క్రెడిట్ కార్డు బ్లాక్ అయ్యేందుకు కార‌ణాలు..అన్‌బ్లాక్ ఎలా చేయాలి?

క్రెడిట్ కార్డు ఉప‌యోగిస్తున్నారా? అనుకోకుండా కార్డు బ్లాక్ అయిందా? అన్‌బ్లాక్ ఎలా చేసుకోవ‌చ్చు తెలుసుకోండి

క్రెడిట్ కార్డు బ్లాక్ అయ్యేందుకు కార‌ణాలు..అన్‌బ్లాక్ ఎలా చేయాలి?

చేతిలో డ‌బ్బులు లేన‌ప్పుడు, బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు క్రెడిట్ కార్డ్ సాయ‌ప‌డుతుంది. వ‌స్తువులు కొనుగోలు చేసేందుకు, సేవ‌లు పొందేందుకు ఎప్పుడైనా, ఎక్క‌డైనా క్రెడిట్ కార్డును ఉప‌యోగించ‌వ‌చ్చు. సుల‌భంగా ఉప‌యోగించ‌డం , స‌మ‌యం ఆదా చేసుకోవ‌డం వంటి సౌక‌ర్యాలు ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు రుణానికి దాఖ‌లు చేసుకొని పొంద‌డం కంటే క్రెడిట్ కార్డును ఉప‌యోగించి త్వ‌ర‌గా పొంద‌వ‌చ్చు. అయితే అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లొ మాత్ర‌మే క్రెడిట్ కార్డును ఉప‌యోగించాల‌న్న విష‌యం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో క్రెడిట్ కార్డును ఉప‌యోగించాల‌నుకున్న‌ప్పుడు ఒక‌వేళ మీ కార్డు బ్లాక్ అయితే ఎలా అన్‌బ్లాక్ చేసుకోవాలి.

క్రెడిట్ కార్డు బ్లాక్ కావ‌డానికి ముఖ్య కార‌ణాలు:

  1. ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం

సాధార‌ణంగా క్రెడిట్ కార్డుపై అతి త‌క్కువ‌గా ప‌రిమితి అంటే నెల‌కు రూ.25 వేలు ఉంటుంది. ఇందులో క్లాసిక్, ప్రీమియం, గోల్డ్ వంటి వేర్వేరు కేట‌గిరీలు ఉంటాయి. లావాదేవీల ప‌రిమితి కూడా వేరుగా ఉంటుంది. గోల్డ్ లేదా ప్రీమియం క్రెడిట్ కార్డుల్లో లావాదేవీల ప‌రిమితి ఎక్కువ‌గా ఉంటుంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డును ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వ‌ల‌న బ్లాక్ అవుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు కార్డును చాలా సార్లు స్వైప్ చేయడం, ప‌రిమితికి మించి లావాదేవీలు చేస్తే కార్డు బ్లాక్ అవుతుంది.

అన్‌బ్లాక్ ఎలా చేయాలి?
ఇలా ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వ‌ల‌న కార్డు బ్లాక్ అయిన‌ప్పుడు మీరు తీసుకున్న డ‌బ్బును తిరిగి చెల్లించి అన్‌బ్లాక్ చేసుకోవ‌చ్చు. అయితే స‌మ‌యానికి డ‌బ్బు లేక తిరిగి చెల్లించ‌డం క‌ష్టం కావొచ్చు. అందుకే ఎప్పుడు కార్డు ప‌రిమితికి మించి లావాదేవీలు చేయ‌కూడ‌దు. ఇంకా ఎంత ప‌రిమితి ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ కార్డుపై ఇంకా ఎంత‌ ప‌రిమితి ఉద‌ని తెలుసుకోవాలంటే AVAIL XXXX ( SBI క్రెడిట్ కార్డ్‌ చివ‌రి నాలుగు సంఖ్య‌లు) టైప్ చేసి 5676791 కి ఎస్ఎంఎస్‌ పంపించాలి.
మొత్తం బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే BAL XXXX (SBI క్రెడిట్ కార్డ్‌ చివ‌రి నాలుగు సంఖ్య‌లు) టైప్ చేసి 5676791 కి పంపించాలి.

  1. స‌మ‌యానికి చెల్లించ‌క‌పోవ‌డం

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో క్రెడిట్ కార్డు ఉప‌యోగించ‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది. తిరిగి చెల్లించ‌క‌పోతేనే అస‌లు స‌మస్య మొద‌ల‌వుతుంది. కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్న‌వారు ఎలా చెల్లించాలో ముందుగా ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం వ‌ల‌న స‌మ‌యానికి చెల్లించ‌క‌పోవ‌చ్చు. గ‌డువు ముగిసేలోపు క‌నీస చెల్లింపు చేయ‌క‌పోతే కార్డు బ్లాక్ అవుతుంది.

అన్‌బ్లాక్ ఎలా చేయాలి?

ఇలాంట‌ప్పుడు వెంట‌నే బిల్లును చెల్లించాలి. క్రెడిట్ కార్డును అన్‌బ్లాక్ చేసేందుక‌ బ్యాంకులు కనీస చెల్లింపును లేదా పూర్తి బిల్లును చెల్లించేందుకు ఆమోదిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు, క్రెడిట్ కార్డు లిమిట్ రూ.25 వేల అనుకుంటే… జ‌న‌వ‌రి 1 నాటికి రూ.19 వేలు ఖ‌ర్చు చేశారు. మొద‌టి వాయిదా గ‌డువులోగా చెల్లించ‌లేదు. అప్పుడు మీరు మొత్తం రూ.19 వేలు , వ‌డ్డీతో క‌లిపి చెల్లించ‌వ‌చ్చు లేదా క‌నీస మొత్తం అంటే రూ.1000 నుంచి రూ.3 వేల వ‌ర‌కు ఉంటుంది అది చెల్లించ‌వ‌చ్చు. ఈ విధంగా బిల్లును తిరిగి చెల్లిస్తే మీ కార్డు తిరిగి యాక్టివేట్ అవుతుంది.

  1. మూడు వాయిదాలు వరుస‌గా చెల్లించ‌క‌పోవ‌డం

ఒక‌సారి బిల్లులు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే అంత‌గా స‌మ‌స్య ఉండ‌దు. అయితే అదేవిధంగా మూడుసార్లు వ‌రుస‌గా చేస్తే రుణంతో పాటు వ‌డ్డీ పెరుగుతూ వ‌స్తుంది. తిరిగి చెల్లింపులు చేసేంత‌వ‌ర‌కు కార్డు బ్లాక్ అవుతుంది. ఇది క్రెడిట్ హిస్ట‌రీపై ప్ర‌భావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. దీంతో భ‌విష్య‌త్తులో వ్య‌క్తిగ‌త‌, గృహ‌, వాహ‌న రుణాలు వంటివి ల‌భించ‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంది.

అన్‌బ్లాక్ ఎలా చేయాలి?

ఇలాంటి సంద‌ర్బాల్లో కూడా పైన చెప్పిన‌ట్లుగానే క‌నీస మొత్తం లేదా పూర్తి బిల్లును చెల్లించి కార్డును అన్‌బ్లాక్ చేసుకోవ‌చ్చు.

  1. నాలుగు నుంచి ఆరు సార్లు పేమెంట్ జ‌ర‌గ‌క‌పోతే
    ఎన్నిసార్లు బిల్లు చెల్లించాల్సిందిగా సందేశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ, మీరు చెల్లించ‌క‌పోతే కార్డును బ్యాంకులు పూర్తిగా ర‌ద్దు చేస్తాయి. కార్డు ఇన్‌వ్యాలిడ్ అవుతుంది.

అప్పుడేం చేయాలి?

మొత్తం రుణాన్ని బ్యాంకుకు చెల్లించాలి. ఆ త‌ర్వాత బ్యాకు క‌స్ట‌మ‌ర్ కేర్ ద్వారా గాని, బ్యాంకును నేరుగా సంప్ర‌దించి గాని క్రెడిట్ కార్డును రిజ‌స్ట‌ర్ చేసుకోవాలి. అప్పుడు క్రెడిట్ కార్డు తిరిగా యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. బ్యాంకులు మీ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించి, గ‌త రుణ చ‌రిత్ర‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రీ-యాక్టివేట్ చేసే అవ‌కాశం ఉంటే చేస్తాయి.

  1. ఖాతా ర‌ద్దు అయితే

ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ కార్డు ఖాతా ర‌ద్దు అయితే రుణ స‌దుపాయం శాశ్వ‌తంగా ర‌ద్దు అవుతుంది. తిరిగి ఖాతాను యాక్టివేట్ చేసే వీలండ‌ద‌ని ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో తెలిపింది. వ‌రుస‌గా ఆరు సార్లు పేమెంట్ చేయ‌క‌పోతే ఈ విధంగా జ‌రుగుతుంది.

అన్‌బ్లాక్ ఎలా చేయాలి?

చాలా వ‌ర‌కు బ్యాంకులు కొత్త క్రెడిట్ కార్డు కోసం దాఖలు చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తాయి. ఎస్‌బీఐ అయితే మొత్తం రుణం చెల్లించిన త‌ర్వాత యునాటి కార్డుకు దాఖ‌లు చేసుకునేందుకు వీలుంటుంది. దీనికోసం పూర్తి బిల్లు చెల్లించాలి, రెండ‌వ‌ది ఆ బ్యాంకులో ఖాతా ఉండాలి, ఎస్‌బీఐ ట‌ర్మ్ డిపాజిట్ ఖాతా ఉండాలి. ఎస్‌బీఐలో ట‌ర్మ్ డిపాజిట్ ఖాతా ఉంటే క్రెడిట్ కార్డు గ‌డువు ముగిసేంత వ‌ర‌కు కార్డుపై తాత్కాలిక హ‌క్కు ఉంటుంది. ఖాతా ర‌ద్దు అయిన సంద‌ర్భంలో పూర్తిగా చెల్లించిన త‌ర్వాత సిబిల్ స్టేట‌స్‌ను స‌వ‌రించాల్సిందిగా కోరితే భ‌విష్య‌త్తులో రుణం పొందేందుకు సుల‌భమ‌వుతుంది. దీనికి 45-60 రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

  1. భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌ల కార‌ణంగా…

క్రెడిట్ కార్డుకు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పించేందుకు బ్యాంకులు చాలా క‌ఠిన‌మైన ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తాయి. లావాదేవీల విష‌యంలో ఏదైనా అనుమానాస్ప‌దంగా ఉంటే బ్యాంకుల‌కు కార్డును బ్లాక్ చేసే హ‌క్కు ఉంటుంది. కార్డు పోయిన‌ప్పుడు లేదా హ్యాక్ చేసిన‌ప్పుడు ఇలాంటివి జ‌రుగుతాయి. కార్డు పోగొట్టుకున్న‌ప్పుడు లావాదేవీల స‌మాచారం మీకు వ‌స్తే బ్యాంకును వెంట‌నే సంప్ర‌దించి కార్డును బ్లాక్ చేయాల్సిందిగా కోరాలి.

అన్‌బ్లాక్ చేయ‌డ‌మెలా?

కార్డు పోగొట్టుకున్న‌ప్పుడు లేదా హ్యాక్ చేసిన‌ప్పుడు లావాదేవీల స‌మాచారం మీకు వ‌స్తే బ్యాంకు హెల్ప్‌లైన్ నంబ‌ర్‌కు ఫోన్ చేసి కార్డు బ్లాక్ చేయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ కార్డును బ్లాక్ చేయాలంటే BLOCK XXXX (ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు చివ‌రి నాలుగు సంఖ్య‌లు) టైప్ చేసి 5676791 కి ఎస్ఎంఎస్ పంపించాలి లేదా 18601801290/39020202 నంబ‌ర్‌కు ఫోన్ చేసి చెప్ప‌వ‌చ్చు. ఆ త‌ర్వాత తిరిగి ఫోన్ చేసి కొత్త పాస్‌వ‌ర్డ్‌తో తిరిగి కార్డును యాక్టివేట చేయాల్సిందిగా కోర‌వ‌చ్చు లేదా కొత్త క్రెడిట్ కార్డుకు దాఖ‌లు చేసుకోవ‌చ్చు.

  1. కేవైసీ పూర్తి చేయ‌క‌పోతే

ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ కేవైసి నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల్సిందిగా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేసింది. క్రెడిట్ కార్డు ఉప‌యోగించేవారు అందరు కేవైసి నిబంధ‌న‌ల‌ను పాటించి అస‌ర‌మైన స‌మాచారం, ప‌త్రాలు అందించాలి. స‌మ‌యానికి చేయ‌క‌పోతే కార్డు తాత్కాలికంగా డీయాక్టివేట్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.

అన్‌బ్లాక్ ఎలా చేయాలి?

క్రెడిట్ కార్డును అన్‌బ్లాక్ చేసేందుక కావ‌ల‌సిన‌ డాక్యుమెంట్ల‌ను బ్యాంకుకు అందించాలి. దీనికోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌, ఓట‌ర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి అవ‌స‌రం అవుతాయి. కొన్ని బ్యాంకులు ఫారం 60, ఫోటోలు కూడా అడుగుతాయి, కేవైసీ డిక్ల‌రేష‌న్ ఫారంను త‌ప్ప‌నిస‌రిగా బ్యాంకుకు అంద‌జేయాలి.

  1. పూర్తిగా మూసివేత‌

బిల్లుల భారం భ‌రించ‌లేకు కొంత‌మంది క్రెడిట్ కార్డును ఉప‌యోగించ‌డం ఆపివేయాల‌నుకుంటారు. అప్పుడు క్రెడిట్ కార్డును డీయాక్టివేట్ చేయాల్సిందిగా బ్యాంకును అభ్య‌ర్థిస్తారు.

అన్‌బ్లాక్ చేయాల‌నుకుంటే…

బ్యాంకు నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి కార్డును తిరిగి యాక్టివేట్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే ప‌రిమిత గ‌డువులోగా తిరిగి అన్‌బ్లాక్ చేయాల్సిందిగా కోరితేనే దీనికి వీలుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ కార్డును డీయాక్టివేట్ చేసుకున్న త‌ర్వాత తిరిగి మూడు నెల‌లోపు యాక్టివేట్ చేసుకునేందుకు అనుమ‌తిస్తుంది.

ఈ విదంగా మీ కార్డు ఎందుకు బ్లాక్ అయిదో కార‌ణం తెలుసుకొని దానికి త‌గిన ప‌రిష్కారంతో అన్‌బ్లాక్ చేసుకోండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly