హాలిడే కోసం ప్యాకేజ్‌డ్ లేదా క‌స్ట‌మైజ్‌డ్ టూర్ ఏది ఎంచుకోవాలి?

ట్రావెల్ సంస్థ‌లు ప్ర‌క‌టించే హాలిడే ప్యాకేజీల‌తో ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు

హాలిడే కోసం  ప్యాకేజ్‌డ్ లేదా క‌స్ట‌మైజ్‌డ్ టూర్ ఏది ఎంచుకోవాలి?

ఏడాదికి ఒక‌సారైనా హాలిడేకి వెళ్లాల‌ని అంద‌రు అనుకుంటారు. అయితే హాలిడేకి వెళ్లిన‌ప్పుడు అయ్యే ఖ‌ర్చుతో జేబుకు చిల్లు ప‌డుతుంది. ఇలా హాలిడే ట్రిప్‌కి వెళ్లిన‌ప్పుడు ట్రావెల్ ఆప‌రేటర్లు ప్ర‌క‌టించే ప్యాకేజీలు తీసుకుంటే ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఇందులో క‌స్ట‌మైజ్‌డ్ టూర్స్, ప్యాకేజ్‌డ్ టూర్స్ రెండూ ఉంటాయి. మీ అవ‌స‌రాల‌కు త‌గిన‌ది, మీకు సౌక‌ర్యంగా ఉండేది ఎంచుకోవాలి.

ధ‌ర‌లు:
సాధార‌ణంగా ప్యాకేజ్‌డ్ టూర్ చాలా గ్రూప్స్‌తో క‌లిపి ఉంటాయి. ఒకే ట్రాన్స్‌పోర్ట్‌లో అంద‌రు క‌లిసి ప్ర‌యాణం చేయ‌వ‌ల‌సి ఉంటుంది. ప్ర‌యాణికులంద‌రికీ హోట‌ల్‌, ఇత‌ర‌ సౌక‌ర్యాలు త‌క్కువ ధ‌ర‌కు కంపెనీ క‌ల్పిస్తుంది. దీంతో ప్యాకేజ్ టూర్‌లో త‌క్కువ ఖ‌ర్చు ఉంటుంది. క‌స్ట‌మ్ టూర్స్‌కి వ్య‌క్తిగ‌తంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఖ‌ర్చు కూడా పెరుగుతుంది. ఖ‌ర్చును బ‌ట్టి చూస్తే ప్యాకేజీ టూర్స్ మంచివి.

ఎంపిక‌:
విహారాల‌కు వెళ్తున్న‌ప్పుడు న‌చ్చిన‌ ప్ర‌దేశం వ‌ద్ద కొంత గ‌డ‌పాల‌నిపిస్తుంది . ప్యాకేజ్ టూర్‌లో ఇందుకు ఆస్కార‌ముండ‌దు. ముందుగా చేసుకున్న ప్లాన్ ప్ర‌కారం వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాల్సి రావొచ్చు. దీంతో న‌చ్చినంత సేపు ఒక ప్రాంతంలో ఉండ‌లేరు. అదే క‌స్ట‌మైజ్‌డ్ టూర్‌లో అయితే మీకు న‌చ్చిన ప్ర‌దేశాల‌ను ఇష్టం ఉన్నంత సేపు చూసుకునే అవ‌కాశం ఉంటుంది. ఈ విషయంలో అయితే క‌స్ట‌మ్ టూర్స్ సౌక‌ర్యంగా ఉంటాయ‌నే చెప్పుకోవ‌చ్చు.

గైడెన్స్:
మొద‌టిసారి ఒక కొత్త‌ ప్రాంతానికి వెళ్తున్న‌ప్పుడు అక్క‌డ ప‌రిస్థితులు, ప‌ద్ద‌తులు, ఆహారం, భాషా వంటివి మీకు తెలియ‌క‌పోవ‌చ్చు. ప్యాకేజ్‌డ్ టూర్స్‌లో అయితే ప్రదేశాల గురించి వివరించేదుకు గైడ్‌ను నియ‌మిస్తారు. క‌స్ట‌మైజ్‌డ్ టూర్‌లో ఇలాంటి అవ‌కాశం ఉండ‌దు. ఒక‌వేళ గైడ్ అవ‌స‌ర‌మ‌నుకుంటే అద‌నంగా చెల్లించాల్సి రావొచ్చు లేదా అక్క‌డ ప‌రిస్థితులు తెలియ‌క ఇబ్బంది ప‌డాల్సి రావొచ్చు. ఈ విష‌యంలో కూడా ప్యాకేజ్‌ట్ టూర్‌కే ప్రాధాన్య‌త ఇవ్వాలి.

ప్రైవ‌సీ:
ప్యాకేజ్‌డ్ టూర్‌లో చాలామందితో క‌ల‌సి ప్ర‌యాణం చేయ‌వ‌ల‌సి ఉంటుంది. కొంద‌రికి అది ఇష్టం ఉండ‌క‌పోవ‌చ్చు. మీ కుటుంబం లేదా స్నేహితుల‌తో గడిపేందుకు ప్రైవ‌సీ ఉండ‌దు. క‌స్ట‌మైజ్‌డ్ టూర్‌లో అయితే ప్రైవ‌సీ ఉంటుంది. మీకు కావ‌ల‌సిన వారితోనే ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ప్రైవ‌సీ కోరుకునేవారికి మాత్రం క‌స్ట‌మ్ టూర్ బాగుంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly