త‌గ్గుతున్న‌ మ్యూచువ‌ల్ ఫండ్ల నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులు

డెట్ ఫండ్ల‌కు సంబంధించి ప్ర‌తికూల‌త‌లు, ఏడు రోజుల ఎగ్జిట్ లోడ్ వంటివి పెట్టుబ‌డిదారుల‌లో ప్ర‌తికూల‌త‌ను క‌లిగిస్తున్నాయి.

త‌గ్గుతున్న‌ మ్యూచువ‌ల్ ఫండ్ల నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులు

గ‌త కొన్ని నెల‌లుగా డెట్ ఫండ్ల మ‌దుప‌ర్లు ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటున్నారు.డీఫాల్ట్ సంఘ‌ట‌న‌లు ఇంతకుముందు డెట్‌ పెట్టుబడిదారులను ఇబ్బందిపెడితే, ఇప్పుడు అది ఎగ్జిట్ లోడ్ రూపంలో ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. జూన్‌లో లిక్విడ్ ఫండ్‌ పథకాల నుంచి మదుపర్లు రూ.1.52 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. అదేవిదంగా డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు 14.5 శాతం త‌గ్గాయి. డెట్‌ పథకాలపై మదుపర్ల విశ్వాసం తగ్గడమే దీనికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు.

భారత మ్యూచువల్‌ ఫండ్‌ల సంఘం (యాంఫీ) వద్ద లభ్యమవుతోన్న తాజా గణాంకాల ప్రకారం… మేలో డెట్‌ పథకాల్లో రూ.70,119 కోట్లు చొప్పించన మదుపర్లు, గత నెలలో మాత్రం రూ.1.71 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ల నుంచి తీసుకున్న మొత్తం రూ.1,59,814.40 కోట్లుగా నమోదైంది. ఒక్క లిక్విడ్‌ ఫండ్‌ల నుంచి రూ.1.52 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు.

అయితే ఈక్విటీ ఫండ్ల విష‌యానికొస్తే పెట్టుబ‌డులు కొంత మెరుగ్గానే ఉన్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు. జూన్‌లో ఈక్విటీల్లోకి రూ.7,663 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చిన‌ప్ప‌టీకీ ఆస్తుల నిర్వ‌హ‌ణ మాత్రం త‌గ్గింది. చాలావ‌ర‌కు పెట్టుబ‌డుదారులు పెద్ద‌మొత్తంలో నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఎదుర‌వుతోంది.

ఇక సిప్ పెట్టుబ‌డులు ఎప్ప‌టిలాగానే ముందున్నాయి. పెట్టుబ‌డులు కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ ఈక్వీటీల కంటే ఎక్కువ‌గానే రూ.8,122 కోట్లు న‌మోద‌య్యాయి. చిన్న మ‌దుప‌ర్లు ఈక్వీటీల్లో సిప్ ద్వారా పెట్టుబ‌డులు చేయ‌డం మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు ఎప్పుడు క‌లిసొస్తుంది. పెద్ద పెట్టుబ‌డుదారులు ఎక్కువ మొత్తంలో ఈక్విటీ, డెట్‌ల‌లో పెట్టుబ‌డులు పెడితే ప‌రిస్థితి మారుతుంద‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly