వ్య‌క్తిగ‌త రుణాల గురించి అపోహ‌లా? ఇది చ‌ద‌వండి

వ్య‌క్తిగ‌త రుణాల గురించి ప్ర‌చారంలో ఉన్న అపోహలు ఇవే

వ్య‌క్తిగ‌త రుణాల గురించి అపోహ‌లా? ఇది చ‌ద‌వండి

ఆర్థిక అవ‌స‌రాలు తీర్చుకునేందుకు వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకోవ‌డం ఈ మ‌ధ్య ప‌రిపాటిగా మారింది. త్వ‌ర‌గా ల‌భించే అనుమ‌తులు, హామీగా ఆస్తుల‌ను చూపించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం, సుల‌భ‌త‌ర‌మైన నిబంధ‌న‌ల కార‌ణంగా ఈ మ‌ధ్య‌కాలంలో ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే కొన్ని అపోహల కార‌ణంగా, అవ‌స‌రాలు తీరాల‌న్న తొంద‌ర‌లో చాలా మంది ఖ‌ర్చుతో కూడుకున్న‌, కాల‌యాప‌న జ‌రిగే ఇత‌ర ప్ర‌త్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.

వ్య‌క్తిగ‌త రుణాల‌కు సంబంధించి ప్ర‌చారంలో ఉన్న కొన్ని అపోహ‌లు:

  1. రుణ మంజూరుకు అధిక స‌మ‌యం ప‌డుతుంది

చాలా మంది రుణ గ్ర‌హీత‌లు వ్య‌క్తిగ‌త రుణాలు మంజూరు చేయ‌డానికి వివిధ సంస్థ‌లు ఎక్కువ స‌మ‌యాన్ని తీసుకుంటాయని అనుకుంటూ ఉంటారు. అలాగే అనుమతులు అంత తొంద‌ర‌గా ల‌భించవ‌నే అపోహ‌లో ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ఈ రోజుల్లో వ్య‌క్తిగ‌త రుణాల మంజూరు ప‌రిమిత ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ‌తో చాలా త్వ‌ర‌గా జ‌రుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ విధానంలో ఇది చాలా త్వర‌గా ఉంటోంది. కేవ‌లం ఒక్క రోజులోనే వివిధ కంపెనీలు రుణం మంజూరు చేస్తున్నాయి. అలాగే వీటిలో హామీగా ఆస్తుల‌ను చూపించాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.

  1. క్రెడిట్ స్కోరు త‌క్కువుంటే రుణ ప్ర‌తిపాద‌నను తిరస్క‌రిస్తారు

రుణం మంజూరు చేసేట‌ప్పుడు చాలా కంపెనీలు క్రెడిట్ స్కోరుని ప్రాతిప‌దిక‌గా తీసుకుంటాయి. ఇది మీ రుణం మంజూరీ పైనా ప్ర‌భావం చూపుతుంది. అయితే కేవ‌లం క్రెడిట్ స్కోరు త‌క్కువ‌గా ఉన్నంత మాత్రాన మీ రుణ ధ‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించ‌రు. క్రెడిట్ స్కోరు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, మీ ఆదాయం, రుణం తిరిగి చెల్లించగ‌ల సామ‌ర్థ్యం మొద‌లైన వాటిని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటారు. అయితే ఈ త‌ర‌హా రుణాల‌పై వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి.

  1. బ్యాంకులు మాత్ర‌మే రుణ‌మిస్తాయి

వ్య‌క్తిగ‌త రుణాల గురించి ప్ర‌చారంలో ఉన్న మ‌రో అపోహ ఏంటంటే కేవ‌లం బ్యాంకులు మాత్ర‌మే రుణాలు మంజూరు చేస్తాయి. అయితే బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు(ఎన్‌బీఎఫ్‌సీ)లు, డిజిటల్ ఫిన్‌టెక్ సంస్ధ‌ల లాంటి ఇత‌ర ఆర్థిక సంస్థ‌లూ ఆక‌ర్ష‌ణీయ‌మైన రీతిలో రుణాల‌ను ఇస్తాయి. చాలా మంది రుణ‌దాతలు బ్యాంకులు త‌మ ప్ర‌తిపాద‌న‌ను తిరస్కరిస్తే వేరే గ‌త్యంత‌రం లేద‌నుకుంటారు. కానీ ఇలా బ్యాంకులు తిరస్క‌రించిన చాలా రుణ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఎన్‌బీఎఫ్‌సీలు ఆమోదం తెలిపి రుణాల‌ను మంజూరు చేస్తాయి. ఎందుకంటే రుణాలివ్వ‌డానికి ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల కంటే బ్యాంకుల‌కు ఒక నిర్దిష్ట విధానం ఉంటుంది కాబ‌ట్టి రుణం అంత త్వ‌ర‌గా మంజూరు కాదు.

  1. వ్య‌క్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌

వ్య‌క్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయని చాలా మంది అనుకుంటుంటారు. అయితే మంచి క్రెడిట్ స్కోరు, తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం గ‌ల వారికి ప్ర‌స్తుతం వ‌డ్డీ రేట్లు త‌గ్గి 10.99 శాతంకే కంపెనీలు రుణాలిస్తున్నాయి. రుణ గ్ర‌హీత‌ల క్రెడిట్ స్కోరుకనుగుణంగా రుణాల మంజూరీ ఉంటోంది. క్రెడిట్ కార్డులు, లాంటి వాటిలో 18 నుంచి 48 శాతం మేర వ‌డ్డీ విధిస్తున్నారు. వాటితో పోల్చుకుంటే ఈ ప‌ద్ధ‌తి కొంచెం చవ‌కైన‌ద‌నే చెప్పుకోవ‌చ్చు.

  1. ఇప్ప‌టికే రుణం తీసుకుని ఉంటే, మ‌ళ్లీ రుణం దొర‌క‌దు

రుణ‌దాత ఇప్ప‌టికే వేరే కంపెనీ ద‌గ్గ‌ర రుణం తీసుకున్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రుణ‌గ్ర‌హీత‌ల తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం, నెల‌వారీ వాయిదాలు(ఈఎమ్ఐలు), క్రెడిట్ కార్డుల చెల్లింపుల త‌ర్వాత మిగిలిన ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని కంపెనీలు రుణం మంజూరు చేస్తాయి. కాబ‌ట్టి మీరు ఇప్ప‌టికే రుణం తీసుకుని ఉండి, మీ తిరిగి చెల్లించే సామ‌ర్థ్యంపై కంపెనీలు సంతృప్తిగా ఉంటే మీకు మ‌ళ్లీ రుణం ల‌భిస్తుంది.

  1. ముంద‌స్తుగా చెల్లించే సౌల‌భ్యం ఉండదు

ఇత‌ర రుణాల‌తో పోల్చితే వ్య‌క్తిగ‌త రుణాలు త‌క్కువ కాల‌ప‌రిమితితో ఉంటాయి కాబ‌ట్టి వీటిలో ముంద‌స్తు చెల్లింపులు(ప్రీ పేమెంట్) చేసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది నిజం కాదు. ఇత‌ర రుణాల మాదిరిగానే వ్య‌క్తిగ‌త రుణాల్లోనూ ముంద‌స్తుగా చెల్లింపులు చేసుకునే సౌల‌భ్యం ఉంది. అయితే కొన్ని ష‌ర‌తులు, నిబంధ‌న‌ల‌కు లోబ‌డి కంపెనీలు ఈ అవ‌కాశం క‌ల్పిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇవి ముంద‌స్తు చెల్లింపుల‌కు రుసుముల‌ను కూడా వ‌సూలు చేస్తాయి.

సాధార‌ణంగా ఈ త‌ర‌హా రుణాల కాల ప‌రిమితి ఏడాది నుంచి ఏడు ఏళ్ల‌లోపు ఉంటుంది. రుణ గ్ర‌హీత‌లు త‌మ వ‌ద్ద అద‌న‌పు న‌గ‌దు ఉన్న‌ప్పుడు ముంద‌స్తుగానే చెల్లింపులు చేయ‌డం ద్వారా వ‌డ్డీని ఆదా చేసుకోవ‌చ్చు.

  1. ఆన్‌లైన్ విధానం చాలా ప్ర‌హ‌స‌నంతో కూడుకున్న‌ది

వ్య‌క్తిగ‌త రుణాల కోసం చాలా మంది రుణ‌దాత‌లు వివిధ కంపెనీల శాఖ‌ల చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతుంటారు. ఆన్‌లైన్ విధానం పెద్ద ప్ర‌హ‌స‌నంతో కూడుకున్న‌ద‌ని చాలా మంది ఆ విధానం జోలికే వెళ్ల‌రు. అయితే ఇది నిజం కాదు. అయితే రుణం కోసం కంపెనీలు శాఖ‌ల చుట్టూ తిర‌గ‌టం వ‌ల్ల స‌మ‌యం వృథా అవ‌డంతో పాటు, పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం.

ఇందుకు భిన్నంగా ర‌క‌ర‌కాల ఆన్‌లైన్ ఫైనాన్షియ‌ల్ మార్కెట్ సంస్థ‌లు త‌మ ప్లాట్‌ఫామ్‌ల‌పైనే కాగిత ర‌హితంగా, త‌క్ష‌ణ‌మే రుణాల‌ను మంజూరు చేస్తున్నాయి. రుణ‌దాత‌లు ఈ ఆన్‌లైన్ పోర్ట‌ళ్ల‌ను సంద‌ర్శించి త‌మ ఆర్థిక అవ‌స‌రాలు, స్తోమ‌త‌కు త‌గ్గ‌ట్లుగా వివిధ కంపెనీలందించే రుణాల‌ను పోల్చుకుని రుణం తీసుకోవ‌డం మంచిది. దీనివ‌ల్ల ఎంతో విలువైన స‌మ‌యం ఆదా అవ‌డ‌మే గాక‌, అన‌వ‌స‌ర వ్య‌య ప్ర‌యాస‌లు త‌ప్పుతాయి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly