షేర్ vs యూనిట్

వివిధ కంపెనీల‌కు చెందిన‌ షేర్ల‌లో పెట్టుబ‌డికి, మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు జారీచేసే యూనిట్ల‌లో పెట్టుబ‌డికి మ‌ధ్య తేడా ఏంటో చూద్దాం.

షేర్ vs యూనిట్

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఏదైనా ఒక‌ ప‌థ‌కం ద్వారా మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను వివిధ పెట్టుడుల్లో మ‌దుపు చేసి వాటి ద్వారా వ‌చ్చిన లాభాన్ని మ‌దుప‌ర్ల‌కు వారి కున్న వాటా ఆధారంగా పంచుతారు. ఇది మ్యూచువ‌ల్ ఫండ్ చేసే ప్ర‌ధాన విధి. దీంట్లో వాటా కొనుగోలు చేయాలంటే ఆ ఫండ్ ఆఫ‌ర్ స‌మ‌యంలో, ఓపెన్ ఎండెడ్ ఫండ్ల‌యితే సంస్థ‌ల నుంచి ఎప్పుడైనా లేదా క్లోజ్ ఎండెడ్ ఫండ్ల‌యితే ఎక్స్ఛేంజీ ద్వారా యూనిట్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ లో వాటాని యూనిట్ అంటారు. స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఎక్కువ‌గా వినిపించే ప‌దం షేర్. కంపెనీలో వాటా అని అర్థం. ఆ కంపెనీ ప‌రిమాణం, వ్యాపారం బ‌ట్టి షేరు ధ‌ర, షేర్ల సంఖ్య ఉంటుంది. ఏదైనా కంపెనీలో వాటాను లెక్కించేందుకు షేర్ అనేది ఒక ప్రామాణికం. షేర్ల‌లో పెట్టుబ‌డి చేయాలంటే ఆ సంస్థ ప‌బ్లిక్ ఆఫ‌ర్ కు వ‌చ్చిన స‌మ‌యంలోనో లేదా ఎక్స్ఛేంజీ ద్వారా క్ర‌య‌విక్ర‌యాలు చేయ‌వ‌చ్చు.

షేర్ కు… యూనిట్ కు…

ఏదైనా కంపెనీలో నేరుగా వాటా క‌లిగి ఉండే వారిని షేర్ హోల్డ‌ర్లు అంటారు. మ్యూచువ‌ల్ ఫండ్ లో వాటా క‌లిగి ఉండే వారిని యూనిట్ హోల్డ‌ర్లు అంటారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిందేంటంటే, మ్యూచువ‌ల్ ఫండ్లు వివిధ‌ కంపెనీల షేర్ల‌లో మ‌దుపుచేస్తాయి. ఈక్విటీ ఫండ్ల‌యితే ప్ర‌ధానంగా వాటిలోనే మ‌దుపు చేస్తాయి. ఆ లెక్క‌లో ప‌రోక్షంగా యూనిట్ల‌లో పెట్టుబ‌డి కంపెనీల‌ షేర్ల‌లోకి వెళ్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ‌కు కొంత శాతం ఫీజును తీసుకుంటారు. దాన్నే ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు ఫీజు చెల్లించే బ‌దులు నేరుగా షేర్ల‌లోనే మ‌దుపు చేయోచ్చు క‌దా ? ఏ ఫీజులు చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని అనిపించొచ్చు** అయితే దానికి మార్కెట్ల‌పై అవ‌గాహ‌న చాలా అవ‌స‌రం. స్వ‌ల్ప ప‌రిజ్ఙానంతో స్టాక్ మార్కెట్‌లో మ‌దుపుచేయ‌డం అంత మంచిది కాదు. కాబ‌ట్టి ఈక్విటీలో పెట్టుబ‌డి చేయ‌డం ప్రారంభించే వారు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం శ్రేయ‌స్క‌రం. పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత నేరుగా షేర్ల‌లో మ‌దుపుచేసినా ఫ‌ర్వాలేదు.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో చెల్లించే రుసుం త‌క్కువ‌గా ఉంటుంది. ఈటీఎఫ్‌లు , ఇండెక్స్ ఫండ్ల వంటి క్రియార‌హిత ఫండ్ల‌కు ఇది చాలా స్ప‌ల్పంగానే ఉంటుంది. ఈ రుసుము గ‌రిష్టంగా ఎంత వ‌ర‌కూ వ‌సూలు చేయోచ్చ‌నేది సెబీ మార్గ‌నిర్దేశ‌కాలు జారీ చేసింది.

ఫండ్లు, షేర్ల‌లో పెట్టుబ‌డికి తేడాలు:

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా త‌క్కువ మొత్తంతో ఎక్కువ కంపెనీల్లో మ‌దుపు చేసే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌త్యేకంగా పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వేక్షించే ఫండ్ మేనేజ‌ర్లు ఉంటారు. మ్యూచువ‌ల్ ఫండ్ పోర్టుఫోలియోలో ఉన్న వివిధ ర‌కాల కంపెనీల‌కు చెందిన షేర్లు అన్నీ ఒకే విధంగా ఉండ‌వు. కొన్ని రాణిస్తే కొన్ని రాణించ‌క‌పోవ‌చ్చు. ఆ స‌మ‌యంలో పెట్టుబ‌డి బ్యాలెన్స్ అవుతుంది. షేర్ల‌లో పెట్టుబ‌డి చేస్తే చిన్న మ‌దుప‌ర్లకు త‌మ వ‌ద్ద ఉన్నమ‌దుపుతో ఎక్కువ కంపెనీల‌కు చెందిన షేర్ల‌లో పెట్టుబ‌డి చేయడం సుల‌భం కాదు.

మ‌దుప‌రి రూ.5 వేల‌తో మ్యూచువ‌ల్ ఫండ్లో పెట్టుబ‌డి చేస్తే దాదాపు 30-50 కంపెనీల్లో పెట్టుబ‌డి స‌ర్దుబాటు అవుతుంది. అదే రూ. 5 వేల‌తో అన్ని కంపెనీల‌కు చెందిన షేర్లలో పెట్టుబ‌డి చేయ‌డం వీలు కాదు. ఎక్కువ‌ కంపెనీల్లో కొంచెం కొంచెం మ‌దుపు చేయ‌డం వ‌ల్ల పెట్టుబ‌డుల‌కు వైవిధ్య‌త తోడ‌వుతుంది. పెట్టుబ‌డి చేసిన అన్ని షేర్లు ఒకే సారి న‌ష్టపోవు అనే ఒక లాజిక్ ఇక్క‌డ ఉంది. షేర్లలో పెట్టుబ‌డి చేసే ఒక‌టిరెండు కంపెనీలు న‌ష్టాల్లోకి రావ‌డానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా లాభాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డ న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది.

న‌ష్ట‌భ‌యం (రిస్క్) vs రాబ‌డి (రిట‌ర్న్):

రిస్క్ ఎక్కువ ఉన్న పెట్టుబ‌డులు రాబ‌డి కూడా ఎక్కువ‌గా ఇస్తుంటాయి. షేర్ల‌లో పెట్టుబ‌డికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఒక ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డి చేసుకోవాల‌ని అనుకుంటే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది. షేర్ల‌తో పోలిస్తే వీటిలో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly