పీఎఫ్ ఖాతాల్లోకి పెరిగిన వ‌డ్డీ రేట్లు

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి పీఎఫ్ వ‌డ్డీ రేటును 8.65 శాతంగా నిర్ణ‌యించింది ఖాతాలోని బ్యాలెన్స్‌ను సుల‌భంగా నాలుగు విధానాల్లో తెలుసుకోవ‌చ్చు

పీఎఫ్ ఖాతాల్లోకి పెరిగిన వ‌డ్డీ రేట్లు

ఆరు కోట్ల‌కు పైగా పీఎఫ్ చందాదారుల‌కు ఈ దీపావ‌ళికి ముందు ప్ర‌భుత్వం పీఎఫ్ వ‌డ్డీ రేట్ల పెంపుతో కానుక అందిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి పెంచిన 8.65 శాతం వ‌డ్డీని చందాదారుల ఖాతాలో జ‌మ‌చేయ‌డం ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ వ‌డ్డీ దాదాపు రూ.54,000 అని ప్ర‌క‌టించింది. మొత్తం ఈపీఎఫ్ఓ నిధులు రూ.11 ల‌క్ష‌ల కోట్లకు చేరాయి. గ‌తేడాది 8.55 శాతంతో పోలిస్తే పీఎఫ్ చందాదారులు 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి 10 బేసిస్ పాయింట్లు ఎక్కువ‌గా 8.65 శాతం వ‌డ్డీని పొంద‌నున్నారు.

ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే విధానం:

ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల‌నుకుంటే నాలుగు ర‌కాలుగా తెలుసుకోవ‌చ్చు. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌, ఉమాంగ్ యాప్‌, మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత జ‌మ అయ్యిందో చూసుకోవ‌చ్చు. మొద‌టి రెండు ఆప్ష‌న్లతో పీఎఫ్ పాస్‌బుక్‌తో స‌హ‌, ఎంత వ‌డ్డీ రేటు క్రెడిట్ అయిందో మొత్తం తెలుస్తుంది.

  • ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అయిన త‌ర్వాత ‘View Passbook’ పై క్లిక్ చేస్తే అన్ని డిపాజిట్ల వివ‌రాలు, ఉప‌సంహ‌ర‌ణ‌లు గురించి తెలుస్తుంది. పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది.

  • మీ మొబైల్‌లో ఉమాంగ్ యాప్ ఉంటే అందులో ‘Employee Centric Services’ లో 'View Passbook ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. అక్క‌డ యూఏన్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ న‌మోదిత మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేస్తే ఈపీఎఫ్ పాస్‌బుక్ క‌నిపిస్తుంది.

  • దీనికి ప్ర‌త్యామ్నాయంగా 7738299899 నంబ‌ర్‌కి ఎస్ఎంఎస్ చేయ‌డం ద్వారా లేదా 011-22901406 నంబ‌ర్‌కి మిస్‌డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు.

ఆల‌స్య‌మైన‌ ఈపీఎఫ్ఓ వ‌డ్డీ చెల్లింపు :
ఫిబ్రవరిలో కార్మిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును ప్రకటించినప్పటికీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఆలస్యంగా ఆమోదం పొందడం వల్ల వడ్డీ మొత్తాన్ని పిఎఫ్ ఖాతాలకు జమ చేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో గ‌తేడాది వ‌డ్డీపై చ‌క్ర‌వ‌డ్డీ ల‌భించ‌లేదు. అంటే అక్టోబర్ 7 న వడ్డీ జమ అయినందున, గత సంవత్సరం వడ్డీపై ఎటువంటి చ‌క్ర‌ వడ్డీని పొంద‌లేదు. ఇక అక్టోబర్ 7 నుండి కాంపౌండింగ్ ప్రారంభమవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly