మీ టీడీఎస్ ప్ర‌భుత్వానికి చేరక‌పోతే ఏం చేయాలి ?

నిర్థిష్ఠ గ‌డువులోపు మీ వేత‌నం లేదా ఇత‌ర ఆదాయంపై వ‌ర్తించే టీడీఎస్‌ ప్ర‌భుత్వానికి చేరాలి.

మీ టీడీఎస్ ప్ర‌భుత్వానికి చేరక‌పోతే ఏం చేయాలి ?

ప‌న్ను ఎగ‌వేత‌ల‌ను అరిక‌ట్టేందుకు, నిరంత‌ర ఆదాయం పొందే ఉద్దేశంతో ఆదాయ‌ప‌న్నుశాఖ టీడీఎస్(Tax Deductible at Source) ప్ర‌వేశ‌పెట్టింది. ఆదాయంలోని మూలం వ‌ద్ద‌నే నిర్ణీత మొత్తాన్ని ప‌న్ను రూపంలో మినహాయించుకోవ‌డాన్నే టీడీఎస్ అంటారు. య‌జ‌మాని నుంచి అందుకునే వేత‌నం, బ్యాంకులు లేదా ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల నుంచి పొందే వ‌డ్డీ, ఇన్సూరెన్సు క‌మీష‌న్‌, బ్రోక‌రేజీ మొద‌లైన చెల్లింపుల‌న్నింటిపై టీడీఎస్ వ‌ర్తింప‌జేస్తున్నారు. ఆయా సంస్థ‌లు లేదా వ్య‌క్తులు టీడీఎస్ మిన‌హాయించుకొని మిగిలిన మొత్తాన్ని ప‌న్ను చెల్లింపుదారుకు జ‌మ‌చేస్తున్నారు. ఇలా టీడీఎస్‌ను మిన‌హాయించుకున్న సంస్థ లేదా వ్య‌క్తి ఆ మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖ‌కు గడువు తేదీలోగా చెల్లించాలి. మ‌రి టీడీఎస్‌ను మిన‌హాయించుకున్న సంస్థ లేదా వ్య‌క్తులు ఆ మొత్తాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారికి గ‌డువు లోపుగా చెల్లించ‌క‌పోతే ఏం చేయాలి ?

గ‌త ఏడాది ఆదాయ‌పు ప‌న్ను శాఖ వెలుగులోకి తీసుకువ‌చ్చిన భారీ కుంభ‌కోణంలో వ్య‌క్తులు, ఉద్యోగుల నుంచి సేక‌రించిన టీడీఎస్ మొత్తం రూ.3200 కోట్లు ప్ర‌భుత్వానికి చేర‌లేదు. దీంతో చాలా మంది ప‌న్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఇదే విధంగా మీ విష‌యంలోనూ జ‌ర‌గ‌వ‌చ్చు. సంస్థ య‌జ‌మాని మీ వేత‌నం నుంచి డిడ‌క్ట్ చేసిన టీడీఎస్ మొత్తాన్ని ప్ర‌భుత్వానికి చెల్లించ‌క‌పోతే ఈ విష‌యాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖకు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

దీనికి సంబంధించి గ‌తంలో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్‌స్ గ‌తంలో కొన్ని స‌ర్కులార్‌ల‌ను జారీ చేసింది. దీనిప్ర‌కారం, సంస్థ య‌జ‌మాని లేదా డిడ‌క్ట‌ర్ టీడీఎస్ డిడ‌క్ట్ చేసిన అనంత‌రం ప్ర‌భుత్వానికి డిపాజిట్ చేయ‌క‌పోతే ప‌న్ను అధికారులు ఉద్యోగుల్ని ఇబ్బందిపెట్ట‌కూడ‌దు. అదేవిధంగా డిడ‌క్ట్ చేసిన టీడీఎస్‌ను సంస్థ‌ల‌ నుంచి వ‌సూలు చేయాలి.
ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేట‌ప్పుడు మొత్తం వ‌ర్తించే ప‌న్నును లెక్కించి అందులోనుంచి టీడీఎస్‌ను తీసివేయగా మిగిలిన‌ది చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్‌ను ఫారం 16 లేదా ఫారం 16A (టీడీఎస్ స‌ర్టిఫికెట్‌) లో ఉంటుంది. ఒక సంవ‌త్స‌రంలో మిన‌హాయించిన ప‌న్ను ఆదాయ శాఖ రికార్డులో ఫారం 26AS లో న‌మోద‌వుతుంది. ఫారం 26AS , ఫారం 16 లో వివ‌రాలు స‌రిపోల‌క‌పోతే సెక్ష‌న్ 143 (1) ప్ర‌కారం, అద‌న‌పు ప‌న్ను చెల్లించాల్సి రావొచ్చు. టీడీఎస్ చెల్లించిన‌ట్లు రికార్డుల్లో లేక‌పోతే ఈ విధంగా జరుగుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో సంస్థ‌లు టీడీఎస్ స‌ర్టిఫికెట్‌ను జారీచేయ‌వు కేవ‌లం వేత‌న స్లిప్‌లో మాత్ర‌మే టీడీఎస్ మిన‌హాయించిన‌ట్లుగా తెలుస్తుంది. అప్పుడు ఉద్యోగి త‌మ వేత‌నం నుంచి టీడీఎస్ త‌గ్గించిన‌ట్లుగా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు టీడీఎస్ వివ‌రాల‌ను చెక్ చేసుకోవాల్సిన బాధ్య‌త ఉద్యోగిపై ఉంటుంది.

ఫిర్యాదుకు ముందు ఫారం 26AS ను చెక్ చేసుకోండి
రిట‌ర్నులు దాఖ‌లు చేసే ముందు అంద‌రు ఫారం 26AS చెక్ చేసుకోవాలి. మిన‌హాయించిన టీడీఎస్ వివ‌రాలు అందులో ఉన్నాయో లేదా చూసుకోవాలి. మందుగా పాన్‌ వివ‌రాలు స‌రిగా మీ సంస్థ‌కు స‌రిగా అందించాల్సి ఉంటుంది, లేక‌పోతే త‌ప్పుడు పాన్ సంఖ్య‌తో మీ సంస్థ టీడీఎస్ డిపాజిట్ చేసే అవ‌కాశం ఉంటుంది.

కంపెనీ టీడీఎస్ రిట‌ర్నుల‌ను త్రైమాసికానికి ఒక‌సారి దాఖ‌లు చేస్తుంది. త్రైమాసికం ముగిశాక ఒక నెల త‌ర్వాత చెల్లించాలి. అయితే మార్చి 31 న ముగిసే త్రైమాసికానికి మాత్రం గ‌డువు మే 31 వ‌ర‌కు ఉంటుంది. గ‌డువు తేది ముగిసిన 10 రోజుల త‌ర్వా త ఫారం 26AS ని చెక్ చేసుకోవాలి. టీడీఎస్ డిపాజిట్ చేయని నేప‌థ్యంలో మీ సంస్థ గురించి ఆదాయ ప‌న్ను శాఖ‌కు ఫిర్యాదు చేసే ముందు ఈ వివ‌రాలు స‌క్ర‌మంగా లేవ‌న్న విష‌యం మీ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి. దానిని స‌రిచేయాల్సిందిగా కోరాలి.

ఇన్ని రోజుల్లోనే విరాల‌ను స‌రిచేయాల‌న్న క‌చ్చిత‌మైన నిబంధ‌న‌లు ఏమి లేవు. అయితే ఫారం26AS లో 30-45 రోజుల్లోపు టీడీఎస్ వివ‌రాలు న‌మోద‌వుతాయి. ఇద ఆయా సంస్థల‌ అకౌంట్ డిపార్ట్‌మెంట్ ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఎన్ని సార్లు అడిగినా సంస్థ ఈ విష‌యంపై స్పందించ‌క‌పోతే అప్పుడు సంబంధిత అధికారికి (ఏఓ) మీరు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

మీకు ప్రాంతానికి సంబంధించిన ప‌న్ను అధికారిక గురించి తెలుసుకోవడం ఎలా?

 1. https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/KnowYourJurisdictionLink.html పేజికి వెళ్లాలి.
 2. పాన్‌, మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. అప్పుడు మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది.
 3. ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అక్క‌డ మీ ఏఓ చిరునామా, ఈమెయిల్ ఐడీ వంటి వివ‌రాలు ఉంటాయి.
  మీ సంస్థ పాన్ నంబ‌ర్ తెలిస్తే సంస్థ‌కు సంబంధించిన ప‌న్ను అధికారికి కూడా మీరు ఫిర్యాదు చేసే అవ‌కాశం ఉంటుంది. ఫిర్యాదు ఇచ్చేందుకు ప్ర‌త్యేక విధానం అంటూ ఏం ఉండ‌దు. ఒక పేప‌ర్‌లో మీ స‌మ‌స్య‌ను వివ‌రిస్తూ లేఖ రాస్తే స‌రిపోతుంది. సంబంధించిన ఆధారాల‌ను కూడా జ‌త‌చేయాలి. అవి …
 4. టీడీఎస్ మిన‌హాయించిన‌ట్లుగా చూపే శాల‌రీ స్లిప్‌
 5. టీడీఎస్ డిపాజిట్ వివ‌రాలు న‌మోదు కాన‌ట్లుగా ఉన్న ఫారం ఫారం 26AS
 6. మీ సంస్థకు దీనికి సంబంధించి మీ సంస్థకు చేసిన‌ అభ్య‌ర్థ‌న‌
 7. ఫారం 16 ఉంటే దానిని కూడా జ‌త‌చేయాలి.
  ఐటీఆర్ ఫైలింగ్ స‌మ‌యంలో టీడీఎస్ డీపాజిట్ చేయాలేద‌ని తెలిస్తే ఏం చేయాలి

ఐటీఆర్ ఫైలింగ్ స‌మ‌యంలో ఫారం 16, ఫారం 26AS లో వివ‌రాలు స‌రిపోల‌క‌పోతే శాల‌రీ స్లిప్‌లో ఉన్న విధంగా ఆధారాల‌తో రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. దీంతో పాటు సంస్థ‌కు ఇచ్చిన నోటీసును కూడా జ‌త‌చేయాలి. 30 రోజుల్లోగా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే సంబంధిత ప‌న్ను అధికారికి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం, ఏదైనా త‌ప్పిదం జ‌రిగితే ప‌న్ను చెల్లించాల్సిన బాధ్య‌త ప‌న్ను చెల్లింపుదారుల‌కే ఉంటుంది. అద‌న‌పు ట్యాక్స్ డిమాండ్ చేస్తూ ఆదాయ ప‌న్ను శాఖ నోటీసులు పంపితే ఇన్‌క‌మ్ ట్యాక్స్ క‌మీష‌న‌ర్‌కి అప్పీల్‌ చేసే అవ‌కాశం ఉంటుంది. ఫిర్యాదులో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని క‌మీష‌నర్ ఏం చేయాలన్న విష‌యాన్ని నిర్ణ‌యిస్తారు. ఫిర్యాదు చేయ‌డం ఇష్టం లేక‌పోతే మొత్తం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly