ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల దాఖ‌లుకు మారిన గ‌డువు ఏంటో తెలుసా?

రిట‌ర్నుల దాఖ‌లు స‌మ‌యంలో ఇబ్బందులు వ‌స్తున్న‌ నేప‌థ్యంలో స‌బీడీటీ నిర్ణ‌యం వెల్ల‌డించింది

ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల దాఖ‌లుకు మారిన గ‌డువు ఏంటో తెలుసా?

ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువు మరో నెలరోజులు పెంచింది. ‘ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్టు 31, 2019 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్‌ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. దీనికిగాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 31, 2019 వరకూ అయితే రూ.5,000. ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ… మార్చి 31, 2020. దీనికోసం రూ.10,000 చెల్లించాలి.

ఫారం 16, టీడీఎస్ స‌ర్టిఫికెట్ జారీ తేదీని పొడ‌గించ‌డం వంటి కార‌ణాలతో రిట‌ర్నులు దాఖ‌లు స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేప‌థ్యంలో గ‌డువు పొడిగించిన‌ట్లు సీబీడీటీ పేర్కొంది.

ఆదాయ‌ పన్ను శాఖ ఇంతకుముందు రిట‌ర్నులు, టిడిఎస్ సర్టిఫికెట్లలో మార్పులు చేసింది. సంస్థ‌లు టీడీఎస్ రిట‌ర్నులు ఫైలింగ్ చేసే నిబంధ‌న‌ల‌ను కూడా స‌వ‌రించింది. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో పొందిన ఆదాయానికి సంబంధించి 2019-20 మ‌దింపు సంవ‌త్స‌రంలో రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి.

2020 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన కేంద్ర బ‌డ్జెట్‌లో ఆదాయ ప‌న్ను ప‌రిమితి రూ.2.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారు కూడా విదేశీ ప్ర‌యాణాలు వంటి వాటికి ఎక్కువ మొంత్తంలో లావాదేవీలు చేస్తే రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.

అదేవిదంగా ఏప్రిల్ 2019 నుంచి ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఫారంల‌లో ఎటువంటి మార్పులు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను మాత్ర‌మే అప్‌డేట్ చేసిన‌ట్లు తెలిపింది. మునుపటి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఐటిఆర్‌లు దాఖలు చేసినప్ప‌టికీ చెల్లుబాటు అవుతాయ‌ని చెప్పింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly