డెట్ ఫండ్లు.. ఎఫ్‌డీలు..డిబెంచ‌ర్లు!

న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండి, స్థిరాదాయన్నిచ్చే వాటిలో ముఖ్య‌మైన‌వి

డెట్ ఫండ్లు.. ఎఫ్‌డీలు..డిబెంచ‌ర్లు!

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు, డిబెంచ‌ర్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఈ మూడు స్థిర ఆదాయాన్నిచ్చే పెట్టుబ‌డులు. ఈ ప‌థ‌కాల్లో స‌మీక‌రించిన నిధుల‌న్నీ స్థిర ఆదాయాన్నిచ్చే ప్ర‌భుత్వ బాండ్లు, టీ బిల్స్ లాంటి వాటిలో పెట్టుబ‌డిగా పెడ‌తారు. ఈ మూడు ర‌కాల ప‌థ‌కాల్లో రాబ‌డి, న‌ష్ట‌భ‌యం, ప‌న్నువిధానం లాంటి వాటిలో స్వ‌ల్ప‌ తేడాలు ఉన్నాయి. అవేమిటో మీరే చ‌దివి తెలుసుకోండి.

రాబ‌డి :

డెట్ ఫండ్ల ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని ముందుగా అంచ‌నా వేయ‌డం క‌ష్టం. డెట్ ఫండ్లలో క‌చ్చిత‌మైన ఆదాయం వస్తుందని హామీ ఉండ‌దు. మార్కెట్ ప‌నితీరును బ‌ట్టి రాబ‌డి ఆధార‌ప‌డి ఉంటుంది. డిబెంచ‌ర్లు, ఫిక్సిడ్ డిపాజిట్లలో క‌చ్చిత‌మైన వ‌డ్డీతో రాబ‌డి అందుకోవ‌చ్చు. డిబెంచ‌ర్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల‌లో ఎంత రాబ‌డి వ‌స్తుందో ముందే తెలుస్తుంది. కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టు ఆర్థిక‌ ల‌క్ష్యాలు ఏర్పాటుచేసుకోవ‌చ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌ కంటే ఎక్కువ ఆదాయం డిబెంచ‌ర్లు, డెట్ ఫండ్ల ద్వారా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అదీ మార్కెట్ క‌ద‌లిక‌ల‌కు లోబ‌డి మాత్ర‌మే అని గుర్తుంచుకోవాలి.

న‌ష్ట‌భ‌యం :

సాధార‌ణంగా స్థిరాదాయ సాధ‌నాలు ఈక్విటీ పెట్ట‌బడుల‌ కంటే త‌క్కువ న‌ష్ట‌భ‌యాన్ని క‌లిగి ఉంటాయి. ఫిక్సిడ్ డిపాజిట్ల‌లో న‌ష్ట‌భ‌యం దాదాపు ఉండ‌దు. అయితే ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. డెట్ ఫండ్ల‌లో, డిబెంచ‌ర్లలో కొంత న‌ష్ట‌భ‌యం ఉంటుంది. ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాల‌నే విష‌యం మ‌దుప‌ర్ల వ‌య‌సు, న‌ష్ట‌భ‌యాన్ని ఎదుర్కొనే శ‌క్తిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

కాల‌ప‌రిమితి :

  • ఫిక్సిడ్ డిపాజిట్ ప‌థ‌కాలు నిర్ణీత‌ కాల‌ప‌రిమితితో అందుబాటులో ఉంటాయి. మెచ్యూరిటీ స‌మ‌యానికి ఎంత ఆదాయం చేతికందుతుందో ముందే ప్ర‌క‌టిస్తారు. మెచ్యూరిటీ తీర‌క‌ముందు ఉపసంహ‌రించే పెట్టుబ‌డుల‌పై పెనాల్టీ ఉంటుంది.

  • డిబెంచ‌ర్ల‌కు సైతం నిర్ణీత కాల‌ప‌రిమితి ఉంటుంది. ఇవి స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట‌యి ఉంటాయి. మెచ్యూరిటీ పూర్తికాక ముందు డిబెంచ‌ర్ల‌లోని పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించ‌డం వీలుప‌డదు. అయితే స్టాక్ ఎక్స్‌చేంజ్‌ ద్వారా డిబెంచ‌ర్ల‌ లావాదేవీలు జ‌ర‌ప‌వ‌చ్చు. డిబెంచ‌ర్ల‌కు ఎక్స్ఛేంజీలో లిక్విడిటీ త‌క్కువ‌గా ఉంటుంది.

  • డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లలో రెండు ర‌కాలు. నిర్ణీత కాల‌ప‌రిమితి క‌లిగిన‌ క్లోజ్‌ ఎండ్ ఫండ్లు ఒక‌టైతే మ‌రొక‌టి కాల‌పరిమితిని పేర్కొన‌ని ఓపెన్ ఎండ్ ఫండ్లు. ఓపెన్ ఎండ్ ఫండ్లలోని సొమ్మును నేరుగా ఉప‌సంహ‌రించ‌వ‌చ్చు. స్టాక్ ఎక్స్‌చేంజ్ లో క్లోజ్‌ ఎండ్ ఫండ్ల లావాదేవీలు జ‌రుపుతారు.
    డెట్ ఫండ్ల‌లో కొంత గ‌డువు సాధార‌ణంగా ఏడాదికి ముందే పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రిస్తే నిష్క్రమ‌ణ ఛార్జీలు ప‌డ‌తాయి.

పెట్టుబ‌డి చేసే విధానం:

కొత్త ఫండ్ ఆఫ‌ర్ ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో లేదా చ‌లామ‌ణిలో ఉన్న ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌డం ద్వారా డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి మొద‌లుపెట్ట‌వ‌చ్చు. ఫిక్సిడ్ డిపాజిట్ చేసేందుకు సంబంధిత బ్యాంకు లేదా కార్పొరేట్ సంస్థ‌ను సంప్ర‌దించాలి. కంపెనీలు ప్ర‌క‌ట‌నల రూపంలో డిబెంచ‌ర్ల‌ను జారీ చేస్తుంటారు. ఆస‌క్తి క‌లిగిన‌వారు డిబెంచ‌ర్ల కొనుగోళ్ల‌కు నియ‌మ‌నిబంధ‌న‌లు తెలుసుకొని కొనుగోలుచేయ‌వ‌చ్చు. లేదా స్టాక్ ఎక్స్‌చేంజీలోనూ డిబెంచ‌ర్లను కొనుగోలు చేసే వీలుంది.
ప‌నితీరు విష‌యానికి వ‌స్తే డెట్ ఫండ్లను ప‌రిశీలించుకుంటూ ఉండాలి. ఫండ్ యూనిట్ విలువ మార్కెట్ క‌ద‌లిక‌ల‌కు అనుగుణంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌తో పోల్చి చూసుకున్న‌ట్ల‌యితే డెట్ మార్కెట్లో ఒడిదుడుకులు త‌క్కువే అని చెప్ప‌వ‌చ్చు.

ఆర్థికల‌క్ష్యం , పెట్టుబ‌డి కాలం:

ఆర్థిక ల‌క్ష్యాలు, పెట్టుబ‌డి పెట్ట‌గ‌ల సంవ‌త్స‌రాలను దృష్టిలో ఉంచుకొని త‌గిన ప‌థ‌కాన్ని ఎంచుకోవాలి. ఎంత‌కాలం మ‌దుపు చేయాల‌నుకుంటున్నాం, ఎప్ప‌టికి ఆ డ‌బ్బు అవ‌సరం ఉంటుంది మొద‌లైన విష‌యాలు అంచనా వేసుకుని దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక వేసుకోవాలి.

ప‌న్నువిధానం:

ఎఫ్ డీ ,డిబెంచ‌ర్ల ద్వారా వ‌డ్డీ ఆదాయం, డెట్ ఫండ్ల నుంచి డివిడెండ్ ఆదాయం ల‌భిస్తుంది. ఎఫ్ డీ ,డిబెంచ‌ర్లలో వ‌డ్డీ ఆదాయంపై ప‌న్నువ్య‌క్తిగ‌త శ్లాబ్ ప్ర‌కారం నిర్ణ‌య‌మ‌వుతుంది. డెట్ ఫండ్లలో డివిడెండ్లపై ప‌న్ను ఉండ‌దు.

మూల‌ధ‌న రాబ‌డి:

డెట్ ఫండ్లలో మూడు సంవ‌త్స‌రాల లోపు (స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న) ఆదాయం పై వ్య‌క్తిగ‌త శ్లాబ్‌ రేటు ప్రకారం ప‌న్ను చెల్లించాలి.
డెట్ ఫండ్ల‌లో మూడు సంవ‌త్స‌రాల పైన (దీర్ఘ‌కాల‌ మూల‌ధ‌న) ఆదాయం పై ఇండెక్సేష‌న్ తో క‌లిపి 20 శాతం పన్ను చెల్లించాలి.
డిబెంచ‌ర్ల‌ను 12నెల‌ల త‌ర్వాత ఉప‌సంహ‌రిస్తే, వాటిపై వ‌చ్చే ఆదాయాన్ని దీర్ఘ‌కాల‌ మూలధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు . దీనిపై 10శాతం ప‌న్ను విధిస్తారు. డిబెంచ‌ర్ల‌లో ఏడాది లోపు (స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న) ఆదాయంపై ప‌న్నును వ్య‌క్తిగ‌త శ్లాబ్‌ల‌ను అనుస‌రించి నిర్ణ‌య‌స్తారు.
ఫిక్సిడ్ డిపాజిట్లలో వ్య‌క్తిగ‌త శ్లాబుల‌ను బ‌ట్టి ప‌న్ను చెల్లించాలి.
ఫిక్సిడ్ డిపాజిట్లలో, స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న ఆదాయం పై డెట్ ఫండ్లు, డిబెంచ‌ర్ల‌లో ప‌న్ను ఒకేవిధంగా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly