మ్యూచువ‌ల్ ఫండ్ గ్రోత్‌-డివిడెండ్ ఆప్ష‌న్ల‌లో ఎవరికి ఏది మేలు?

మీ ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో గ్రోత్ లేదా డివిడెంట్ ఆప్ష‌న్ల‌లో ఏది స‌రైన‌దో నిర్ణ‌యించుకోవాలి

మ్యూచువ‌ల్ ఫండ్ గ్రోత్‌-డివిడెండ్ ఆప్ష‌న్ల‌లో ఎవరికి ఏది మేలు?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మూడు ర‌కాల ఆప్ష‌న్లు ఉంటాయి. గ్రోత్, డివిడెండ్, డివిడెండ్‌- రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్లు ఉంటాయి. దీంతో పెట్టుబ‌డుల విష‌యంలో పెట్టుబ‌డుదారుల‌కు అనేక సందేహాలు త‌లెత్తుతాయి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో వేర్వేరు ఆప్ష‌న్లు

  1. గ్రోత్ ఆప్ష‌న్

ఈ ఆప్ష‌న్‌లో కొనుగోలు స‌మ‌యంలో యూనిట్లు ల‌భిస్తాయి. చివ‌రి వ‌ర‌కు అవే యూనిట్లు కొన‌సాగుతాయి. ఫండ్ ప‌నితీరును బ‌ట్టి ఎన్ఏవీ మారుతుంటుంది.

  1. డివిడెండ్ ఆప్ష‌న్‌
    చాలా మందికి దీనిపై స్పష్ట‌త ఉండ‌దు. త‌ప్పుగా అర్థంచేసుకుంటారు.

డివిడెండ్ ఆప్ష‌న్ అంటే పెట్టుబ‌డుల ద్వారా వ‌చ్చిన లాభాన్నిపెట్టుబ‌డుదారుల‌కు తిరిగి చెల్లిస్తారు. దీనినే డివిడెండ్ అంటారు. ఆదాయం పొందాల‌నుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

అయితే డివిడెండ్ అనేది అద‌నంగా తాము పొందుతున్న లాభం అని కొంద‌రు భావిస్తారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. డివిడెండ్‌ను యూనిట్ల ఆధారంగా ప్ర‌క‌టిస్తారు. మీకు 100 యూనిట్లు ఉంటే మ్యూచువ‌ల్ ఫండ్ ఒక యూనిట్ రూ.4 డివిడెండ్ ప్ర‌క‌టిస్తే మీకు మొత్తం రూ.400 ల‌భిస్తుంది. అయితే డివిడెండ్ చెల్లించిన త‌ర్వాత యూనిట్ ఎన్ఏవి త‌గ్గుతూ వ‌స్తుంది.

ఉదాహ‌ర‌ణ‌, మీకు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ల‌క్ష రూపాయల విలువైన యూనిట్లు ఉన్నాయి. ఎన్ఏవి రూ.100. అంటే యూనిట్లు 1000 (1,00,000/100). డివిడెండ్ యూనిట్‌కు రూ.20 గా ప్ర‌క‌టించారు అనుకుందాం. మీకు రూ.20 వేలు(20*1000) డివిడెండ్‌గా ల‌భిస్తుంది. మొత్తం 1000 యూనిట్ల‌కు మిగ‌తా రూ.80 వేలకు ఎన్ఏవి రూ.80 కి త‌గ్గుతుంది. మొత్తానికి దీని విలువ లక్ష రూపాయ‌లే అవుతుంది. ఇక్క‌డ పెట్టుబ‌డుదారుల‌కు క‌లిసొచ్చే ఏకైక అంశం ఏంటంటే రెగ్యుల‌ర్‌గా పెట్టుబ‌డుల ద్వారా ఆదాయాన్ని పొంద‌డం. ఇది గ్రోత్ ఆప్ష‌న్‌లో సాధ్యం కాదు.

ఏజెంట్లు ఎక్కువ‌గా న్యూ ఫండ్ ఆఫ‌ర్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని పెట్టుబ‌డుదారుల‌కు సూచిస్తుంటారు. కంపెనీలు డివిడెండ్ ప్ర‌క‌టించిన‌ప్పుడు వారికి ఎక్కువ లాభం వ‌స్తుందని చెప్తుంటారు.

  1. డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్
  • డివిడెంట్ రీ-ఇన్వెస్ట్‌మెంట్‌లో డివిడెండ్ తిరిగి పెట్టుబ‌డిగా పెడ‌తారు.
  • మ్యూచువ‌ల్ ఫండ్ నుంచి వ‌చ్చిన డివిడెండ్‌తో యానిట్లు కొనుగోలు చేస్తారు. దీంతో యూనిట్లు పెరుగుతాయి. ఎన్ఏవి త‌గ్గుతుంది. అంటే డివిడెండ్‌ను పెట్టుబ‌డుదారుడికి ఇవ్వ‌కుండా తిరిగి యూనిట్ల కొనుగోలుకు వెచ్చిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు, మీకు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ల‌క్ష రూపాయ‌ల విలువైన యూనిట్లు ఉన్నాయి. ఎన్ఏవి రూ.100 అనుకుంటే మొత్తం 1000 యూనిట్లు ఉంటాయి. డివిడెండ్ రూ.20 గా ప్ర‌క‌టించారనుకుంటే, డివిడెండ్ రూ.20 వేలు ల‌భిస్తుంది. ఎన్ఏవి రూ.80 కి త‌గ్గుతుంది. అయితే డివిడెండ్ గా వ‌చ్చిన రూ.20 వేలు పెట్టుబ‌డిదారుడికి ఇవ్వ‌కుండా అదే మ్యూచువ‌ల్ ఫండ్‌లో తిరిగి పెట్టుబ‌డులు చేస్తారు. అప్పుడు 250 యూనిట్లు అద‌నంగా మీకు ల‌భిస్తాయి.

మొత్తం యూనిట్లు 1250 కి చేరతాయి. ఎన్ఏవి రూ.80 గా ఉంటుంది.
మొత్తం విలువ 1250 *80 = రూ.1,00,000

డివిడెండ్ లేదా గ్రోత్ ఏది మేలు?

అది పెట్టుబ‌డిదారుడి అవ‌స‌రాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఏది మంచిద‌ని ప్ర‌త్యేకంగా చెప్పేందుకు వీలుండ‌దు.

గ్రోత్ ఆప్ష‌న్ ఎప్పుడు ఎంచుకోవాలి?

మీరు ఎక్కువ‌గా ఆదాయం పొందుతున్న‌వారైతే , పెట్టుబ‌డుల నుంచి రెగ్యుల‌ర్‌గా డ‌బ్బు అవ‌స‌రం లేకుంటే, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌కోసం పెట్టుబ‌డులు చేస్తుంటే గ్రోత్ ఆప్ష‌న్ ఎంచుకోవ‌డం మేలు. ఎందుకంటే చివ‌ర్లో పెట్టుబ‌డులపై రాబ‌డి, కాంపౌండింగ్‌తో క‌లిపి అధికంగా ల‌భిస్తుంది. ఇది డివిడెండ్ ఆప్ష‌న్‌లో సాధ్యం కాదు. వ‌చ్చిన లాభాలు ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకుంటే భవిష్య‌త్తులో లాభాలు పెరిగేందుకు ఆస్కారముండ‌దు.

డివిడెండ్ ఆప్ష‌న్ ఎప్పుడు ఎంచుకోవాలి?

ఎవ‌రికైతే పెట్టుబ‌డుల‌ నుంచి డ‌బ్బు కావాల‌నుకుంటున్నారో, ఇత‌ర బాధ్య‌త‌లు, అవ‌స‌రాల మేర ఆదాయం కావాల‌నుకుంటే డివిడెండ్ ఆప్ష‌న్ ఎంచుకోవ‌డం మేలు.

చివ‌ర‌గా:

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఉన్న వేర్వేరు ఆప్ష‌న్లు విభిన్న పెట్టుబ‌డుదారుల‌కు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబ‌డులు పెట్టేముందు మీరు ఏం కోరుకుంటున్నారో నిర్ణ‌యించుకొని స‌రైన ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో డివిడెండ్లు అన్న‌వి క‌చ్చితంగా వ‌స్తాయ‌ని చెప్ప‌లేం. కంపెనీలు త‌మ‌కు లాభం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పెట్టుబ‌డుదారుల‌కు డివిడెండ్‌ను ప్ర‌క‌టిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఏడాది బడ్జెట్ లో డివిడెండ్ ల పై 11.62 శాతం పన్ను వర్తిస్తుంది. దీని వల్ల డివిడెండ్ రాబడి పై ప్రభావం పడుతుంది. అందుకే వీలైనంత వ‌ర‌కు గ్రోత్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డ‌మే మంచిద‌ని ఆర్థిక నిపుణుల సూచ‌న‌. క్రమమైన ఆదాయం కావాలనుకుంటే గ్రోత్ ఆప్షన్ ఎంచుకుని, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఎంచుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly