మీ సీటీసీ గురించి పూర్తిగా తెలుసుకోండి

సీటీసీ అంటే నెల‌వారి జీతంతో పాటు కంపెనీ మీపై ఖ‌ర్చు చేసే అద‌న‌పు మొత్తం ..

మీ సీటీసీ గురించి పూర్తిగా తెలుసుకోండి

సీటీసీ లేదా కాస్ట్ టు కంపెనీ అనే ప‌దం కొన్నిసార్లు త‌ప్పుదోవ ప‌ట్టిస్తుంది. రామ్ అనే వ్య‌క్తికి ఒక మంచి బ‌హుళ జాతి కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. అత‌నికి రూ.6 ల‌క్ష‌ల ఆఫ‌ర్ కంపెనీ ఇచ్చింది. దీంతో చాలా సంతోషంగా అత‌డు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఒక నెల త‌ర్వాత అత‌నికి వ‌చ్చిన వేత‌నం చూసుకొని ఆశ్చ‌ర్య‌పోయాడు. కంపెనీ చెప్పిన సీటీసీ కంటే చాలా త‌క్క‌వగా ల‌భించింది. చాలామందికి ఇలానే జరుగుతుంటుంది. సీటీసీకి, నిక‌ర వేత‌నానికి తేడా చాలామందికి అర్థం కాదు.

సీటీసీ లేదా కాస్ట్ టు కంపెనీ అంటే ఏంటి?
సీటీసీ అంటే కంపెనీకి మీ వ్య‌యం. కంపెనీ నేరుగా లేదా ప‌రోక్షంగా ఉద్యోగుల‌పై వేత‌నంతో పాటు కొంత‌ ఖ‌ర్చు చేస్తుంది. అంటే సీటీసీ అంటే మీ చేతికి వ‌చ్చే జీతంతో పాటు కంపెనీ మీకు ఖ‌ర్చు చేస్తున్న వ్య‌యం.
కాస్ట్ టు కంపెనీ (సీటీసీ)= నెల‌వారి వేత‌నం + అద‌నంగా కంపెనీ మీకు చేసే ఖ‌ర్చు

సీటీసీ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు…
సీటీసీలో ఉండే అంశాలు
సీటీసీ కంటే ముందు వేత‌న వివ‌రాలను ఒక‌సారి ప‌రిశీలిస్తే

 • బేసిక్‌
 • డీఏ
 • హెచ్ఆర్ఏ
 • విద్య రుసుము (ఎడ్యుకేష‌న్ అల‌వెన్స్‌)
 • ప‌నితీరుకు చెల్లింపు (పెర్ఫార్మెన్స్ పే)
 • బోన‌స్‌
 • వాషింగ్ అల‌వెన్స్
 • టెలిఫోన్ లేదా మొబైల్ అల‌వెన్స్‌
 • లీవ్ ట్రావెల్ అల‌వెన్స్
  పై అన్ని అంశాలు మీ వేత‌నంలోకి వ‌స్తాయి. ఇవ‌న్నీ క‌లిపి మీకు టేక్ హోమ్ శాల‌రీతో పాటు సీటీసీలో కూడా ఉంటాయి.

ఉదాహ‌ర‌ణ‌
ఒక ఉదాహ‌ణతో చూస్తే మీ బేసిక్ రూ.20 వేలు, డీఏ రూ.6 వేలు అనుకుందాం. అల‌వెన్స్ రూ.1000, హెచ్ఆర్ఏ రూ.7000. దీంతో మీ మొత్తం వేత‌న ప్యాకేజ్ ఏడాదికి రూ.4.08 ల‌క్ష‌లు

ఇప్పుడు సీటీసీ వివ‌రాల్లోకి వ‌స్తే…
బిల్ రీయంబ‌ర్స్‌మెంట్స్‌
బిల్ రీయంబ‌ర్స్‌మెంట్ సీటీసీ ప్యాకేజీలో ఒక భాగం. ఇందులో

 • టెలిఫోన్ బిల్లు

 • న్యూస్ పేపర్ బిల్లు

 • మ్యాగ‌జైన్ స‌బ్‌స్క్రిప్షన్ వంటివి వ‌స్తాయి.
  ఇటువంటి రీయంబ‌ర్స్‌మెంట్‌లు కూడా సీటీసీలో ఉంటాయి. దానిని కూడా మీ ప్యాకేజీలో భాగంగా చూస్తారు.

  పీఎఫ్‌
  మీ వేత‌నం నుంచి 12 శాతం ప్ర‌తినెల‌ పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. మీ పీఎఫ్ ఖాతాలో సంస్థ జ‌మ చేసే మొత్తం సీటీసీగా ప‌రిగ‌ణిస్తారు.
  ఉదాహ‌ర‌ణ‌కు, మీ నెల‌ బేసిక్ నుంచి 12 శాతం రూ.2,400 అనుకుంటే, సంవ‌త్స‌రానికి సంస్థ చెల్లించే రూ.28,800 మీ సీటీసీలో చూపుతారు

  గ్రాట్యుటీ
  గ్రాట్యుటీ అనేది అయిదు సంవ‌త్స‌రాలు ప‌నిచేసిన త‌ర్వాత మానేస్తే కంపెనీ అందించే మొత్తం. నిజానికి గ్రాట్యుటీ అనేది సీటీసీలో భాగం కాదు. కానీ చాలా కంపెనీలు దీనిని సీటీసీలో చూపిస్తాయి.

  ఆరోగ్య బీమా, జీవిత బీమా
  కొన్ని సంస్థ‌లు ఉద్యోగుల‌కు ఉచితంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. ప్రీమియం కంపెనీయే చెల్లిస్తుంది. దీనిని సీటీసీ ప్యాకేజ్‌లో చేరుస్తారు.

ర‌వాణా స‌దుపాయాలు
కొన్ని కంపెనీలు ఇంటి నుంచి ఆఫీస్‌కి ఉచిత ర‌వాణా స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. దీని వ్య‌యాన్ని కూడా సీటీసీలో భాగం చేస్తాయి.

క్యాంటీన్‌ స‌దుపాయం
కొన్ని కంపెనీలు ఉద్యోగుల‌కు క్యాంటీన్‌లో బోజ‌నం చేసేందుకు ఉచితంగా లేదా స‌బ్సిడీ స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. ఇది కూడా సీటీసీలో భాగ‌మే.

ఉద్యోగి స్టాక్ ఆప్ష‌న్ ప్లాన్ (ఈఎస్ఓపీ)
చాలా కంపెనీలు ఉద్యోగుల‌కు స్టాక్ ఆప్ష‌న్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. అంటే ఉద్యోగుల‌కు త‌క్కువ ధ‌ర‌తో కంపెనీ షేర్ల‌ను కేటాయిస్తాయి. చాలా వ‌ర‌కు కంపెనీలు ఈఎస్ఓపీని సీటీసీలో భాగంగా చేరుస్తాయి.

చివ‌ర‌గా…
ఉద్యోగుల‌ను ఆక‌ర్షించేందుకు కంపెనీలు సీటీసీని ఉప‌యోగిస్తాయి. కొన్ని సంస్థలు శిక్ష‌ణ ఫీజును కూడా సీటీసీలో క‌లుపుతాయి. దీంతో సీటీసీ ఎక్కువ‌గా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. కానీ చేతికి ల‌భించే జీతం మాత్రం త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే సీటీసీతో పాటు మొద‌ట టేక్ హోమ్ శాల‌రీ గురించి కూడా తెలుసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly