75 వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటుతో స‌హా ఎఫ్‌డీఐలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

బొగ్గు తవ్వకం, కాంట్రాక్ట్ త‌యారీ రంగంలో 100 శాతం, డిజిటల్‌ మీడియాలో 26 శాతం ఎఫ్‌డీఐల‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించింది

75 వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటుతో స‌హా ఎఫ్‌డీఐలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

ఆర్థిక వృద్ధిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా, నాలుగు రంగాల్లోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకృతం చేస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణ‌యం తీసుకుంది.
ఇందులో భాగంగా డిజిటల్ మీడియాలో 26 శాతం విదేశీ పెట్టుబడుల‌కు ఆమోద ముద్ర‌వేసింది. బొగ్గు తవ్వకం, కాంట్రాక్ట్ తయారీలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి నిచ్చింది. సింగిల్-బ్రాండ్ రిటైలర్లకు సోర్సింగ్ నిబంధనలను సడలించింది.

బొగ్గు తవ్వకం, అనుబంధ మౌలిక సదుపాయాలలో ఆటోమేటిక్ రూట్ కింద 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఆమోదించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను, వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌ విలేకరులకు వివరించారు. అంత‌ర్జాతీయంగా ఎఫ్‌డీఐలో కొద్ది పాటి మంద‌గ‌మ‌నం క‌నిపిస్తున్న నేప‌థ్యంలో, వృద్ధికి ఊత‌మిచ్చేందుకు కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకున్న‌ట్లు పీయూష్ గోయ‌ల్ తెలిపారు.

దేశీయంగా తయారీని అభివృద్ధి చేసేందుకు, కాంట్రాక్ట్ త‌యారీ రంగంలోనూ, ఆటోమేటిక్ రూట్ కింద 100 శాతం ఎఫ్‌డీఐని అనుతిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. అదేవిధంగా డిజిట‌ల్ మీడియా రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐ అనుమ‌తించామ‌ని గోయ‌ల్ వెల్ల‌డించారు.

ఏక బ్రాండ్‌ రిటైల్‌ వాణిజ్యం(ఎస్‌బీఆర్‌టీ)లోనూ ప్రభుత్వం ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించింది. సోర్సింగ్‌ నిబంధనలను సడలించింది. 30 శాతం తప్పనిసరి స్థానిక సోర్సింగ్‌ నిబంధనల నిర్వచనాన్ని విస్తృతం చేసింది. సంప్రదాయ స్టోర్లను ప్రారంభించకముందే ఆన్‌లైన్‌ విక్రయాలను సైతం కంపెనీలు ప్రారంభించడానికి కేబినెట్‌ ఆమోదించింది.

2021-22 నాటికి రూ.24,375 కోట్ల పెట్టుబడితో 75 అధునాత‌న‌ మెడికల్ కాలేజీలను కూడా కేబినెట్ ఆమోదించింది. దీంతో దేశంలో కొత్త‌గా 15,700 ఎంబీబీఎస్ సీట్లు పెర‌గ‌నున్నాయ‌ని ఐ&బీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించారు. ప్ర‌పంచంలోనే ఎన్న‌డూ లేని విధంగా వైద్య స‌దుపాయాల విస్తర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుద‌ని జ‌వ‌దేక‌ర్ వివ‌రించారు.

60 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చ‌క్కెర‌ను ఎగుమతి చేసేందుకు రూ.6,268 కోట్ల స‌బ్సిడీని ప్ర‌క‌టించారు. ఈ రాయితీ మొత్తం రైతు ఖాతాకు నేరుగా బ‌దిలీ చేయాల‌ని నిర్ణ‌యించారు. దేశంలో 162 ల‌క్ష‌ల చ‌క్కెర నిల్వ ఉండ‌గా అందులో 40 ల‌క్ష‌ల ట‌న్నుల బ‌ఫ‌ర్ స్టాక్ ఉంది. 60 ల‌క్ష‌ల ట‌న్నులు ఎగుమతి అవుతున్నాయి. 2019-20లో చ‌క్కెర మిగులు నిల్వలను ఖాళీ చేసేందుకు చక్కెర ఎగుమతి విధానం సహాయపడుతుందని జవదేకర్ తెలిపారు.

విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ కూటమి (సీడీఆర్‌ఐ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 సెప్టెంబర్ 23 న న్యూయార్క్‌లో జరిగే యుఎన్ క్లైమేట్ సమ్మిట్ సందర్భంగా ప్ర‌ధానీ న‌రేంద్ర మోదీ సీడీఆర్‌ఐని ప్రారంభించనున్నట్లు జవదేకర్ ప్రకటించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly