పీపీఎఫ్ గురించి అతి ముఖ్య‌మైన అంశాలు

15 ఏళ్ళ త‌ర్వాత కూడా డిపాజిట్ చేస్తూ లేదా చేయ‌కుండా కూడా కొనసాగించొచ్చు

పీపీఎఫ్ గురించి అతి ముఖ్య‌మైన అంశాలు

ప‌న్ను మిన‌హాయింపుతో కూడిన‌ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు పీపీఎఫ్‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. చందాదారుడు ఏడాదికి ఒక‌సారి రూ.500 నుంచి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ ఖాతాలో జ‌మ‌చేయ‌వ‌చ్చు. వ‌డ్డీ రేట్లు ప్ర‌తీ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తారు. ప్ర‌స్తుతం ఏప్రిల్‌-జూన్ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్లు 8 శాతంగా ఉన్నాయి. 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి క‌లిగిన ఈ ప‌థ‌కాన్ని ఆ త‌ర్వాత 5 సంవ‌త్స‌రాల చొప్పున పొడ‌గించుకునే అవ‌కాశం ఉంది. దీనిపై ఆదాయ ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. ఎన్ఆర్ఐ ల‌కు పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించే అవ‌కాశం లేదు. అయితే దేశంలో ఉన్న‌ప్పుడు ప్రారంభిచిన పీపీఎఫ్ ఖాతాను విదేశాల్లో స్థిర‌ప‌డిన త‌ర్వాత కూడా కొన‌సాగించవ‌చ్చు.

 1. పీపీఎఫ్‌ఫై వ‌డ్డీ ఎక్కువ పొంద‌డం ఎలా
  పీపీఎఫ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఫిక్స్‌డ్‌గా ఉండ‌వు. ప్ర‌తీ త్రైమాసికానికి ఒక‌సారి ప్ర‌భుత్వం వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రిస్తుంది. ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌ర్లో వ‌డ్డీ రేటును లెక్కించి ఖాతాలో జ‌మ‌చేస్తారు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఖాతాదారుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో లేదా ఏడాదికి 12 సార్లు డ‌బ్బును జ‌మచేయ‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే ప్ర‌తి నెల 5 వ తేదీ నుంచి చివ‌రి వ‌ర‌కు ఉన్న‌ త‌క్కువ బ్యాలెన్స్ పై వ‌డ్డీ లెక్కిస్తారు. అందుకే ప్ర‌తి నెల 5 వ తేదీకి ముందే ఖాతాదారుడు ఖాతాలో డిపాజిట్ చేస్తే ఎక్కువ వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. అంటే ఏప్రిల్ 5 కంటే ముందు ఖాతాలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో జ‌మ చేస్తే సంవ‌త్స‌రం మొత్తానికి ఎక్కువ వ‌డ్డీ పొంద‌వ‌చ్చు.

 2. పీపీఎఫ్ ఖాతా ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌
  కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో పీపీఎఫ్ ఖాతాను ముంద‌స్తుగా మూసివేయ‌వ‌చ్చు. ప్రారంభించిన 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ స‌దుపాయం ఉంటుంది. ఖాతాదారుడి భార్య లేదా భర్త‌కు త‌మ‌పై ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రుల‌కు లేదా పిల్ల‌ల‌కు ప్రాణాంత‌క వ్యాదుల‌ చికిత్స కోసం తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఉన్న‌త విద్య కోసం కూడా ఈ డ‌బ్బును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అయితే పీపీఎఫ్ ఖాతాను ముంద‌స్తుగా ఉప‌సంహ‌రిస్తే 1శాతం త‌క్కువ వ‌డ్డీ ల‌భిస్తుంది.

 1. చ‌ట్ట‌ప‌ర‌మైన భ‌ద్ర‌త‌
  పీపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం ప్ర‌భుత్వ సంర‌క్ష‌ణ‌లో ఉంటుంది. ఏదైనా రుణం విష‌యంలో డిపాజిట‌ర్‌పై కోర్టు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బును తీసుకునేందుకు వీలుండ‌దు. కేవ‌లం ఆదాయ ప‌న్ను శాఖ‌కు మాత్ర‌మే దీనిపై హ‌క్కు ఉంటుంది.

 2. పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌
  పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌తీ ఏడాది కొంత మొత్తంలో పాక్షికంగా ఉప‌సంహ‌ర‌ణ చేసుకునేందుకు వీలుంటుంది. నాలుగో సంవ‌త్స‌రంలో ఖాతాలో ఉన్న మొత్తంపై 50 శాతం లేదా గ‌త సంవ‌త్స‌రం ఖాతాలో ఉన్న మొత్తం ఏది త‌క్కువ‌గా ఉంటే అంత మొత్తం తీసుకోవ‌చ్చు. 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఖాతా పొడ‌గింపు స‌మ‌యంలో కూడా పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు వీలుంటుంది.

 3. పీపీఎఫ్ ఖాతా పొడ‌గింపు
  పీపీఎఫ్ ఖాతా 15 సంవ‌త్స‌రాల‌కు మెచ్యూరిటీ పూర్త‌వుతుంది. దీనిని మ‌రింత‌కాలం కొన‌సాగించే అవ‌కాశం కూడా వినియోగ‌దారుల‌కు ఉంది. కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత డిపాజిట్ చేస్తూ లేదా చేయ‌కుండా కూడా ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. కానీ దీనికోసం చందాదారుడు ఫారం హెచ్‌ను ఏడాదిలోగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 5 సంవ‌త్స‌రాల చొప్పున ఎన్నిసార్ల‌యినా ఖాతాను కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. దీనికి ఎటువంటి ప‌రిమితి లేదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly