బ‌డ్జెట్‌తో ఖ‌ర్చుల నియంత్ర‌ణ‌

బ‌డ్జెట్ వేసుకుంటే దేనికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నామో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. అప్పుడు అన‌వ‌స‌ర‌ ఖ‌ర్చుల‌ను నియంత్రించుకునే అవ‌కాశం ఉంటుంది

బ‌డ్జెట్‌తో ఖ‌ర్చుల నియంత్ర‌ణ‌

బడ్జెట్ అనగానే మనకు గుర్తుకువచ్చేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రవేశ పెట్టే ప్రతిపాదనలు. ఏ ఏ వనరుల ద్వారా ఆదాయం పొందుతారు, దానిని ఏ ఏ పథకాలలో ఖర్చు చేస్తారో చెబుతారు. ఇందులో ప్రజా శ్రేయస్సుతోపాటు తాయిలాలు, రాజకీయ లక్ష్యాలు కూడా ఉంటాయి. అయితే ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం.
మరి మన ఇంటి బడ్జెట్ గురించి తెలుసుకుందామా . ప్రతి వ్యక్తి సంపాదించే నాటినుంచే నెలవారీ బడ్జెట్ వేసుకోవాలి. దీనిలో వస్తున్న ఆదాయాన్ని ఏ ఏ ఖర్చులకు ఎంత అవసరం అవుతాయి, ఎంత సొమ్ము మిగులుతోంది, దానిని ఎలా మదుపు చేస్తున్నామో తెలుసుకోవాలి . ఏవి రోజువారీ ఖర్చులు , ఏవి నెలవారీ ఖర్చులు , ఏవి కాలాన్ని బట్టి ఉండేవి, ఏవి ఆరునెలలకు లేదా ఏడాదికి ఒకసారి ఉండేవి అని గుర్తించాలి. బట్టల కొనుగోలు, సెలవులలో ప్రయాణాలు వంటివి కాలాన్ని బట్టి ఉండే ఖర్చులు. బీమా ప్రీమియంలు నెలవారీ ఉండవచ్చు, ఏడాదికి ఉండవచ్చు. ఈ విధంగా గుర్తించి, అంత సొమ్మును అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. మిగిలిన సొమ్మును మదుపు చేయడం ద్వారా వడ్డీని పొందవచ్చు. అధిక మొత్తం అవసరమైన పథకాలకు ముందునుంచే కొంచెం మొత్తంతో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో అధిక మొత్తం పొందవచ్చు.

  • బీమా ప్రీమియం, నీరు, విద్యుత్ , క్రెడిట్ కార్డు బిల్లులను, ఈ ఎం ఐ లను గడువు తేదీ ముందుగానే తీర్చడం వలన అదనపు రుసుములు గానీ , వడ్డీ గానీ పడవు. అలాగే మీ క్రెడిట్ స్కోర్ ఫై ప్రతికూల ప్రభావం లేకుండా, భవిష్యతులో రుణాలు పొందటానికి అవకాశం ఉంటుంది.
  • బడ్జెట్ వేసుకోవడం వలన ఖర్చులను ఎంత నియంత్రణలో ఉంచుకోవాలో అవగాహన ఏర్పడడం ద్వారా అప్పుల బారిన పడకుండా పరువుగా బ్రతకవచ్చు. స్వల్ప కాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించి , మిగులు సొమ్మును దేనికి ఎంత కేటాయించవచ్చో అవగాహన వస్తుంది. ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చు వంటివి తెలుస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం లేకపోయినా, ఖర్చులను తగ్గించుకునే అవకాశం లేకపోయినా , మిగులు సొమ్మును క్రమ పద్దతిలో మదుపు చేయడం ద్వారా కూడా అధిక రాబడి పొందవచ్చు. తద్వారా అన్ని లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చు.
  • మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకు ఎంతో విలువ, గౌరవం ఇవ్వాలి. అత్యాశకు పోయి ఎవరో చెప్పారని అనవసర పథకాలలో పెట్టడం వలన అసలు కూడా నష్టపోతాం. స్వల్పకాలంలో అధిక రాబడి ని ప్రకటించే వారినుంచి దూరంగా ఉండటం మంచిది. ఏదీ సులభంగా రాదు.
  • సాధారణంగా మన సంపాదనలో 40 శాతం వరకు ఖర్చులు పోయినా , మిగిలిన సొమ్మును లక్ష్యాల ఆధారంగా మదుపు చేయాలి. అత్యవసర నిధి కింద మూడు నుంచి ఆరు నెలల ఖర్చులను , బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్ లో ఉంచుకోవాలి.

ముగింపు:
సాధారణంగా చాలా మంది చిన్నచిన్న కొనుగోళ్లపై బేరాలాడతారు . పెద్ద మొత్తాలపై నిర్లక్ష్యం చేస్తారు. దీనివలన పెద్దమొత్తంలో నష్టపోవడమే జరుగుతుంది. నోటి లెక్కలు వేయడం కన్నా రాసి పెట్ట్టుకుంటే మరింత స్పష్టత వస్తుంది. బడ్జెట్ అనేది ఒక మంచి సాధనం . దీని ద్వారా ఆర్ధికంగా లాభపడవచ్చు. మనని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే బడ్జెట్ వేయండి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly