి.

ఓవ‌ర్ డ్రాఫ్ట్ ప‌రిధి:

ఓవ‌ర్ డ్రాఫ్ట్‌ను ఆఫర్ చేసే బ్యాంకు ఓవ‌ర్‌డ్రాఫ్ట్ ప‌రిమితిని, అందించే సామ‌ర్ధ్యం ఆధారంగా ఎంచుకోవాలి.

క‌నీస నెల‌వారీ స‌గ‌టు నిలువ‌:

బ్యాంకును ఎంచుకునే ముందు క‌నీస నెల‌వారీ స‌గ‌టు విలువ ఎంత ఉంచాలో తెలుసుకోవాలి. ఒక‌వేళ మీ వ్యాపారం ప్రారంభ స్థాయిలో ఉంటే న‌గ‌దు అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల జీరో నెల‌వారీ స‌గ‌టుతో గానీ, త‌క్కువ నెల‌వారీ స‌గ‌టు గానీ నిర్వ‌హించేందుకు అనుమ‌తించే బ్యాంకుల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

సేవా రుసుములు:

డిమాండ్ డ్రాఫ్ట్‌, చెక్కు బుక్ సౌక‌ర్యం, ఆన్‌లైన్ న‌గ‌దు బ‌దిలీ, డెబిట్ కార్డు మొద‌లైన‌ వివిధ సేవ‌ల‌కు బ్యాంకులు వ‌ర్తింప‌చేసే రుసుములను ఇత‌ర బ్యాంకులతో పోల్చి చూడాలి.

వ్య‌క్తిగ‌త సేవ‌లు: బ‌్యాంకింగ్ లావాదేవీలు సుల‌భ‌త‌రం చేసేందుకు బ్యాంకులు వ్య‌క్తిగ‌త సేవ‌ల‌ను కూడా అందిస్తున్నాయి. బ్యాంకులు మీ వ్యాపారానికి అందించే ప్రీమియం స‌ర్వీసుల గురించి తెలుసుకోండి.

భార‌త‌దేశంలో చిన్న వ్యాపార‌స్తుల‌కు అనుగుణంగా ఉండే 5 క‌రెంటు ఖాతాలు వాటి వివ‌రాలు:

 1. ఐసీఐసీఐ బ్యాంక్ క‌రెంటు ఖాతా:

ఐసీఐసీఐ బ్యాంక్ విస్తృత స్థాయిలో క‌రెంటు ఖాతాల‌ను అందిస్తుంది. ఇందులో కొత్త స్టార్ట‌ప్ క‌రెంట్ ఖాతా, ‘సుభారంభం’ క‌రెంటు ఖాతా, స్మార్ట్ బిజినెస్ ఖాతా, రోమింగ్ క‌రెంటు ఖాతాలు ఉన్నాయి. మీరు కొత్త‌గా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న‌ట్ల‌యితే స్టార్ట‌ప్‌ క‌రెంటు ఖాతా లేదా సుభారంభం ఖాతాల‌ను ఎంచుకోవ‌డం మంచింది. ఇందులో ఈ కింది అంశాలు, ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

 • మొద‌టి 6 నెల‌లు క‌నీస స‌గ‌టు నిలువ, నిర్వ‌హించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఏడ‌వ నెల నుంచి రూ. 25 వేలు క‌నీస స‌గ‌టు నిలువ ఉండాలి.
 • వెంచర్ క్యాపిటలిస్ట్, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ సమావేశం ప్రత్యేక ప్రయోజనాలు బ్యాంకు అందిస్తుంది.
 • మంచి ఫారెక్స్ సేవ‌ల‌ను, స‌ల‌హాల‌ను అందిస్తుంది.
 • వ్య‌క్తిగ‌త స‌ల‌హా, సంప్ర‌దింపుల సేవ‌ల‌ను అందిస్తుంది.
 • స‌గ‌టు బ్యాలెన్స్‌ను నిర్వ‌హించేందుకు 12 సార్లు ఉచిత నగదు డిపాజిట్లను అనుమ‌తిస్తుంది.
 • ఉచిత ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, చెక్ బుక్ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది.
 • ఉచిత ఇంట‌ర్‌నెట్‌, మొబైల్ బ్యాంకింగ్ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది.
 1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క‌రెంటు ఖాతా:

ఇత‌ర బ్యాంకులు మాదిరిగా హెచ్‌డీఎఫ్‌సీ కూడా వివిధ ర‌కాల క‌రెంటు ఖాతాల‌ను అందిస్తుంది. అల్టిమా కరెంట్ ఖాతా, అపెక్స్ కరెంట్ ఖాతా, మ్యాక్స్ కరెంట్ ఖాతా, ప్లస్ కరెంట్ ఖాతా, ప్రీమియం కరెంట్ ఖాతా, అంకుర సంస్థ‌ల కోసం స్మార్ట‌ప్‌ సొల్యూషన్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించేవారికి స్మార్ట‌ప్‌ సొల్యూష‌న్ ఖాతా ఎక్కువ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

స్మార్ట‌ప్‌ సొల్యూష‌న్ ఖాతా ప్ర‌యోజ‌నాలు:

 • స్మార్ట‌ప్‌ ఆల్ఫా (ఒక సంవ‌త్స‌రం జీరో బ్యాలెన్స్ సౌక‌ర్యంతో), స్మార్ట‌ప్‌ ల‌లో ఎంచుకోవ‌చ్చు.
 • స‌ల‌హాలు, డిజిట‌ల్ మార్కెటింగ్‌, కో-వ‌ర్కింగ్ స్పేస్ వంటి అద‌న‌పు సేవ‌ల‌ను అందిస్తుంది.
 • చెక్కు తీసుకోవ‌డం, చెల్లింపులు వంటి సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తుంది.
 • ఉచిత ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది.
 • ప్ర‌త్యేక‌ ఫారెక్స్ సేవ‌ల‌ను అందిస్తుంది.
 • ఇంట‌ర్ నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ యాప్‌ల‌తో డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది.
 1. యాక్సిస్ బ్యాంక్ అందించే జీరో బ్యాలెన్స్ క‌రెంటు ఖాతా:

ఇది జోరో బ్యాలెన్స్ ఖాతా ప్ర‌యోజ‌నాలు:

 • క‌నీస స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హ‌ణపై ఎలాంటి ఆంక్ష‌లు లేవు
 • నెల‌కు 75 ఉచిత లావాదేవీలు చేసుకోవ‌చ్చు.
 • వార్షిక రుసుములు వ‌ర్తిస్తాయి. (రూ.1999). ఎమ్ఏబీ రూ.50 వేల‌కు మించితే వార్షిక రుసుముల‌పై రాయితీ పొంద‌వ‌చ్చు.
 • అతిపెద్ద బ్యాంకింగ్ నెట‌వ‌ర్క్‌, ఏటీఎమ్ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది.
 • వివిధ లావాదేవీలు/ స‌ర్వీసుల‌పై యాక్సిస్ ఈడీజీఈ రివార్డ్ ప్రోగ్రామ్ సౌక‌ర్యం ఉంది.
 1. కొటాక్ మ‌హీంద్రా బ్యాంక్ క‌రెంట్ ఖాతా:

నియో, స్టార్ట‌ప్‌ రెగ్యూల‌ర్‌, స్టార్ట్‌ప్ ప్రీమియం, గ్లోబ‌ల్ ట్రేడ్‌, ఏసీఈ మొద‌లైన బ‌హుళ ఖాతాల‌ను అందిస్తుంది. చిన్ని వ్యాపార‌స్తులకు నియో క‌రెంటు ఖాతా మెరుగైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

నియో క‌రెంటు ఖాతా అందించే ప్ర‌యోజ‌నాలు:

 • త్రైమాసిక స‌గ‌టు నిల్వ క‌నీసం రూ.10 వేలు
 • చెక్ చెల్లింపులు, సేక‌ర‌ణ సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తుంది.
 • ఇంటి వ‌ద్దే న‌గ‌దు డిపాజిట్‌, విత్‌డ్రా సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తుంది.
 • ఉచిత ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది.
 • మంచి ఫోరెక్స్ రేట్ల‌ను అందిస్తుంది.
 • ప‌న్ను, వ‌ర్క్‌ప్లేస్‌, ప్ర‌యాణం, డిజిట‌ల్ మీడియా సోల్యూష‌న్స్ వంటి అద‌న‌పు ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.
 1. య‌స్ బ్యాంక్ క‌రెంటు ఖ‌తా:

ఎడ్జ్ బిజినెస్, ప్రైమ్ బిజినెస్, ఎక్స్లూజీవ్‌ బిజినెస్, య‌స్ హెడ్ స్టార్ట‌ప్ ఖ‌తా వంటి వివిధ ర‌కాల ఖాతాల‌ను అందిస్తుంది. కొత్త వ్యాపార‌స్తుల‌కు య‌స్ హెడ్‌-స్టార్ట‌ప్ ఖాతా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.

య‌స్ హెడ్‌-స్టార్ట‌ప్ ఖాతా ప్ర‌యోజ‌నాలు:

 • ఒక సంవ‌త్స‌రం పాటు స‌గ‌టు నిల్వ, నిర్వ‌హించ‌వ‌ల‌సిన అవ‌సరం లేదు.
 • ఎక్క‌డైనా చెల్లింపులు చేసే సౌక‌ర్యం, చెక్కు సేక‌ర‌ణ సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తుంది.
 • భార‌త‌దేశంలో ఏ బ్యాంకు ఏటీఎమ్‌లోనైనా లావాదేవీలు ఉచితం
 • నెట్ బ్యాకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్‌ సేవ‌లు ఉచితం
 • అంకుర సంస్థ‌ల‌కు వాల్యూ యాడెడ్ సేవ‌ల‌ను అందిస్తుంది.

ఏ బ్యాంకులోనైనా ఖాతాను తెరిచే ముందు నిశితంగా ప‌రిశీలించి మీ వ్యాపార‌ బ్యాంకింగ్ అవ‌స‌రాల‌కు స‌రిపోయే ఖాతాను ఎంచుకోవాలి. పైన వివ‌రించిన అంశాల‌తో పాటు ఇత‌ర ఇంట‌ర్ బ్యాంకింగ్ సౌక‌ర్యాలు, ఆఫ‌ర్లు, రుసుములు పోల్చి చూసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly