మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ర్గీక‌ర‌ణ‌- మ‌దుప‌రికి లాభ‌మా? న‌ష్ట‌మా?

సెబీ ప్ర‌తిపాదించిన కొత్త వ‌ర్గీక‌ర‌ణ మ‌దుప‌రుల గంద‌రగోళాన్ని కొంతైనా త‌గ్గిస్తుంద‌ని ఆశిస్తున్నారు.

మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ర్గీక‌ర‌ణ‌- మ‌దుప‌రికి లాభ‌మా? న‌ష్ట‌మా?

అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌ను ప్ర‌ధానంగా 5 విభాగాల కిందికి వ‌ర్గీక‌రించాల్సిందిగా గ‌త నెల సెబీ ప్ర‌తిపాదించింది. వ‌ర్గీక‌ర‌ణ‌లో భాగంగా డెట్‌, ఈక్విటీ, హైబ్రిడ్‌, సొల్యూష‌న్ ఓరియెంటెడ్‌, ఇత‌ర‌ములు కిందికి మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌న్నీ రావాలి. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఒకే లాంటి క్యాట‌గిరీల కింద వివిధ ప‌థ‌కాల‌ను న‌డిపిస్తున్న తీరును చూసిన సెబీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏ క్యాట‌గిరీ తీసుకున్నా ఒకే ప‌థ‌కం కోసం వెతికే మ‌దుప‌రుల‌కు ఇది ఇబ్బందిగా ప‌రిణ‌మించేది. అందుకే సెబీ ప్ర‌తిపాదించిన కొత్త వ‌ర్గీక‌ర‌ణ మ‌దుప‌రుల గంద‌రగోళాన్ని కొంతైనా త‌గ్గిస్తుంద‌ని ఆశిస్తున్నారు.

మొత్తం 36 క్యాట‌గిరీలు - 5 విభాగాలుగా వ‌ర్గీక‌రించి వీటి కింద‌ మొత్తం 36 క్యాట‌గిరీలుగా అన్ని స్కీమ్‌ల‌ను తీసుకురావాల్సిందిగా సెబీ ప్ర‌తిపాద‌న‌లో భాగం. వ‌ర్గీక‌ర‌ణ‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంలో భాగంగా సెబీ తీసుకున్న ఈ నిర్ణ‌యం అనుకున్నంత సామాన్యంగా క‌నిపించ‌డంలేదు. ప్ర‌తి మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌కు డైరెక్ట్‌, రెగ్యుల‌ర్ రెండు ప్లాన్లు ఉంటాయి. డైరెక్ట్ స్కీమ్‌ల‌లో ఎటువంటి మ‌ధ్య‌వ‌ర్తిత్వ సంస్థ జోక్యం ఉండ‌బోదు. ఇక రెగ్యుల‌ర్ ప్లాన్‌ల‌ను ఏదైనా మ‌ధ్య‌వ‌ర్తిత్వ సంస్థ ద్వారానే జ‌రుపుతారు. ఈ ప్లాన్‌ల‌తో క‌లిపి మ‌రిన్ని స్కీమ్‌లు త‌యార‌య్యాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇన్నేసి ప‌థ‌కాలు ఉండడానికి మ‌రో కార‌ణం సంస్థ‌ల మ‌ధ్య విలీనాలు త‌ర‌చూ చోటుచేసుకోవ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు ఇటీవ‌ల కాలంలో బిర్లా స‌న్‌లైఫ్ సంస్థ ఐఎన్‌జీ మ్యూచువ‌ల్ ఫండ్ వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. రేటింగ్ సంస్థ‌ల వైఖ‌రి - మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల వ‌ర్గీక‌ర‌ణ‌లో ప్ర‌తి రీసెర్చ్ పోర్ట‌ల్ లేదా రేటింగ్ సంస్థ వైఖ‌రి ప్ర‌త్యేకంగా ఉంటుందనే విష‌యం తెలిసిందే. ఉదాహ‌ర‌ణ‌కు ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ వాల్యూ డిస్క‌వ‌రీ ఫండ్ ను వాల్యూ రీసెర్చ్ సంస్థ లార్జ్‌క్యాప్‌గా అభివ‌ర్ణిస్తే, మార్నింగ్ స్టార్ పోర్ట‌ల్ ఇదే ఫండ్‌ను మ‌ల్టీక్యాప్‌గా చూస్తోంది. ఇప్పుడు సెబీ నియ‌మాల ప్ర‌కారం న‌డుచుకోవాల్సి ఉంటుంది కాబ‌ట్టి అన్ని రేటింగ్ సంస్థ‌లు లేదా పోర్ట‌ళ్లు ఏక‌రూప‌త‌ను పాటించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఈ కొత్త అవ‌కాశం కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు అనుకూలంగా మార‌వ‌చ్చు. ఎందుకంటే సెబీ ప్ర‌తిపాదించిన కొత్త క్యాట‌గిరీలో కొన్ని ఫండ్ సంస్థ‌లు ఎటువంటి స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఇప్పుడు అవి ప్ర‌వేశ‌పెట్ట‌క త‌ప్ప‌దేమో. 1500 స్కీమ్‌లకు ప‌రిమితం - బ్రోక‌ర్ల‌కు కూడా ఇది మంచి అవ‌కాశం. కొత్త స్కీమ్‌లు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం చేయ‌వ‌చ్చు. ఈ విధంగా ప్ర‌తి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక్కో క్యాట‌గిరీలో ఒక్క ప‌థ‌కాన్ని చొప్పిస్తే మ్యూచువ‌ల్ ఫండ్ ప్ర‌పంచంలో దరిమిలా 1500 స్కీమ్‌లు ఉండ‌నున్నాయి. ఇన్ని ప‌థ‌కాల మ‌ధ్య స‌గ‌టు మ‌దుప‌రి ఎలాంటి గ‌జిబిజికి గురికాకుండా త‌న‌కు అనుకూల‌మైన దాన్ని ఎలా ఎన్నుకుంటాడ‌న్న ప్ర‌శ్న‌కు సెబీ స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుందేమో?

ఫండ్ నిర్వాహ‌కుడి పాత్ర‌:

వ‌ర్గీక‌ర‌ణపై నిబంధ‌న‌లు క‌ఠిన‌తరం చేస్తున్నారంటే దానర్థం ప‌రోక్షంగా ఫండ్ నిర్వాహ‌ణ‌పై ప‌డ్డ‌ట్టే. ఫండ్ నిర్వాహ‌కుడు ఫండ్ ప‌నితీరుకు త‌గ్గ‌ట్టు అంతిమ ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డంలో మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుందేమో? ప‌్ర‌తి ఫండ్ నిర్వాహ‌కుడు క్యాట‌గిరీకి నిర్దేశించిన నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సి వ‌స్తే పెద్ద‌గా మార్జిన్ల‌ను ఆశించ‌లేం. ఇప్ప‌టి దాకా ఫండ్ నిర్వాహ‌కులకు అద్భుత‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకునేందుకు షేర్ల ప్ర‌పంచం నుంచి వివిధ ర‌కాల‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉండేది. ఇక పై కొన్ని షేర్ల నుంచే ప‌రిమాణాల‌ను మార్చుకుంటు ఫ‌లితాల‌ను రాబ‌ట్టాల్సి ఉంటుందేమో. సెబీ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల మ‌దుప‌రులకు కూడా రెండు ప‌థ‌కాల‌ను పోల్చిచూడ‌టం సుల‌భ‌త‌ర‌మ‌వ్వ‌గ‌ల‌దు. ఫండ్ నిర్వాహ‌కులు సైతం దీర్ఘ‌కాల స‌మాలోచ‌న‌ల దిశ‌గా ఫండ్ల‌ను హోల్డ్‌లో ఉంచుతారే త‌ప్ప స్వ‌ల్ప‌కాల అవ‌ధి అవ‌స‌రాల‌వైపు మొగ్గుచూప‌రేమో!

స్వ‌ల్ప‌కాలానికి ప్ర‌భావం?

సెబీ నిర్దేశించిన ప్ర‌కారం మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ప‌రంగా టాప్ 100 షేర్ల‌లో పెట్టుబ‌డి పెట్టేవి లార్జ్‌క్యాప్ ఫండ్లు అయి ఉండాలి. ఇక 101-250 మ‌ధ్య స్థానంలో నిలిచిన షేర్ల నుంచి మిడ్‌క్యాప్ ఫండ్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్లు 250 స్థానం త‌ర్వాతే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టి దాకా లార్జ్‌క్యాప్ ఫండ్లు టాప్ 100 కాకుండా ఆ పైన ఉండే షేర్ల‌ను ఎంపిక చేసుకునేవి. ఇప్పుడు అలా చేసేందుకు వీలుప‌డ‌దు. లార్జ్ క్యాప్ ఫండ్ గా పిలిపించుకోవాలంటే టాప్ 100 షేర్లు కానివాటిని త‌మ పోర్ట్‌ఫోలియో నుంచి తొల‌గించాలి. లేదా వాటినే కొన‌సాగించాలంటే మాత్రం మిడ్‌క్యాప్‌గా పేరును మార్చుకోవాల్సి ఉంటుంది. మిడ్‌క్యాప్‌గా ఉన్న ఫండ్‌ను లార్జ్‌క్యాప్‌గా భ‌విష్య‌త్‌లో మార్చుకునే వీల్లేదు. మ‌రో 5 లేదా 6 నెల‌ల్లో మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఇలాంటి నిర్దేశిత పోర్ట్‌ఫోలియోను క‌లిగి ఉండాల‌ని సెబీ ష‌ర‌తులు పెట్టింది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల స్వ‌ల్ప‌కాల వ్య‌వ‌ధిలో ఫండ్ ఫ‌లితాల‌పై అనుకూల లేదా ప్ర‌తికూల ప్ర‌భావాలు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మ‌దుప‌రులు చేయాల్సిందేమిటి?

మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ర్గీక‌ర‌ణ‌ను పెద్ద‌యెత్తున చేప‌డుతున్నట్టు భావిస్తున్న త‌రుణంలో మ‌దుపరులు తొంద‌ర‌ప‌డి ఏ నిర్ణ‌యానికి రాన‌వస‌రం లేదు అని విశ్లేష‌కుల మాట‌. మ్యూచువ‌ల్ ఫండ్లు షేర్ల‌లాంటివి కాదు. ఫండ్ ప‌నితీరు బాగుంటే దాన్ని అలాగే కొన‌సాగించాల్సిందిగా సూచిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో మీ ఫండ్ వేరే ఫండ్‌తో విలీనం అయ్యే అవ‌కాశం ఉంది. ఇలాంట‌ప్పుడే కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఇత‌ర స్కీమ్‌తో మీ ఫండ్ ప‌నితీరును క‌నీసం 6 నెల‌ల పాటు స‌మీక్షించ‌డం మంచిది. మార్కెట్ ప‌రిస్థితిని బ‌ట్టి ఫండ్ల ప‌నితీరులోనూ మార్పు గ‌మ‌నించ‌వ‌చ్చు. అనుకున్న‌దానికంటే ఎక్కువే లాభాలు రావొచ్చు. ఒక్కోసారి న‌ష్ట‌మూ రావొచ్చు. కొంత కాలం త‌ర్వాత మీర‌నుకున్న ఫ‌లితాలు రాక‌పోతే మాత్రం ఫండ్ నుంచి వైదొల‌గ‌డ‌మే శ్రేయ‌స్క‌రం. దీంట్లో కొన‌సాగే క‌న్నా అలా చేయ‌డ‌మే మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly