యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటేనే పీఎఫ్ విత్‌డ్రా

ఈపీఎఫ్ ఖాతా నుంచి వైద్య చిక‌త్స‌, వివాహం, ఉన్న‌త చ‌దువు, ఇంటి కొనుగోలు వంటి కార‌ణాల‌తో పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌లు చేసుకోవ‌చ్చు

యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటేనే  పీఎఫ్ విత్‌డ్రా

ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా నుంచి న‌గ‌దు ఉప‌సంహ‌రించుకోవాల‌నుకుంటే ముందుగా యునివ‌ర్స‌ల్ అకౌంట్ నంబ‌ర్ (యూఏఎన్) యాక్టివేట్ చేసుకోవాల‌న్న విష‌యం గుర్తుంచుకోండి. ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్ ద్వారా యాక్టివేట్ చేసుకొని, దానికి ఆధార్ అనుసంధానం చేసి, బ్యాంకు వివ‌రాలతో కేవైసి పూర్తి చేయాలి.

ఖాతాలో ఉన్న‌ పూర్తి న‌గ‌దు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెల‌ల త‌ర్వాత తీసుకోవ‌చ్చు. అయితే ఉద్యోగం చేసే సమ‌యంలో ప్ర‌త్యేక అవ‌స‌రాల కోసం పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంది.

యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

  1. ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్ ఓపెన్ చేయండి
  2. ‘Our Services’ సెల‌క్ట్ చేసి ‘For Employees’ పై క్లిక్ చేయండి
  3. ఆ త‌ర్వాత ‘Member UAN/Online Services’ పై క్లిక్ చేయండి
  4. కుడివైపున ఉండే ‘Important Links’ లో ఉండే ‘Activate your UAN’ ఎంచుకోవాలి
  5. ఇక్క‌డ యూఏఎన్‌, పుట్టిన తేది, మొబైల్ నంబ‌ర్ వంటి క‌నీస వివరాలు అందించాలి. ఆ త‌ర్వాత ‘Get authorisation pin’ పై క్లిక్ చేయాలి.
  6. మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత ‘I Agree’ పై క్లిక్ చేయాలి
  7. చివ‌ర‌గా ‘Validate OTP and activate UAN’ పై క్లిక్ చేస్తే యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది.
    ఒక‌సారి యూఏఎన్ యాక్టివేట్ అయిన త‌ర్వాత దానికి ఆధార్‌, బ్యాంక్ ఖాతా సంఖ్యతో అనుసంధానం చేయాలి.

ఈపీఎఫ్ ఖాతా నుంచి వైద్య చిక‌త్స‌, వివాహం, ఉన్న‌త చ‌దువు, ఇంటి కొనుగోలు వంటి కార‌ణాల‌తో పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌లు చేసుకోవ‌చ్చు. ఇదికాకుండా, ప‌ద‌వీవిర‌మ‌ణ‌కు ఏడాది ముందు ఖాతా నుంచి 90 శాతం తీసుకునేందుకు వీలుంది. ఉద్యోగం మానేసిన నెల త‌ర్వాత 75 శాతం తీసుకునే అవ‌కాశం ఉంది. మొత్తం ఉపసంహ‌రించుకునేందుకు రెండు నెల‌ల త‌ర్వాత వీలుంటుంది. ఇటీవ‌ల ఈపీఎఫ్ఓ, ఖాతాదారులే సంస్థ‌తో ప‌నిలేకుండా ఆన్‌లైన్‌లోనే యూఏఎన్ జ‌న‌రేట్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly