ఒక్క ఖాతానే అనుమ‌తిస్తారు..

ఒక వ్య‌క్తి పేరుతో కేవ‌లం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. అయితే మైన‌ర్ పేరుతో మ‌రొక ఖాతాను ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంది

ఒక్క ఖాతానే అనుమ‌తిస్తారు..

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిన్న మొత్తాల పొదుపు ప‌థకాల‌లో ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌) ఒక‌టి. క‌చ్చిత‌మైన రాబ‌డితో పాటు, లాభంపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు, అదేవిధంగా సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈఈఈ(మిన‌హాయింపు-మిన‌హాయింపు- మిన‌హాయింపు) కేట‌గిరి కిందికి రావ‌డం వ‌ల్ల పెట్టుబ‌డులు, రాబ‌డి, కాంపౌండ్‌ వ‌డ్డీల‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఒక‌వేళ సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం పెట్టుబ‌డుల‌పై మిన‌హాయింపు పొంద‌క‌పోయిన‌ప్ప‌ట‌కీ, వ‌డ్డీ, కాంపౌండ్ మొత్తంతో దీర్ఘ‌కాలంలో మంచి కార్ప‌స్‌ను కూడ‌బెట్టుకునేందుకు పీపీఎఫ్ ఖాతా స‌హాయ‌ప‌డుతుంద‌ని సెబీ రిజిస్ట‌ర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ‌ర్ జితేంద్ర సోలంకి చెప్పారు.

చ‌ట్ట‌ప్ర‌కారం ఒక వ్య‌క్తి, ఒకే పీపీఎఫ్ ఖాతాను తెరిచేందుకు వీలుంటుంది. అయితే మైన‌ర్ పేరుతో మ‌రొక ఖాతా ప్రారంబించేందుకు అవ‌కాశం ఉంది. ఇద్ద‌రు పిల్ల‌ల పేరుతో ఖాతాలు తెర‌వాలంటే త‌ల్లి ఒక‌రిది, తండ్రి ఒక‌రి పేరుతో తీసుకోవ‌చ్చు. ఇద్ద‌రూ ఒక మైన‌ర్ పేరుతో ఖాతా ప్రారంభించేందుకు వీల్లేదు. పీపీఎఫ్ ఖాతాలో గ‌రిష్టంగా ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మైన‌రు ఖాతాతో క‌లిపి రెండు ఖాతాలు నిర్వ‌హిస్తూ ఉంటే రెండు ఖాతాల‌లో క‌లిపి వార్షికంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టే వీలుంటుంది. త‌ల్లిదండ్రులు జీవించి ఉండ‌గా తాత‌య్య‌, నాయిన‌మ్మ‌లు కూడా మైన‌ర్ పేరుపై ఖాతాను తెరిచేందుకు వీలులేదు. ఒక‌వేళ మీరు ఉద్యోగ రీత్యా వేరే న‌గ‌రానికి మారిన‌ట్ల‌యితే ప్ర‌స్తుతం ఉన్న ఖాతాను మూసివేయ‌డంగానీ, ఖాతాను బ‌దిలీ చేయ‌డం గానీ చేసుకోవ‌చ్చు. లేదా ఇందుకు బ‌దులుగా మ‌రొక ఖాత‌ను తెర‌వ‌వ‌చ్చు. అయితే రెండ‌వ ఖాతాపై వ‌డ్డీ పొంద‌లేరు.

ఒక వ్య‌క్తి పేరుపై ఒక‌టి ఎక్కువ ఖాతాలు ఉండ‌కూడ‌ద‌ని పీపీఎఫ్ నియ‌మాల‌లో స్పష్టంగా ఉంది. ఒక‌వేళ ఒక వ్య‌క్తి ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వ‌హిస్తుంటే, పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై వ‌డ్డీ పొందేందుకు అత‌ను లేదా ఆమెకు అర్హ‌త ఉండ‌దని ముంబైకి చెందిన స్వ‌తంత్ర ఆర్థిక స‌ల‌హాదారు రాజ‌న్ ప‌థ‌క్ తెలిపారు.

ఒక‌వేళ ఒక‌రి పేరుతో ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే వెంట‌నే రెండ‌వ‌ ఖాతాను మూసివేయాలి. రెండ‌వ ఖాతాలో డిపాజిట్ల‌పై ఎలాంటి వ‌డ్డీ ల‌భించ‌దు. సాధార‌ణంగా ఒక‌రు ఒక ఖాతాను తెరిచిన త‌రువాత‌, రెండ‌వ ఖాతాను తెరించేందుకు వీలుండ‌దు. ఎందుకంటే ఖాతా తెరిచేప్పుడు అందుకు ముందు ఆ వ్య‌క్తి పేరుపై ఎటువంటి పీపీఎఫ్ ఖాతా లేన‌ట్లుగా డిక్లరేషన్ మీద సంతకం చేయవలసి ఉంటుంది.

ఒక‌వేళ పొర‌పాటున రెండ‌వ ఖాతాను తెరిచి ఉంటే, రెండు ఖాతాల‌ను ఒకేదానిలో విలీనం చేయాలి. అప్పుడు రెండో ఖాతాలో ఉన్న డిపాజిట్లు , వ‌డ్డీపై న‌ష్టం వాటిల్ల‌దు. దీనికోసం ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖకు Under Secretary-NS Branch MOF (DEA), New Delhi-1 లేఖ‌ను పంపాలి. రెండు ఖాతాల‌కు సంబంధించిన అన్ని వివ‌రాల‌ను పోస్ట్ ద్వారా తెలియ‌జేయాలి. రెండు ఖాతాల్లో కలిసి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో పీపీఎఫ్‌ ప‌రిమితి రూ.1.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా డిపాజిట్ చేస్తే ఆ మిగ‌తా మొత్తం వ‌డ్డీ లేకుండా మీకు రీఫండ్ అవుతుంది.

వీలినం చేసేందుకు గానూ రెండ‌వ ఖాతాను పొర‌పాటున తెరిచిన‌ట్లు మొద‌ట సంబంధిత బ్యాంకు లేదా పోస్టాఫీసు వారికి నిరూపించ‌వ‌ల‌సి ఉంటుంది. అప్పుడు మాత్ర‌మే ఆ వ్య‌క్తి, ఖాతాను విలీనం చేయ‌వ‌ల‌సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ను అభ్య‌ర్థించ‌గ‌ల‌డు. ఖాతాదారుడు చూపే కార‌ణం పైనే ఖాతాల‌ను విలీనం చేసే నిర్ణ‌యం తీసుకుంటారు.

మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌక‌ర్యాన్ని వినియోగించుకోక‌పోతే, మీ పీపీఎఫ్ ఖాతాను బ‌దిలీ చేయ‌డం మంచిది. పోస్టాఫీసులో పాటు, వాణిజ్య బ్యాంకుల్లో కూడా పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌చ్చు. ఈ ఖాతాను పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు లేదా ఒక బ్యాంకు శాఖ నుంచి వేరే శాఖ‌కు బ‌దిలీ చేసుకునే వెసులుబాటు ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly