ఏటీఎంలలో వ‌చ్చిన మూడు ముఖ్య‌మైన మార్పులు

ఏటీఎంల‌ను అప్‌డేట్ చేసిన త‌ర్వాత లావాదేవీల స‌మ‌స్య‌లు తగ్గాయి

ఏటీఎంలలో వ‌చ్చిన మూడు ముఖ్య‌మైన మార్పులు

ఏటీఎంల ప్ర‌జ‌ల జీవిన విధానాన్ని మ‌రింత సుల‌భం చేశాయ‌ని చెప్పుకోవ‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు డిజిట‌ల్ లావాదేవీలు పెర‌గ‌డంతో ఏటీఎంకి వెళ్ల‌కుండా చెల్లింపులు పూర్తి చేస్తున్నారు. కానీ ఏటీఎంల రాక‌తో ప్ర‌జ‌లు బ్యాంకుల చుట్టూ తిర‌గాల్సిన శ్ర‌మ‌, స‌మ‌యం అన్ని ఆదా చేస్తున్నాయి. ఏటిఎంలో కార్డు ఉంచి అక్క‌డ ఇచ్చిన సూచ‌న‌ల‌ను అనుస‌రించి డ‌బ్బును సుల‌భంగా , క్ష‌ణాల్లో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఇక్క‌డ అప్ర‌మ‌త్త‌త వ‌హించ‌క‌పోతే డ‌బ్బును కోల్పోయే అవ‌కాశం లేక‌పోలేదు. అయితే ఒక‌ప్పుడు ఉన్న ఏటిఎం మిష‌న్ల‌ను , ఇప్పటి ఏటీఎంల‌ను పోల్చి చూస్తే చాలా వ‌ర‌కు మార్పులు వ‌చ్చాయి. సౌక‌ర్యాన్ని మ‌రింత పెంచాయి. అవేంటో తెలుసుకుందాం

ఏటీఎం డ‌బ్బు వెన‌క్కి తీసుకోదు:

గ‌తంలో ఏటిఎంలో కార్డుతో డ‌బ్బు విత్‌డ్రా చేసుకున్న‌ప్పుడు డ‌బ్బును వెంట‌నే తీసుకోక‌పోతే తిరిగి వెన‌క్కి వెళ్లిపోయేది. అయితే ఇప్పుడు ఈ ఇబ్బంది లేదు. ఆర్‌బీఐ బ్యాంకుల‌కు ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం, 2012 నుంచి బ్యాంకులు ఈ విదానాన్ని మార్చేశాయి. అంటే డ‌బ్బు తీసుకోక‌పోయినా ఏటీఎంలో త‌ర్వాత వ‌చ్చిన వారు డ‌బ్బు తీసుకునేవ‌ర‌కు అలాగే ఉండిపోతుంది. ఒక‌వేళ తీసుకోవ‌డం మ‌ర్చిపోతే బ్యాంకు దానికి బాధ్య‌త వ‌హించ‌దు. డ‌బ్బు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే శ‌బ్దంతో వ‌స్తుంది తీసుకోవాల‌ని సూచిస్తుంది కాబ‌ట్టి దాదాపుగా మ‌ర్చిపోయే అవ‌కాశం ఉండ‌దు.

లావాదేవి పూర్త‌య్యేంత‌వ‌ర‌కు కార్డును ఉంచాలి:

పాత ఏటీఎం మిష‌న్ల‌లో కొన్ని, కార్డును లోప‌లికి తీసుకొని లావాదేవి పూర్త‌య్యాక బ‌య‌ట‌కు వ‌చ్చేది. అయితే సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా కార్డు బ‌య‌ట‌కు రావ‌ట్లేద‌ని చాలా వ‌ర‌కు ఫిర్యాదులు రావ‌డంతో ఈ విధానాన్ని నిలిపివేసారు. ఇప్పుడు లావాదేవీ చేసినంత‌సేపు కార్డు ఉంచి పూర్త‌య్యాక‌ తీసుకోవాలి. ఒక‌వేళ ముందే తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే ఇప్పుడు వ‌చ్చేవి అన్ని చిప్ కార్డులు కాబ‌ట్టి ఆ ప్రాంతంలో కార్డు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది, అదేవిధంగా కార్డు విరిగిపోవ‌చ్చు. అందుకే ఏటీఎం మిష‌న్ ఇచ్చే సూచ‌న‌ల ప్ర‌కారం లావాదేవీ పూర్త‌య్యాక కార్డును వెన‌క్కి తీసుకోవాలి.

లావాదేవీ స‌మ‌యంలో అంత‌రాయం:

ఒక్కోసారి పిన్‌, విత్‌డ్రా చేసుకోవాల్సిన మొత్తం ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఏటీఎం స్ర్కీన్‌పై ఏం క‌న‌బ‌డ‌క‌పోతే లేదా ఎర్ర‌ర్ అనే మెసేజ్ వ‌స్తే ఎలాంటి కంగారు అవ‌స‌రం లేదు. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల‌న ఇలా జ‌ర‌గొచ్చు. బ్యాంకులు ఈ బాధ్య‌త‌ను వ‌హించి మీ డ‌బ్బును తిరిగి అంద‌జేస్తాయి. ఒక‌వేళ లావాదేవీ పూర్తికాక‌పోతే దానిని క్యాన్సిల్ చేస్తాయి అప్పుడు ఖాతా నుంచి డ‌బ్బు డెబిట్ కాదు. ఒక‌వేళ లావాదేవి జ‌రిగి, మీ ఖాతాలో డ‌బ్బు డెబిట్ అయిన త‌ర్వాత కూడా ఎటీఎం నుంచి డ‌బ్బు రాక‌పోతే మీ బ్యాంకును సంప్ర‌దిస్తే తిరిగి క్రెడిట్ చేస్తారు. స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే బ్యాంకు అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly