కొత్త‌గా పెళ్ళైన వారికి పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు

వివాహానంత‌రం భాద్య‌త‌లతో ఒత్తిడికి లోన‌వ‌కుండా ఆర్థిక ప్ర‌ణాళికను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.

కొత్త‌గా పెళ్ళైన వారికి పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు

పెళ్లైన ప్ర‌తి జంట‌కి సాధార‌ణంగా ఉండే ల‌క్ష్యాలు-ఇల్లు, కారు వంటివి కొనుగోలు చేయడం. పిల్ల‌లు పుట్టిన త‌రువాత వారి పోష‌ణ‌, విద్య, విహ‌హం, ప‌దివీవిర‌మ‌ణ జీవితానికి కావ‌ల‌సిన నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం. ఇందులో కొన్ని దీర్ఘకాల ల‌క్ష్యాలు అయితే మ‌రికొన్ని స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాలు.ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అనేది అంద‌రికీ అవ‌స‌ర‌మే. ఇది ఒక స్ప‌ష్ట‌మైన బ‌డ్జెట్‌ను రూపొందించుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఇది సాధ్య‌ప‌డుతుంది. అందువ‌ల్ల‌ కొత్త‌గా జీవితాన్ని ప్రారంభించేవారు ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాలి. ముందు పొదుపు చేయ‌డం అల‌వాటు చేసుకుని, త‌రువాత‌ మాత్ర‌మే ఖ‌ర్చుచేయాలి. మొట్ట‌మొద‌టిగా ఉన్న‌త చ‌దువులు, ఫ్యామిలి ప్రారంభం, విహార యాత్ర‌లు, కారు, గృహం వంటి మీ వ్య‌క్తిగ‌త ఆర్థిక ల‌క్ష్యాలు, చ‌ర్చించుకోవాలి. మీ వివాహ జీవితానికి అధిక ప్రాధాన్య‌త నిచ్చే ల‌క్ష్యాల‌ను, స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక ల‌క్ష్య‌లుగా విభ‌జించి, వాటికి త‌గిన పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంపిక చేసుకోవాలి. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకుంటూ ఉండాలి. వివాహానికి ముందు నుంచి మీకున్న భాద్య‌త‌లు, తీసుకున్న రుణాలు, ఆస్తులు, అప్పులు మొద‌లైన వాటిని ఏకీక‌రించాలి. స్టాక్స్, మ్యూచువ‌ల్ ఫండ్లు, బంగారం, ఇత‌ర ఆస్తులు వివరాలు, మీ నెల‌వారీ సంపాద‌న, ఖ‌ర్చు, పొదుపు వంటి వాటిని అంచనా వేయండి. అంతేకాకుండా ఇత‌ర వ‌న‌రుల ద్వారా వ‌చ్చే ఆదాయం, రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లు వంటి వాటిని కూడా ఇందులో చేర్చాలి. మీ ఉమ్మ‌డి ల‌క్ష్యాలు వాటి కోసం మీరు గ‌తంలో చేసిన పెట్టుబ‌డుల‌ను రివ్యూ చేసుకుని మిగిలిన ల‌క్ష్యాల‌కు వాటికి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డులు పెట్టాలి.

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం మ‌దుపు చేయాల‌నుకునే వారికి 5 పెట్టుబ‌డి మార్గాలు:

 1. రియ‌ల్ ఎస్టేట్‌:
  ఇంటి కొనుగోలు అనేది ఒక మంచి పెట్టుబ‌డి మార్గం. ఇది అధిక వ్య‌యంతో కూడిన‌ది. కొత్త‌గా పెళ్లైన జంట‌లు, వారు ప‌నిచేసే ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర‌గా అన్ని వ‌స‌తుల‌తో కూడిన, చుట్టుప్ర‌క్క‌ల ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలి. ఈ సౌక‌ర్యాల‌తో ఇంటిని కొనుగోలు చేస్తే దాన్ని తిరిగి విక్ర‌యించినప్పుడు మంచి విలువ వ‌స్తుంది. త్వ‌రితగ‌తిన విక్ర‌యించేందుకు కూడా వీల‌వుతుంది.
  మీ ప్రస్తుత‌, భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, మీ ప్రస్తుత అవసరాలతో వీటిని సంతులనం చేస్తూ, ఇంటిని కొనుగోలు చేయాలి. కుటుంబం, ఆర్ధిక సామర్ధ్యము పెరుగుతున్న కొద్ది, అవ‌స‌రాల‌కు త‌గినట్లుగా భ‌విష్య‌త్తులో మ‌రొక ఇంటిని కొనుగోలు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో ద్రవ్యోల్బణాన్ని అధిగ‌మించ‌డంతోపాటు, అద్దె ఆదాయం నుంచి మరింత రాబడిని సంపాదించవచ్చు.
 1. నెల‌వారీ సిప్‌(సిస్ట‌మేటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్‌):
  చాలా మంది వారి వ‌ద్ద అధిక మొత్తంలో న‌గ‌దు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే పెట్టుబ‌డులు పెడుతుంటారు. చిన్న‌చిన్న మొత్తాల‌ను త‌రుచుగా పెట్ట‌బ‌డి పెట్ట‌డం ద్వారా పెద్ద మొత్తంలో పొదుపు చేయ‌వ‌చ్చ‌ని వారికి తెలియ‌దు. సిస్ట‌మేటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్‌(సిప్‌) ద్వారా ప్ర‌తి నెల రూ. 10 వేలు, 12శాతం రాబ‌డి అంచ‌నాతో ఈక్వీటీ స్కీమ్‌లో పెట్టుబ‌డి పెడితే 20 సంవ‌త్స‌రాల‌లో రూ.1 కోటి నిధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. నెల‌వారీగా సిప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకోవ‌డం మాత్ర‌మే కాకుండా అధిక రాబ‌డిని కూడా పొంద‌వ‌చ్చు.

 2. జీవిత బీమా:
  జీవిత బీమా పెట్టుబ‌డులను చాలా మంది నిర్ల‌క్ష్యం చేస్తారు. ట‌ర్మ్ పాల‌సీ అనేది పాలీస‌దారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు అత‌ను/ ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండ‌గా ఉంటుంది. అనుకోకుండా ప్ర‌మాద‌వ‌శాత్తు ఒక‌రికి ఏమైనా జ‌రిగితే రెండ‌వ వారు ఆర్థికంగా ఇబ్బందుల‌కు గురికాకుండా జీవిత బీమా స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా ప్రీమియం చెల్లింపుల‌పై ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపును పొంద‌వచ్చు. ఎండోమెంట్‌, మ‌నీబ్యాక్ యులిప్స్ వంటి సంప్ర‌దాయ పాల‌సీలు ఎక్కువ ప్రీమియంతో త‌క్కువ హామీని ఇస్తుంటాయి. వాటి కంటే త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీని ఇచ్చే ట‌ర్మ్ బీమా పాల‌సీని తీసుకోవ‌డం మంచింది. వీలైనంత తొంద‌ర‌గా జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేయడం మంచిది. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది, జీవిత బీమా కొనుగోలు విలువ పెరుగుతుంది. మీ వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు హామీ మొత్తం ఉండే విధంగా జీవిత బీమా కొనుగోలు చేయాలి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, మ్యాక్స్ లైఫ్‌, ఎస్‌బీఐ వంటివి కొన్ని ట‌ర్మ్ బీమా పాల‌సీలు.

 3. ఆరోగ్య బీమా:
  వైద్య ఖ‌ర్చులు రోజు రోజుకు పెరుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉండాలి. మీరు ప‌నిచేసే సంస్థ ద్వారా మీకు ఇప్ప‌టికే ఆరోగ్య బీమా పాల‌సీ ఉండ‌చ్చు. వివాహానంత‌రం వ్య‌క్తిగ‌త పాల‌సీల‌ను ఫ్యామిలీ ఆరోగ్య బీమా పాల‌సీగా మార్చుకుని, క‌వ‌రేజ్ పెంచుకోవాలి.
  వ‌య‌సుతో పాటు ఆరోగ్య సంర‌క్ష‌ణా ఖ‌ర్చులు కూడా పెరుగుతుంటాయి. మీపైన ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రులకు కూడా ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవాలి. సీనియ‌ర్ సిటిజ‌ర్ల‌కు అనేక ఆరోగ్య బీమా పాల‌సీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. కొన్ని బీమా సంస్థ‌లు, వారు అందించే పాల‌సీలోని అంశాలు, నియ‌మ నిబంధ‌న‌లు, ప‌రిమితులు, ఉప ప‌రిమితులు వంటి వాటిని దాచిపెడుతుంటాయి. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు చేసే ముందు మీ పాల‌సీ వివ‌రాల‌ను పూర్తిగా చ‌దివి స‌రైన పాల‌సీని ఎంచుకోవాలి. మ్యాక్స్‌బూపా, అపోలో మ్యునిచ్‌, స్టార్‌హెల్త్‌, సిగ్నా టీటీకే వంటివి కొన్నిఫ్లోట‌ర్ ప్లాన్లు. రూ.2 నుంచి రూ. 3 ల‌క్ష‌లకు సాధార‌ణ ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకుని రూ. 5 నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు సూప‌ర్ టాప్ అప్ ప్లాను తీసుకోవాలి.

 4. అత్య‌వ‌స‌ర నిధి:
  జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మ‌నం చెప్ప‌లేం. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏ నిమిషంలోనైనా రావ‌చ్చు. ఉద్యోగం కోల్పోవ‌డం, అనారోగ్యం, ప్ర‌కృతి వైప‌రిత్యాలు వంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో కూడా ఆర్థికంగా సిధ్దంగా ఉండాలి. ఇత‌ర పొదుపు ప్ర‌ణాళిక‌లతో పాటు 3 నుంచి 6 నెల‌లు జీవించ‌డానికి స‌రిప‌డ అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఇత‌ర ఆస్తులు ఉన్న‌ప్ప‌టికీ వాటిని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో న‌గ‌దు రూపంలోకి మార్చడం క‌ష్టంకావ‌చ్చు. వివిధ పొదుపు ఖాతాల‌లో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో న‌గ‌దును ఉంచ‌డం మంచిది.

చివ‌రిగా:
కొత్త‌గా పెళ్లైన వారు ఈ రోజుల్లో విభిన్న ఆర్థిక అనుభవాలను ఎదుర్కొంటున్నారు. వివాహానంత‌రం భాద్య‌త‌లతో ఒత్తిడికి లోన‌వ‌కుండా ఒక ఆర్థిక ప్ర‌ణాళిక‌ను సిద్దంచేసుకోవాలి. ప్ర‌తి దానిలో పార‌ద‌ర్మ‌క‌త ఉండాలి. ఆదాయం, అప్పులు, పెట్టుబ‌డులు, వంటి వాటిని త‌రుచుగా స‌మీక్షించుకుంటూ ఉండాలి. మంచి న‌గ‌దు నిర్వ‌హ‌ణ అల‌వ‌ర‌చుకుంటే జీవితంలోని ప్ర‌తిద‌శ‌లో విజ‌యం సాధిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly