సిప్‌తో బీమా ఉచితం

ఆదిత్య బిర్లా సెంచురీ సిప్ ప‌థ‌కం ద్వారా పెట్టుబ‌డులు పెడితే ఉచితంగా బీమా స‌దుపాయం కూడా ల‌భిస్తుంది.

సిప్‌తో బీమా ఉచితం

సంప‌ద‌ను సృష్టించుకునేందుకు మ్యూచువ‌ల్ పెట్టుబ‌డులు స‌రైన‌వి. అయితే ఈ పెట్టుబ‌డుల‌తో పాటు బీమా స‌దుపాయం కూడా ల‌భిస్తే అంత‌కంటే ఇంకేం కావాలి. ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సెంచురీ సిప్ (సీఎస్ఐపీ) తో ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డులు పెట్ట‌డంతో పాటు దానికి బీమా క‌వ‌రేజ్ కూడా పొంద‌వ‌చ్చు. పెట్టుబ‌డులు, బీమా రెండింటి క‌ల‌యితో కూడిన‌దే ఆదిత్య బిర్లా ప్ర‌వేశ‌పెట్టిన సెంచురీ సిప్. అయితే ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే బీమా కోసం ప్ర‌త్యేకంగా వెచ్చించాల్సిన అవ‌స‌రం లేదు. పెట్టుబ‌డులు పెడితే ఆటోమేటిక్‌గా బీమా ల‌భిస్తుంది.

సెంచురీ సిప్ అంటే ఏంటి?
సెంచురీ సిప్ రూపంలో క‌ట్టే వాయిదా మొత్తానికి 100 రెట్లు లేదా రూ.50 ల‌క్ష‌ల్లో ఏది త‌క్కువైతే ఆ మొత్తానికి బీమా పాల‌సీ తీసుకోవ‌చ్చు. సిప్ చెల్లింపుల కాల‌ప‌రిమితి పూర్త‌య్యే వ‌ర‌కు లేదంటే 60 సంవ‌త్స‌రాల్లో ఏది ముంద‌యితే అప్ప‌టివ‌ర‌కు బీమా వ‌ర్తిస్తుంది. మొద‌టి సంవ‌త్స‌రం సీఎస్ఐపీ- 10 రెట్లు బీమా, రెండ‌వ సంవ‌త్స‌రానికి 50 రెట్లు, మూడవ సంవ‌త్స‌రానికి 100 రెట్లు ల‌భిస్తుంది.

సిప్ +బీమా
ప్ర‌తినెల కొంత మొత్తాన్ని సిప్ విధానంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగిస్తే ఫ‌లితంగా మీరు ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గా సంప‌ద సృష్టి జ‌రుగుతుంది. దీనికి అద‌నంగా సీఎస్ఐపీ మీ సిప్‌కి 100 రెట్లు అధికంగా బీమా క‌వ‌రేజ్‌ను అందిస్తుంది.

ఇందులో పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు, గ‌రిష్ఠ వ‌య‌సు 51 సంవ‌త్స‌రాలు. బీమా క‌వ‌రేజ్ 60 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ల‌భిస్తుంది. గ‌రిష్ఠ క‌వ‌రేజ్ రూ.50 ల‌క్ష‌లు. మూడేళ్ల త‌ర్వాత సిప్ ఆపేసిన‌ప్ప‌టికీ బీమా క‌వ‌ర్ మాత్రం కొన‌సాగుతుంది. దీనికోసం ఎలాంటి మెడిక‌ల్ టెస్ట్ అవ‌స‌రం లేదు. పెట్టుబ‌డులు మీరు పెడితే బీమా వ్య‌యాన్ని కంపెనీ భ‌రిస్తుంది.

ఎంత బీమా ల‌భిస్తుంది
ఉదాహ‌ర‌ణ‌కు నెల‌కు రూ.25 వేలు చొప్పున సిప్ చేస్తే మొద‌టి ఏడాది 10 రెట్లు అంటే రూ.250000, రెండో ఏడాది 50 రెట్లు అంటే రూ.1250000, మూడో ఏడాది 100 రెట్లు అంటే రూ.2500000 బీమా ల‌భిస్తుంది.

సిప్ మ‌ద్య‌లో నిలిపివేస్తే…
వ‌రుస‌గా మూడేళ్లు సిప్ చేసిన త‌ర్వాత ఆపేస్తే బీమా పాల‌సీ కొన‌సాగుతుంది. ప్రారంభంలో కేటాయించిన యూనిట్ల‌కు స‌మానంగా లేదా గరిష్ఠంగా 100 రెట్లు బీమా వ‌స్తుంది. మూడేళ్ల‌కు ముందే సిప్ నిలిపేస్తే బీమా పాల‌సీ కూడా నిలిచిపోతుంది. సెంచురీ సీప్ విధానం ప్ర‌స్తుతం ఎంపిక చేసిన కొన్ని ఈక్విటీ ఆధారిత ఫండ్ ప‌థ‌కాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని డెట్ ఫండ్ ప‌థ‌కాల్లో కూడా ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవ‌చ్చ‌ని కంపెనీ పేర్కొంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly