వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారా?

సెక్యూరిటీ లేకుండా మంజూరు చేయ‌డంవ‌ల్ల వ్య‌క్తిగ‌త రుణంపై వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి

వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారా?

త‌క్ష‌ణ రుణ స‌దుపాయం సుల‌భంగా పొందే మార్గ‌ల‌లో వ్య‌క్తిగ‌త రుణం ఒక‌టి. వ్య‌క్తిగ‌త రుణాన్ని ఉన్న‌త విద్య‌, వైద్య ఖ‌ర్చులు, కుటుంబ విహార‌యాత్ర‌, వివాహ ఖ‌ర్చులు, వంటి వివిధ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌త రుణాన్ని సెక్యూరిటీ లేకుండానే మంజూరు చేస్తారు. అందువ‌ల్ల వ‌డ్డీ రేట్లు కూడా అధికంగానే ఉంటాయి. కొద్దిపాటి నిబంధ‌న‌ల‌తో త‌క్ష‌ణమే, సుల‌భంగా రుణ స‌దుపాయం ల‌భ్యంకావ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌త రుణం చాలా ప్రాముఖ్య‌త‌ను సంతరించుకుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం గృహ రుణం, విద్యా రుణం వంటి వివిధ రుణాల‌కు చెల్లించే వ‌డ్డీ రేట్ల‌పై ప‌న్ను మిన‌హాయింపు ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వ్య‌క్తిగ‌త రుణాల‌పై కొన్ని సంద‌ర్భాల‌లో మాత్ర‌మే ప‌న్నుమిన‌హాయింపులు అనుమ‌తిస్తారు. వ్య‌క్తిగ‌త రుణాల‌ను ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

వ్య‌క్తిగ‌త రుణం మొత్తం - ప‌న్ను:

ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేప్పుడు బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌ల ద్వారా తీసుకునే వ్య‌క్తిగ‌త రుణాల‌ను మీ ఆదాయంగా ప‌రిగ‌ణించ‌రు. అందువ‌ల్ల వ్య‌క్తిగ‌త రుణానికి ఏవిధ‌మైన ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. అయితే ఈ రుణం బ్యాంకు లేదా, ఆర్థిక సంస్థ‌ల నుంచి తీసుకున్న‌దై ఉండాలి. మీ బంధువులు, స్నేహితుల నుంచి తీసుకున్న రుణాన్ని మీ ఆదాయంలో భాగంగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.

వ్య‌క్తిగ‌త రుణంతో ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు నిబంధన‌లు:

వ్య‌క్తిగ‌త రుణంగా తీసుకున్న మొత్తాన్ని కొన్ని నిర్ధిష్ట కార‌ణాల‌తో తీసుకున్న‌ప్పుడు ప‌న్నుమిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. తీసుకున్న‌ రుణంపై చెల్లించాల్సిన‌ వ‌డ్డీకి మాత్ర‌మే ఈ ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయ‌ని గుర‌్తుంచుకోవాలి.

 1. రుణం మొత్తాన్ని వ్యాపార నిమిత్తం ఉప‌యోగించ‌న‌ప్పుడు:
  వ్యాపారాన్ని ప్రారంభించేందుకు గానీ, వ్యాపార విస్త‌ర‌ణ‌కు గానీ వ్య‌క్తిగ‌త రుణం తీసుకుంటే, వ‌డ్డీ చెల్లింపుల‌పై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. రుణం మొత్తంపై చెల్లించాల్సిన వ‌డ్డీని వ్యాపారంలో వ‌చ్చిన లాభం నుంచి డిడ‌క్ట్ చేసిన అనంత‌రం మిగిలిన మొత్తంపై ప‌న్ను లెక్కించాల్సి ఉంటుంది. ప‌న్ను మిన‌హాయింపుకు క్లెయిమ్ చేసుకునే వ‌డ్డీ మొత్తంపై గ‌రిష్ట ప‌రిమితి లేదు.

 2. ఇంటిని కొనుగోలు చేసిన‌ప్పుడు లేదా నిర్మించిన‌ప్పుడు:
  వ్య‌క్తిగ‌త రుణాన్ని ఉప‌యోగించి ఏదైనా ఇంటిని కొనుగోలు లేదా నిర్మించిన‌ప్పుడు, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 24 ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. మీరు అదే ఇంటిలో నివ‌సిస్తూ ఉంటే వ‌డ్డీపై రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే క్లెయిమ్ చేసేందుకు మీరు రుణం తీసుకున్న సంస్థ నుంచి ఇంటిని కొనుగోలు/నిర్మించేందుకు రుణం తీసుకున్న‌ట్లుగా స‌ర్టిఫికేట్ తీసుకురావ‌ల‌సి ఉంటుంది.

 3. ఇత‌ర ఆస్తులు కొనుగోలు చేసిన‌ప్పుడు:
  షేర్లు, బంగారం, వాణిజ్యేత‌ర ఆస్తులు వంటివి కొనుగోలు చేసిన‌ప్పుడు నేరుగా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌లేరు. అయితే మీరు కొనుగోలు చేయాల‌కున్న ఆస్తి విలువ‌కు రుణం పై చెల్లించే వ‌డ్డీ మొత్తాన్ని క‌ల‌పొచ్చు. మీరు ఆస్తి విక్ర‌యించిన‌ప్పుడు క్యాపిట‌ల్ గెయిన్ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అంటే మీరు ఆస్తి విక్రయించిన సంవ‌త్స‌రంలో మీరు చెల్లించాల్సిన ప‌న్ను త‌గ్గుతుంది.

plt.jpg

వ్య‌క్తిగ‌త రుణాల ప‌న్ను ప్ర‌యోజ‌నాల గురించి మ‌రికొన్ని ముఖ్య విష‌యాలు:

 • సాధార‌ణంగా వ్య‌క్తిగ‌త రుణంగా తీసుకున్న మొత్తంపై ప‌న్ను వ‌ర్తించ‌దు. ఆదాయ‌పు ప‌న్ను లెక్కించిన‌ప్ప‌డు ఈ మొత్తాన్ని మీ ఆదాయంగా చూపించ‌న‌వ‌స‌రం లేదు.
 • పైన వివ‌రించిన అన్ని అంశాల‌లోనూ చెల్లించ‌వ‌ల‌సిన వ‌డ్డీపై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. అస‌లు మొత్తంపై మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోలేరు.
 • వ్య‌క్తిగ‌త రుణం ఎందు కోసం ఉప‌యోగించారో దానికి సంబంధించిన ఆధారాల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి సంబంధించిన స‌ర్టిఫికేట్‌ల‌ను బ్యాంకు లేదా ఆడిట‌ర్ నుంచి తీసుకోవాలి.
 • వ్య‌క్తిగ‌త రుణంపై ప్ర‌యోజ‌నాల‌ను క్లెయిమ్ చేసుకునేందుకు, బ్యాంకు వారు రుణం జారీ చేసిన‌ట్ల‌గా ఇచ్చే లెట‌ర్‌, ఎక్స్‌పెన్స్ స‌ర్టిఫికేట్‌, ఆడిట‌ర్ నివేదిక వంటి ముఖ్య‌మైన ప‌త్రాల‌ను సంబంధించిన కాఫీల‌ను మీ వ‌ద్ద భ‌ద్ర‌ప‌ర‌చుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly