అందుబాటులో ఇళ్ల‌కు అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపు

అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌లు తీసుకొచ్చింది.

అందుబాటులో ఇళ్ల‌కు అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపు

రెండోసారి న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత శుక్ర‌వారం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో అందుబాటు ధ‌ర‌లో ఇళ్లు కొనుగోలు చేసేవారికి ప్ర‌భుత్వం మ‌రింత ప‌న్ను మిన‌హాయింపును ప్ర‌క‌టించింది. మార్చి 31, 2020 వ‌ర‌కు గృహ రుణం తీసుకున్న వారికి, ఇంటి విలువ రూ.45 ల‌క్ష‌ల లోపు ఉంటే చెల్లిస్తున్న వ‌డ్డీపై అద‌నంగా రూ.1.5 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం గృహ రుణ వ‌డ్డీపై రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇంటిని కొనుగోలు చేసినా, నిర్మించుకున్నా రుణం మొత్తం, వ‌డ్డీపై వేర్వేరు సెక్ష‌న్ల కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. రుణం మొత్తంపై సెక్ష‌న్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల మిన‌హాయింపు ఉండ‌గా, వ‌డ్డీపై సెక్ష‌న్ 24(బి) కింద ఏడాదికి రూ.2 ల‌క్ష‌ల మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇప్పుడు ప్ర‌క‌టించిన రూ.1.5 ల‌క్ష‌ల మిన‌హాయింపు దీనికి అద‌నంగా ఉంటుంది.

మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన ప‌న్ను మిన‌హాయింపు కేవ‌లం రూ.45 ల‌క్ష‌ల లోపు గృహం కొనుగోలు లేదా నిర్మించేందుకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. కానీ ఇత‌ర స్థిరాస్తుల‌కు అవ‌కాశం లేదు. ఇది ప్ర‌స్తుత ఆర్థిక‌సంవ‌త్స‌రం అంటే మార్చి 31, 2020 వ‌ర‌కే ఉంటుంది. అయితే ఇది కేవ‌లం చిన్న ప‌ట్ట‌ణాలు, టైర్‌-2, 3 న‌గ‌రాల్లో గృహాలు కొనుగోలు చేసేవారికి సౌక‌ర్యంగా ఉంటుంది. ఎందుకంటే టైర్‌-1 న‌గరాల్లో రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల‌న ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly