డెరివేటివ్స్‌ మార్కెట్ అంటే !!

ముంద‌స్తు వ్యాపార ఒప్పందం ప్ర‌కారం లావాదేవీలు జ‌ర‌ప‌డం వ‌ల్ల ఇరు వ‌ర్గాలకు ల‌బ్ధి చేకూరే అవ‌కాశాలు పుష్క‌లం.

డెరివేటివ్స్‌ మార్కెట్ అంటే !!

కాలానుగుణంగా వస్తువులు, సేవల ధరల్లో మార్పులు స‌హ‌జం. సరఫరా గిరాకీల‌ను బట్టి ధ‌ర‌లు ఏడాదికి, నెలకు, వారానికి ఇంకా చెప్పాలంటే క్షణానికే మారవచ్చు. ఈ రోజు కొన్న వస్తువు విలువ రేపు ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువ ధర ప‌ల‌క‌వ‌చ్చు. ఈ ధరల తేడాలు ఆర్థిక విపణిలో ‘డెరివేటివ్‌ మార్కెట్స్‌’ అనే కొత్త విభాగానికి తెరలేపింది.

వ్యాపారులు భవిష్యత్తులో కొనుగోలు/అమ్మకాలు జరిపేందుకు ఏదైనా వస్తువు ఫలానా ధరకు ల‌భిస్తుంది లేదా అమ్ముడ‌వుతుంద‌ని అంచ‌నా వేసి ట్రేడింగ్‌ నిర్వహించుకునేందుకు డెరివేటివ్‌ మార్కెట్స్‌ తోడ్పడతాయి.

డెరివేటివ్స్‌లో మొదట హెడ్జింగ్‌ సదుపాయం ఆవిర్భవించింది. తర్వాత ఆర్బిట్రేజర్లు, స్పెక్యులేటర్లు ముందుకు వచ్చి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవేంటో వివరంగా తర్వాత చూద్దాం.

డెరివేటివ్స్‌:

రెండు పార్టీల మ‌ధ్య జ‌రిగే ముంద‌స్తు వ్యాపార ఒప్పందాన్నే డెరివేటివ్‌లు అంటారు. ఫ్యూచ‌ర్లు, ఫార్వ‌ర్డులు, ఆప్ష‌న్లు ఈ కోవ‌లోకి వ‌స్తాయి.
ఏదైనా ఆస్తిని భవిష్యత్తులో ఫలానా విలువకు కొనేందుకు కొనుగోలుదారు అమ్మకందారు మధ్య కుదర్చుకునే ఒప్పందాన్ని ‘కాంట్రాక్టు’ అని అంటారు. ఇక్కడ ఆస్తులు అంటే షేర్లు, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీ మారక విలువ, వడ్డీ రేట్లు, మార్కెట్‌ సూచీలు ఇలా ఏదైనా ఉండొచ్చు. వీటి ధ‌ర‌ల క‌ద‌లిక ఆధారంగా ట్రేడ‌య్యే కాంట్రాక్టుల‌నే డెరివేటివ్స్‌ అంటారు. ఈ డెరివేటివ్స్‌ను హెడ్జింగ్‌, ఆర్బిట్రేజ్‌, స్పెక్యులేషన్‌ వివిధ రకాల ట్రేడింగ్‌ పద్ధతులకు అనుసరిస్తారు.

ప్రధానంగా అందుబాటులో ఉన్న డెరివేటివ్స్

  • ఫార్వర్డ్స్‌
  • ఫ్యూచర్స్‌
  • ఆప్షన్స్‌
  • స్వాప్స్
    DERIATIVES-2.jpg

డెరివేటివ్‌ల ప్ర‌స్థానం

భార‌త విప‌ణిలో డెరివేటివ్‌ల ప్ర‌స్థానం ఎప్ప‌టినుంచో మొద‌లైంది. 19వ శ‌తాబ్దంలోనే క‌మోడిటీ డెరివేటివ్ మార్కెట్ ప్రారంభ‌మైంది. 1875లో కాట‌న్ ట్రేడ్ అసోసియేష‌న్ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి డెరివేటివ్ మార్క‌ట్లు సంఘ‌టితంగా ప‌నిచేయ‌డం ప్రారంభించాయి. ప‌త్తితో షురూ అయిన ట్రేడింగ్ ఇత‌ర క‌మోడిటీల‌లో నిదానంగా ఆరంభ‌మ‌య్యింది.

స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప‌రిచ‌యం

ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ డెరివేటివ్‌లను జూన్ 2000 సంవ‌త్స‌రంలో మ‌న దేశంలోని రెండు ప్ర‌ధాన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప‌రిచ‌యం చేశారు. ఈ ఎక్స్ఛేంజీల్లో ప్ర‌స్తుతానికి వివిధ కాంట్రాక్టుల ట్రేడింగ్ జ‌రుగుతూ ఉంది.

డెరివేటివ్ మార్కెట్లు మ‌న‌దేశంలో శ‌ర‌వేగంగా దూసుకెళ్లాయి. ముఖ్యంగా నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో వీటి హ‌వా గ‌త కొంత కాలంగా మ‌రింత పెరిగింది.

న‌ష్ట‌భ‌యాన్ని అదుపులో పెట్టేలా…

డెరివేటివ్‌లు మార్కెట్ న‌ష్ట‌భ‌యాల‌ను దూరంగా ఉంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చాయి. ఇవి న‌ష్టానికి బ‌ల‌మైన అడ్డుగోడ‌లుగా నిలిచాయని అభివ‌ర్ణించ‌వ‌చ్చు.

కొత్త ఒర‌వ‌డికి నాంది

ఆర్థిక సేవ‌ల ప‌రిశ్ర‌మ‌ల విభాగంలో డెరివేటివ్‌లు ఓ కొంగొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన‌ట్ట‌య్యింది. క్యాపిట‌ల్ మార్కెట్ల‌లో ఇవి సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇన్ని ప్ర‌యోజ‌నాల న‌డుమ డెరివేటివ్‌ల ట్రేడింగ్ క్లిష్ట‌మైన‌ది, న‌ష్టాల‌ను చ‌విచూపించే విధంగా ఉందనేది ఒక లాంటి ఆందోళన ప్రజల్లో ఇమిడి పోయింది . చ‌రిత్ర‌లో డెరివేటివ్‌ల వ‌ల్ల న‌ష్టపోయిన దాఖ‌లాలు కోకొల్ల‌లు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly