యూఏఎన్ లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చా?

ఆన్‌లైన్‌ పీఎఫ్ విత్‌డ్రా కోసం యూఏఎన్ నెంబ‌రు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

యూఏఎన్ లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చా?

భ‌విష్య నిధి (పీఎఫ్‌) లేదా ఉద్యోగుల భ‌విష్య‌నిధి (ఈపీఎఫ్‌) ప‌థ‌కంలో ఉద్యోగి, సంస్థ ఇరువురి కాంట్రీబ్యూష‌న్, ఉద్యోగి నెల వారీ వేతనాన్ని అనుస‌రించి డిడ‌క్ట్ అవుతుంది. ఉద్యిగి ప‌దవీ విర‌మ‌ణ అనంత‌రం జీవితానికి కావ‌ల‌సిన నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఉద్దేశించిన పెట్టుబ‌డి ప‌థ‌కం భ‌విష్య‌నిధి(పీఎఫ్‌). ఉద్యోగి, సంస్థ ఉభ‌యుల‌కు 12 శాతం స‌మాన కాంట్రీబ్యూష‌న్ ఉంటుంది. ప్ర‌తీ ఉద్యోగి, త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం వ‌డ్డీతో స‌హా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మ‌న దేశంలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పీఎఫ్‌, ఫించ‌ను మొత్తంపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. అయితే ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని విత్‌డ్రా చేసుకునేందుకుగానూ యూఏఎన్ నెంబ‌రు ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. ఈ యూఏఎన్ నెంబ‌రు సంస్థ ద్వారా పొందాలి. కానీ చాలా మంది ఉద్యోగులకు, త‌మ పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు కావ‌ల‌సిన యూఏఎన్ నెంబ‌రు ఇప్ప‌టికీ లేదు. ఒక‌వేళ మీకు కూడా యూఏఎన్ నెంబ‌రు లేక‌పోతే ఇత‌ర ప‌ద్ద‌తుల ద్వారా పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

యూఏఎన్ నెంబ‌రు లేకుండా ఉద్యోగుల భ‌విష్య నిధి బ్యాలెన్స్‌ను ఏవిధంగా విత్‌డ్రా చేసుకోవాలి?

ఈపీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు, నేరుగా గానీ, ఆన్‌లైన్‌లో గానీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారికి ఆధార్‌, పాన్‌, బ్యాంక్ ఖాతా నెంబ‌ర్ల‌తో అనుసంధానించిన ఆక్టివేటెడ్ యూఏఎన్‌(యూనివ‌ర్స‌ల్ ఖాతా సంఖ్య‌) ఉండాలి. ఒక‌వేళ మీకు యూఏఎన్ నెంబ‌రు లేక‌పోయినా, పాత ఆఫ్‌లైన్‌ ప‌ద్ద‌తి ద్వారా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఆధార్ ఆధారిత‌ కొత్త కాంపోసిట్ క్లెయిమ్ ఫార‌మ్‌ను గానీ నాన్ ఆధార్ కాంపోసిట్ క్లెయిమ్ ఫార‌మ్‌ను గానీ డౌన్‌లోడ్ చేయాలి. కాంపోసిట్ క్లెయిమ్ ఫార‌మ్‌ను పూర్తి చేసి, మీ పీఎఫ్ విత్‌డ్రా ద‌ర‌ఖాస్తుతో పాటు రీజ‌న‌ల్ పీఎఫ్ ఆఫీసులో, అటెస్టేష‌న్ లేకుండా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ మీరు నాన్‌- ఆధార్ కాంపోసిట్ ఫార‌మ్‌తో ద‌ర‌ఖాస్తు చేస్తే అటెస్టేష‌న్ చేయించాలి. మోస‌పూరిత చ‌ర్య‌ల‌ను నివారించేందుకు, స‌రైన వ్య‌క్తి విత్‌డ్రా కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నార‌ని నిర్ధారించుకునేందుకు ఈ అటెస్టేష‌న్, ఈపీఎఫ్ఓకు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్యాంకు మేనేజ‌ర్‌తో గానీ, గెజిటెడ్ ఆఫీస‌ర్‌, మేజిస్ట్రేట్‌తో గానీ అటెస్టేష‌న్ చేయించి సంబంధిత ఈపీఎఫ్‌ఓ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేయాలి.

ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు?

ఈ విధానంలో పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈపీఎఫ్ విత్‌డ్రాల‌ను ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు గానీ ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం గానీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత గానీ, రెండు నెల‌ల‌కు పైబ‌డి నిరుద్యోగిగా ఉన్న‌ప్పుడు గానీ పూర్తిస్థాయి విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. ఒక ఉద్యోగం నుంచి మ‌రొక ఉద్యోగంలోకి మారిన‌ప్పుడు కూడా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. వివాహం, విద్య‌, భూమి కొనుగోలు, ఇల్లు నిర్మాణం వంటి వాటికి పాక్షికంగా, 50 శాతం వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly