మూలధన లాభంతో రెండిళ్లపై పెట్టుబ‌డితో ప‌న్ను ఆదా

రెండు కోట్ల కంటే త‌క్కువ మూల‌ధ‌న ఆదాయంతో రెండు ఇళ్ల‌ను కొనుగోలు చేస్తే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

మూలధన లాభంతో రెండిళ్లపై పెట్టుబ‌డితో ప‌న్ను ఆదా

దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ప‌న్నును (ఎల్‌టీసీజీ) ఆదా చేసుకునేందుకు ఇప్పుడు ఒక‌టికి బ‌దులుగా రెండు గృహాల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. ఇంత‌కుముందు ఒక ఇంటి పైనే పన్ను మిన‌హాయింపు కొర‌కు క్లెయిమ్ చేసేందుకు అవ‌కాశం ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో రూ.2 కోట్ల వ‌ర‌కు రెండు గృహాల‌పై ప‌న్ను క్లెయిమ్ చేసుకునేవిధంగా ప్ర‌తిపాద‌న‌లు తీసుకొచ్చారు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.2 కోట్ల లోపు మూల‌ధ‌న ఆదాయంతో పాటు సొంతంగా మ‌రో రూ.70 ల‌క్ష‌లు క‌లుపుకొని రెండు ఇళ్లపై పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగిస్తే, ఒక ఇంటిపై రూ.1.2 కోట్లు, రెండో ఇంటిపై రూ.1.5 కోట్లు ఖ‌ర్చు చేయాలి. ఇప్పుడున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం మిన‌హాయించే మొత్తం, ఎల్‌టీసీజీ లేదా కొత్త రెసిడెన్షియ‌ల్ ప్రాప‌ర్టీని కొనుగోలు చేసేందుకు పెట్టుబ‌డులు చేసిన మొత్తం కంటే త‌క్కువ‌గా ఉండాలి. ఇక్క‌డ రూ.1.5 కోట్లు అంటే ఎల్‌టీసీజీ రూ.2 కోట్ల కంటే త‌క్కువ‌. మిన‌హాయింపు రూ.1.5 కోట్లు పోగా ఎల్‌టీసీజీ రూ.50 ల‌క్ష‌లు అవుతుంది. ప‌న్ను 20 శాతం అంటే రూ.10 లక్ష‌లు అవుతుంది. ఇప్పుడు కొత్త ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం మొత్తం ఎల్‌టీసీజీ రూ.2 కోట్ల‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

స్థిరాస్తి అమ్మకంపై లభించే రూ.2 కోట్ల వరకు మూలధన లాభంతో ఇప్పటివరకు ఒక ఇల్లు కొనుగోలుపైనే మినహాయింపు ఇస్తుండగా, ఇకపై రెండిళ్ల కొనుగోలుకు ఈ మొత్తాన్ని వినియోగించవచ్చని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చన్న నిబంధన విధించారు. అంటే ఇప్పటికే ఈ విధంగా చేసిన వారికి ప్రయోజనం ఉండదు. భవిష్యత్తులో ఏదైనా ఆస్తి విక్రయించి, మరొకటి కొందామనుకునే వారికీ ఒక్కసారికే వీలుంటుంది.

దీంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఈ ప్ర‌తిపాద‌న‌లు ప‌న్ను చెల్లింపుదారుల‌కు, స్థిరాస్తి పెట్టుబ‌డులు పెరిగేందుకు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. అయితే మూల‌ధ‌న ప‌న్ను రూ.2 కోట్ల కంటే ఎక్కువ‌గా ఉంటే ఈ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వు. ఎల్‌టీసీజీ రూ.2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న‌ప్పుడు ప‌న్ను మిన‌హాయింపు కొర‌కు పూర్తిగా ఒకే ఇంటిలో పెట్టుబ‌డులు పెట్టాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly