డిపాజిట్ల‌పై రూ.ల‌క్ష బీమా

బ్యాంకులే విఫ‌ల‌మైతే ఏం చేయ‌గ‌లం? ఖాతాలోని సొమ్ముకు ర‌క్ష‌ణేది? డిపాజిట్ ఇన్సూరెన్స్ మీ స‌మ‌స్యను తీరుస్తుంది

డిపాజిట్ల‌పై రూ.ల‌క్ష బీమా

భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్ ప్రముఖమైన అంశం. బ్యాంకుల్లో ఉన్న ప్రజల డిపాజిట్లు ఒక్కొక్కటి రూ. లక్ష వరకూ బీమా కవరేజీ పరిధిలోకి వస్తాయి. 1960ల్లో దక్షిణ భారత దేశంలో విస్తరించిన పలయ్‌ సెంట్రల్ బ్యాంకు విఫలమవడంతో డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్  అనే ఆలోచన తెరమీదకు వచ్చింది. బ్యాంకుల మీద ప్రజలకు విశ్వాసం పెంచాలనే నేపథ్యంతో దీన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకుగాను డిపాజిట్‌ ఇన్సూ్రెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌(డీఐసీజీసీ) అనే సంస్థ‌ను ఏర్పాటుచేశారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నారు.

డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటే…?

బ్యాంకుల్లో మ‌న‌ ఫిక్స్‌డ్‌, రిక‌రింగ్ డిపాజిట్ల‌లోని సొమ్ముపై రూ.ల‌క్ష బీమా వ‌ర్తిస్తుంది. ఈ స‌దుపాయాన్నే డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటున్నాం.

అన్ని వాణిజ్య బ్యాంకుల‌కు వ‌ర్తింపు

దాదాపు అన్ని వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ ఖాతాదార్ల‌కు ఈ బీమా వర్తిస్తుంది. ప్రాంతీయ గ్రామీణ, ప‌ట్ట‌ణ‌ బ్యాంకుల‌లో డిపాజిట్లు క‌లిగిన‌వారు సైతం ఈ ప‌థ‌కం పరిధిలోనికి వస్తారు. సహకార బ్యాంకుల్లో డిపాజిటర్ల‌కు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. మేఘాలయ, చండీగఢ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలి తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న సహకార బ్యాంకులు డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. ప్రాథమిక సహకార సంఘాలలో ఖాతా క‌లిగిన‌వారు డీఐసీ పరిధిలోకి రారు.

వేర్వేరు ఖాతాల‌కు విడిగా బీమా

కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల, విదేశాల డిపాజిట్లు, బ్యాంకుల అంతర్గత డిపాజిట్లు వంటి వాటికి డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్ వర్తించదు. వినియోగదారులు ఒక బ్యాంకు శాఖలో చేసే డిపాజిట్లకు రూ. లక్ష వరకూ మాత్రమే బీమా వర్తిస్తుంది. ఒక బ్యాంకులో ఎన్ని శాఖల్లో డిపాజిట్లు చేసినా ఒకదానికి మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు.  ఒకవేళ వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు కలిగి ఉంటే ఒక్కో బ్యాంకులో  ఒక దానికి బీమా ఉంటుంది.

అప్పుడు డీఐసీ చెల్లిస్తుంది

ఖాతాదారులకు బ్యాంకులు డిపాజిట్‌ సొమ్ము చెల్లించడంలో విఫలమైతే, డీఐసీ నేరుగా నగదు రూపంలో లేదా సంబంధిత బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేస్తుంది. బ్యాంకు ఖాతాదారులకు బాకీ పడి ఉన్న మొత్తాన్ని లేదా ఇన్స్యూరెన్స్ వర్తించేటంత సొమ్మును మాత్రమే డీఐసీ చెల్లిస్తుంది.

బ్యాంకులు విలీన‌మైతే…

ఒక బ్యాంకు మరో బ్యాంకులో విలీనమైనప్పుడు సైతం ఇన్స్యూరెన్స్ పరిధిలో ఉన్న బ్యాంకు ఖాతాదారులకు బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు బ్యాంకు ‘ఏ’, బ్యాంకు ‘బి’లో విలీనమై, 75 శాతం డిపాజిట్‌కు క్రెడిట్‌ లభించినప్పుడు ‘ఏ’బ్యాంకులో ఖాతాలో రూ. 10,000 ఉన్నవారికి రూ. 7500 మాత్రమే వస్తుంది. మిగిలిన రూ.2500ను డీఐసీ చెల్లిస్తుంది.

ప్రీమియం:

ఒక్కో ఖాతాలో సంవత్సరానికి రూ.100కు 5 పైసల చొప్పున ప్రీమియం విధిస్తారు. పథకం పరిధిలోకి వచ్చే బ్యాంకు ప్రతి ఖాతాపై ప్రీమియాన్ని డీఐసీకి చెల్లిస్తుంది. దీన్ని ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు.

డీఐసీ రెండు నిధుల(ఫండ్‌)ను నిర్వహిస్తుంది.

  1. డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్ నిధి
  2. సాధారణ నిధి

ప్రీమియం ద్వారా వచ్చిన డబ్బును డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్ నిధిలో జమచేస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడులుగా పెడతారు. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ ఖాతాకు జమచేస్తారు. ఇన్సూరెన్స్‌ నష్టాలను రెవెన్యూ ఖాతా నుండి డెబిట్‌ చేస్తారు.
కార్పొరేషన్ సంబంధిత‌ ఖర్చులను సాధారణ నిధి ద్వారా చెల్లిస్తారు.

స్వ‌ల్ప ఊర‌ట‌ మాత్రమే

డిపాజిటర్లకు డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్ అనేది స్వల్పమైన ఊరటను మాత్రమే కలిగించగలదు. ఖాతాల్లోని డిపాజిట్లకు కవరేజీ పరిమితి చాలా తక్కువగా ఉంది.

ఏ సంద‌ర్భంలో అయినా బీమా అనేది ఖాతాకు వ‌ర్తిస్తుంది. అంటే ఒక్కో ఖాతాకు గ‌రిష్టంగా రూ. ల‌క్ష బీమాను డీఐసీజీసీ క‌ల్పిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly