మీ ఖాతాదారుని గురించి తెలుసుకోండి (కే వై సీ)

బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు అందించవలసిన కే వై సీ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

మీ ఖాతాదారుని గురించి తెలుసుకోండి (కే వై సీ)

ఆర్థిక కార్యకలాపాలు జరిపేందుకు మాధ్యమాల్లాంటివి బ్యాంకులు. ఒక రంగంలో ఎక్కువగా ఉన్న వనరులను సేకరించి తక్కువ వనరులున్న వాటిలో పెట్టుబడి పెట్టడమో లేదా వారికి అప్పు ఇవ్వడమో బ్యాంకుల ప్రధాన పని. సాధారణ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులను బ్యాంకులు సేకరిస్తుంటాయి. పరోక్షంగా బ్యాంకులు ప్రజల డబ్బుకు రక్షకులు. నమ్మకమైన వినియోగదారులను సంపాదించడమే బ్యాంకుల లక్ష్యం. ఇందుకోసం బ్యాంకులు అవలంబిస్తున్న పద్ధతి ‘ పరిచయ కార్యక్రమం’. బ్యాంకులో ముందే ఖాతా కలిగిన వారు ‘కొత్త ఖాతాదారును’ పరిచయం చేస్తుండేవారు.

ఈ కొత్త ఖాతాదారును పరిచయం చేయడం అనే ప్రక్రియ అక్రమ కార్యకలాపాలకు ఆవకాశం వుంది అని, పాత మార్గదర్శకాల స్థానే కొత్త మార్గదర్శకాలను రూపొందించి ‘మీ ఖాతాదారును తెలుసుకోండి’ (కేవైసీ) అనే కొత్త విధానాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది.

ఖాతాదారు గుర్తింపును ధ్రువీకరించడం, అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసి ఉంచడం కేవైసీ ప్రధాన లక్ష్యాలు.
బ్యాంకు ఖాతా తెరిచేందుకు మీ ఖాతాదారును తెలుసుకోండి నమోదు ప్రక్రియ సామాన్యులకు కష్టంగా ఉండేది. భారతీయ రిజర్వు బ్యాంకు కేవైసీ మార్గదర్శకాల్లో సంస్కరణలు చేపట్టి సులభతర కేవైసీ పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది.
ఈ నూతన కేవైసీ విధానం అటు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఇటు బ్యాంకుల పరిరక్షణ రెండింటినీ కాపాడేలా ఉంది.

సులభతర కేవైసీ పద్ధతి:

చిరునామా, గుర్తింపునకు ఒకే ధ్రువీకరణ పత్రం:

ఓ వ్యక్తి గుర్తింపు, చిరునామా ఒకే పత్రంలో ఉంటే దాన్నే ఉపయోగించి బ్యాంకు ఖాతా తెరవవచ్చు. అలాంటి వాటిలో పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు కార్డు, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ గుర్తింపు కార్డు… వీటిలో ఏ ఒక్క ధ్రువీకరణ పత్రం ఇచ్చినా సరిపోతుంది.

ప్రస్తుత చిరునామా కోసం ప్రత్యేంగా చిరునామా గుర్తింపు ఇవ్వనక్కర్లేదు. బదిలీపై వచ్చిన ఉద్యోగులు, వలస కార్మికులు తరచూ చిరునామా గుర్తింపు పత్రం అందించడంలో ఇబ్బందులకు గురవుతుంటారు. ఇలాంటి వారు శాశ్వత లేదా ప్రస్తుత చిరునామాల్లో ఏదైనా ఒకటి ఇస్తే సరిపోతుంది. ప్రస్తుత, శాశ్వత చిరునామాలు వేరుగా ఉంటే ప్రస్తుత చిరునామా పేర్కొంటే సరిపోతుంది.
ఒకే బ్యాంకుకు సంబంధించిన ఖాతాను ఒక శాఖ నుంచి మరోదానికి బదిలీ చేసుకునేటప్పుడు కొత్త కేవైసీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మారిన చిరునామాను బ్యాంకు శాఖకు తెలియజేస్తే సరిపోతుంది.

ఇతర గుర్తింపు పత్రాలు:

పెద్దగా ఇబ్బందులు తలెత్తవని భావించిన ఖాతాదారుల నుంచి బ్యాంకు ఇతర గుర్తింపు పత్రాలను సైతం స్వీకరిస్తుంది.

  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఇచ్చే ఫొటోతో కూడిన గుర్తింపు పత్రం
  • ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు
    ఇచ్చే గుర్తింపు పత్రం
  • బ్యాంకు ఖాతా తెరిచే వ్యక్తి ఫొటోతో ఉన్న పత్రంపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరిస్తూ సంతకం చేసిన పత్రం

సూక్ష్మ ఖాతాలకు:

సామాన్య పేద ప్రజల ప్రయోజనార్థం సూక్ష్మ ఖాతాలను ప్రవేశపెట్టారు. పైన పేర్కొన్న గుర్తింపు, చిరునామా పత్రాలు లేనివారు సైతం తక్కువ మొత్తం సొమ్ముతో బ్యాంకు ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంది. బ్యాంకు అధికారి ఎదుట సంతకం చేసి, ఫొటోతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి సూక్ష్మ ఖాతాల్లో ఒక ఏడాదికి రూ.లక్షకు మించకూడదు. ఒక నెలకు విత్‌డ్రాయల్స్‌ రూ.10వేలు మించకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాతాలో సొమ్ము రూ.50వేలకు మించరాదు. ఇలాంటి ఖాతాల కాలపరిమితి సాధారణంగా 12 నెలలు ఉంటుంది. చిరునామా, గుర్తింపు పత్రాలకు దరఖాస్తు చేసుకున్నట్టు నివేదిస్తే మరో 12 నెలలకు ఖాతా పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

చివరిగా:

సరైన చిరునామా, గుర్తింపు పత్రం పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఖాతా తెరిచేందుకు సరైన పత్రాలతో బ్యాంకును సంప్రదించాలి.
మన జీవితంలో బ్యాంకు ఖాతా తెరవడం అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటి. ఆర్థిక ప్రణాళికలో మొదటి మెట్టు బ్యాంకు ఖాతా తెరవడం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly