భారీగా త‌గ్గిన ఇండియ‌న్ ఆయిల్ గ్యాస్‌ సిలిండ‌ర్ ధ‌ర‌

స‌బ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌పై త‌గ్గిన ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లులోకి రానున్నాయి.

భారీగా త‌గ్గిన ఇండియ‌న్ ఆయిల్  గ్యాస్‌ సిలిండ‌ర్ ధ‌ర‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) కెంపెనీ గ్యాస్‌ వినియోగదారులకు శుభ‌వార్త‌. సబ్సిడీలేని గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.100.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో న‌గ‌రాల‌లో స‌బ్సిడీలేని 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 637కు త‌గ్గింది. గ‌త నెల‌లో దీని ధ‌ర రూ. 737.50గా ఉండేది.

ముంబాయి న‌గ‌రంలో స‌బ్సిడిలేని ఎల్‌పీజీ ధ‌ర రూ.608.50గానూ, చెన్నైలో రూ.652.50గానూ, కొల్‌క‌త్తాలో రూ.662.50గానూ ఉంది. ఇక సబ్సిడీ ఎల్పీజీ ధరను దిల్లీలో మూడు రూపాయిలు త‌గ్గించి రూ.494.35గా ఐవోసీ నిర్ణయించింది. సబ్సిడీ ఎల్పీజీ ధర ముంబాయిలో రూ. 497.37, చెన్నైలో రూ.482.23, కోల్‌క‌త్తాలో రూ.497.47గా ఉంది.

ఎల్‌పీజీ వినియోగ‌దారులంద‌రూ గ్యాస్‌ను మార్కెట్ రేటుకే కొనుగోలు చేయాలి. అయితే ప్ర‌స్తుతం ఏడాదికి, ఒక్కో కుటుంబానికి 14.2 కేజీల బ‌రువు గ‌ల 12 సిలిండ‌ర్‌ల‌ను ప్ర‌భుత్వం రాయితీపై అందిస్తుంది. ఈ రాయితీ సొమ్ము వినియోగ‌దారుల బ్యాంకు ఖాత‌లో నేరుగా జ‌మచేస్తారు. అంత‌ర్జాతీయ బెంచ్‌మార్క్ ఎల్‌పీజీ, విదేశీ ఎక్స్‌ఛేంజ్ రేట్ల స‌గ‌టు ఆధారంగా ప్ర‌భుత్వం వినియోగ‌దారునికి ఇచ్చే ఎల్‌పీజీ రాయితీ ప్ర‌తీ నెల మారుతూ ఉంటుంది. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెరిగితే ప్రభుత్వం అధిక రాయితీనిస్తుంది. కానీ ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం ఇంధ‌న ధ‌ర మార్కెట్ రేటు ఆధారంగా ఎల్‌పీజీపై జీఎస్‌టీని లెక్కిస్తారు. స‌బ్సిడీ సిలిండ‌ర్ల‌పై ఈ ప‌న్నులో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం చెల్లించే అవ‌కాశం ఉంది. అయితే ప‌న్ను మాత్రం మార్కెట్ రేట్ల ప్ర‌కార‌మే చెల్లించాలి. ఇది స‌బ్సిడీ సిలిండ‌ర్ల‌పై ధ‌ర పెరుగుద‌ల లేదా త‌గ్గుద‌ల‌కు దారితీస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ గ్యాస్‌ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్ర‌తీనెల ప్రారంభంలో ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly