కార్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

కారు ధ‌ర‌కు స‌మానంగా కాకుండా కొంత మొత్త‌మే రుణం తీసుకుంటే వ‌డ్డీ భారం త‌గ్గుతుంది

కార్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

చాలా మంది త‌మ‌కు న‌చ్చిన కారులో తిర‌గాల‌ని క‌ల‌లు కంటుంటారు. కారు రుణాలు అనేవి వారి క‌లల్ని నిజం చేస్తాయి. తాజాగా సుప్రీంకోర్టు దిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా 15 ఏళ్ల కాలం నాటి పెట్రోల్ కార్లు, ప‌దేళ్ల నాటి డీజిట్ కార్ల‌ను నిల‌పివేయాల్సిందిగా ఆదేశించింది. ర‌వాణా శాఖ‌ల‌కు కూడా ఆ వాహ‌నాల‌ను అనుమ‌తిని నిషేదించాల్సిందిగా సూచించింది .
కొత్త నిబంధ‌న‌ల ప్రకారం, ఈ కాల‌ప‌రిమితి దాటిన వాహ‌నాల‌కు బ‌దులుగా కొత్త కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. రుణాల‌తో కొత్త కార్ల‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. త‌ర్వాత ఈఎమ్ఐల రూపంలో రుణాల‌ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అయితే కార్ లోన్ తీసుకునేముందు అన్ని బ్యాంకుల్లో ఇస్తున్న రుణాల‌ను పోల్చి చూసుకోవాలి. కార్ లోన్ వ‌డ్డీ రేట్లు సాధార‌ణంగా వార్షికంగా 8.5 శాతం నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. కార్ మోడ‌ల్, తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం, ప‌నిచేసే సంస్థ ఆధారంగా రుణాల‌పై వ‌డ్డీ రేట్లు ఉంటాయి.

కార్ లోన్ తీసుకునేముందు ప‌రిశీలించాల్సిన అంశాలు…

  • మీ ఖాతా ఉన్న బ్యాంకులో రుణ రేట్లు ఎలా ఉన్నాయో ప‌రిశీలించాలి. చాలా వ‌ర‌కు బ్యాంకులు ప్రిఫ‌రెన్షియ‌ల్ కార్ రుణ వ‌డ్డీ రేట్ల‌ను త‌మ వినియోగ‌దారుల‌కు ఇస్తున్నాయి. ఆన్‌లైన్ రుణాల‌ను అందించే సంస్థ‌లతో పోల్చి చూసుకోవాలి.
  • ఈఎమ్ఐ రుణ మొత్తం, కాల ప‌రిమితి, వ‌డ్డీ రేట్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. నెల‌కు ఎంత ఈఎమ్ఐ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుందో చెక్ చేయాలి. మీ ఖ‌ర్చుల‌న్నీ పోనూ నెల‌కు ఈఎమ్ఐ చెల్లించ‌గ‌లిగేంత ఈఎమ్ఐని ఎంచుకోవాలి.
  • మీ నెల‌వారి ఈఎమ్ఐ చెల్లింపులు ఆదాయంలో 40 శాతానికి మించి ఉండ‌కూడ‌ద‌ని నిపుణులు చెప్తున్నారు.
  • త‌క్కువ కాల‌ప‌రిమితి ఉన్న రుణాల‌నే ఎంచుకోవాలి. చాలా వ‌ర‌కు బ్యాంకులు ఏడేళ్ల గ‌డువును ఇస్తాయి. అయితే అంత‌కంటే త‌క్కువ‌గా ఉన్న కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌డ‌మే మేలు. అప్పుడు వ‌డ్డీ రేట్ల భారం త‌గ్గుతుంది.
  • కారు విలువ‌కు స‌మానంగా రుణం తీసుకోకుండా కొంత మొత్తాన్నే తీసుకోవాలి. చాలా వ‌ర‌కు బ్యాంకులు పూర్తిగా 100 శాతం కారం ధ‌ర‌కు స‌మానంగా రుణాలు అందిస్తాయి. అయితే కొంత మాత్ర‌మే తీసుకుంటే రుణాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయి.
  • ముంద‌స్తు రుణ చెల్లింపు అనేది మంచి ఆలోచ‌న‌. గ‌డువు పూర్త‌వ‌క‌ముందే రుణాన్ని చెల్లిస్తే వ‌డ్డీ భారం త‌గ్గుతుంది. కానీ ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఫిక్స్డ్ వ‌డ్డీ రేట్లు ఉన్న కారు రుణాలకు ముందస్తు చెల్లింపుల‌కు ఛార్జీలు ఉంటాయి. ఒక్కోసారి రుణ మొత్తంలో 5-6 శాతం వ‌ర‌కు కూడా ఇవి ఉండొచ్చు.
  • రుణం తీసుకునేముందు ప్రాసెసింగ్ ఫీజుల‌ను కూడా ఒక‌సారి పోల్చి చూసుకోవాలి. ఈ పండ‌గ సీజ‌న్‌లో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు చాలా వ‌ర‌కు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులో త‌గ్గింపు లేదా పూర్తి మిన‌హాయింపు ప్ర‌క‌టిస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly