దూర‌ప్రాంతాల్లో స్థలం కొంటున్నారా? ఈ న‌ష్టాల గురించి తెలుసుకోవాల్సిందే!

న‌గ‌రం న‌డిబొడ్డున ఇల్లు కొనేందుకు త‌గినంత డ‌బ్బు లేనివారు శివారు ప్రాంతాల్లో స్థ‌లాన్ని కొనుగోలుచేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలా కొనుగోలు చేయ‌డం ద్వారా క‌లిగే లాభ‌న‌ష్టాల గురించి తెలుసుకుందాం.

దూర‌ప్రాంతాల్లో స్థలం కొంటున్నారా?  ఈ న‌ష్టాల గురించి తెలుసుకోవాల్సిందే!

ఇంటిని కొనుగోలు చేయ‌డం దాదాపు ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. ప‌ట్ట‌ణాల్లో ల‌భించే స‌దుపాయాలు, ఆదాయ మార్గాలే ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగానికి కార‌ణంగా చెబుతారు. ప‌ట్ట‌ణీక‌ర‌ణ ఫ‌లితంగా ఖాళీ భూమి దొర‌క‌డం గ‌గ‌న‌మైపోతోంది. ధ‌ర‌లు ఆకాశాన్నంట‌డం ప్రారంభించాయి. దీనికి మ‌రొక ప‌రిష్కారం అపార్ట్‌మెంట్ల‌లో నివ‌సించ‌డం. ఉన్న కొంచెం స్థ‌లంలో బిల్డింగ్ నిర్మించి ఎక్కువ మంది జ‌నాలు ప‌ట్టేలా అపార్ట్‌మెంట్ల‌ను తీర్చిదిద్దుతారు.

అపార్ట్‌మెంట్‌కు ప్ర‌త్యామ్నాయంగా…కొంద‌రికి అపార్ట్‌మెంట్ సంస్కృతి సుతార‌మూ న‌చ్చ‌దు. వాళ్లు త‌మ‌కంటూ ఇండిపెండెంట్ హౌజ్‌ను నిర్మించుకొని త‌మ అభిరుచి, జీవ‌న‌శైలికి త‌గ్గ‌ట్టుగా జీవించాల‌నుకుంటారు. ఉదాహరణకు, మొక్కలు పెంచడం, స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవడం లాంటివి అపార్టుమెంట్లలో వీలు కాకపోవచ్చు. న‌గ‌రంలో ఇళ్ల ధ‌ర‌లు బాగా పెరిగిన నేప‌థ్యంలో అందునా ఇండిపెండెంట్ హౌజ్‌ల‌ను కొనాలంటే సామాన్య విష‌యం కాదు. అంత డ‌బ్బు పెట్ట‌లేక సుదూర ప్రాంతాల్లో స్థ‌లం కొనేందుకు చాలా మంది మొగ్గుచూపుతారు. ఎప్పటికైనా అక్కడ అభిరుద్ది ఉంటుంది, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చని వారి భావన. ప్ర‌భుత్వానికి పెద్ద ప‌ని - అందుబాటులో ఉన్న స్థ‌లాన్ని గుర్తించి, ప్లానింగ్ ప్ర‌కారం దాన్ని ప్లాట్లుగా మ‌లిచి, త‌మ అధీనంలో తీసుకునేలా ప్ర‌భుత్వం చొర‌వ తీసుకోవ‌డం సుదీర్ఘ‌మైన ప్ర‌క్రియ‌. ఇలాంటి చొర‌వ తీసుకోవాలంటే ప్ర‌భుత్వానికి చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. మూల‌ధ‌నం బాగా వెచ్చించాల్సి రావొచ్చు. ఆ స్థ‌లంలో, చుట్టుప‌క్క‌ల ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌త‌లును క‌ల్పిచాలి. పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, బ‌స్సు, రైలు లాంటి ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేయాలి. వాణిజ్య దుకాణాల ఏర్పాటుకు వ‌స‌తి క‌ల్పించ‌గ‌ల‌గాలి. ఇవి కాకుండా మంచినీటి వ్య‌వ‌స్థ‌, మురుగు నీటి వ్య‌వ‌స్థ‌తో పాటు విద్యుత్ క‌నెక్ష‌న్ లాంటి క‌నీస‌ ఏర్పాట్ల‌ను చూసుకోవాలి. ప్రైవేట్ చేతుల్లోకి వెళితే…ప్ర‌భుత్వం అంత చొర‌వ తీసుకొని ఇదంతా చేయ‌లేన‌ప్పుడు ప్రైవేట్ వ్య‌క్తుల చేతుల్లోకి ఈ వ్యాపారం మ‌ళ్లుతుంది. ప్లాట్ల అమ్మ‌కం పేరుతో ర‌క‌ర‌కాల స్కీమ్‌లో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. భ‌విష్య‌త్‌లో మంచి అభివృద్ధి జ‌రుగుతుంద‌ని, రేట్లు బాగా పెరుగుతాయ‌ని న‌మ్మ‌బ‌లుకుతారు. త‌క్కువ ధ‌ర‌కే ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో సొంత ఇంటి క‌ల‌ను సాకారం చేసుకోండంటూ అడ్వర్ట‌యిజ్‌మెంట్ల ద్వారా బాగా ప్ర‌చారం చేస్తారు. వాయిదాల్లోనే డ‌బ్బు క‌ట్టండి అంటూ మ‌రో బోన‌స్ ఇస్తారు. స్నేహితులు, ప‌క్కింటివారు, బంధువులు ఇచ్చే స‌ల‌హాతో ర‌క‌ర‌కాల స్కీమ్‌ల్లో చేరిపోతున్న‌వారి సంఖ్య ఎక్కువే…సుదూర ప్రాంతాల్లో సొంతంగా ప్లాటు ఉండ‌డం వ‌ల్ల లాభాలు ఉన్నాయి. యాజ‌మానిన‌ని గ‌ర్వంగా చెప్పుకోగ‌ల‌రు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో స్థ‌లాన్ని అమ్ముకొని ఆర్థిక అవ‌స‌రాలు తీరేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. వార‌సుల‌కు బ‌హుమ‌తిగా ఇచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే కొన్ని న‌ష్టాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే…ప్లాట్లు చాలా దూర ప్ర‌దేశాల్లో ఉంటుంది. కొన్న‌వారు అక్క‌డ ఉండాలంటే చాలా ఇబ్బందులు ప‌డ‌తారు. క‌నీస వ‌స‌తులైన మంచి నీరు, విద్యుత్‌, రోడ్డు, ర‌వాణా లాంటివి ఉండ‌క‌పోవ‌చ్చు. వీటిన్నింటిక‌న్నా మ‌నం ప‌నిచేసే చోటు నుంచి ఇల్లు చాలా దూర‌మ‌వుతుంద‌ని క‌నుక కుటుంబ‌స‌భ్య‌ల భ‌ద్ర‌త గురించి చింత ఏర్ప‌డుతుంది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు అభివృద్ధి అయ్యేందుకు కొన్నేళ్లు ప‌ట్ట‌వ‌చ్చు. అప్ప‌టిలోగా పిల్ల‌లు పెరిగి వాళ్ల‌కు ఆ ప్లాటుపై ఇష్టం పోతుంది. దాని గురించి ప‌ట్టించుకునే స‌మ‌యం కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఒక్కోసారి మ‌నం కొన్న ప్లాటును గుర్తించ‌డం కూడా క‌ష్ట‌మైపోతుంది. కొంద‌రు క‌బ్జాదారులు స్థ‌లాన్ని ఆక్ర‌మించుకోవ‌చ్చు. వాళ్ల‌ను అక్క‌డి నుంచి త‌రమ‌డం చాలా క‌ష్టంతో కూడుకొన్న‌ది. పైగా చ‌ట్ట‌ప‌రంగా పోరాడాల్సి ఉంటుంది. దీనికి బోలెడు డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది. ఒక ప్ర‌ధాన స‌మ‌స్య ఏమిటంటే ప్లాటును అమ్మివేసి న‌గ‌దుగా మ‌లిచే ప‌ని సులువు కాక‌పోవ‌డం. తొలుత కొనేవాడు దొర‌కాలి. డెవ‌ల‌ప‌ర్ కూడా స్థ‌లాన్ని కొనేందుకు సుముఖ‌త చూపించ‌క‌పోవ‌చ్చు. ఎవ‌రైనా కొనేందుకు సిద్ధ‌ప‌డినా త‌క్కువ ధ‌ర‌కు అమ్మాల్సి రావొచ్చు. ఒక్కోసారి డెవ‌ల‌ప‌ర్ ప్రాజెక్టును మ‌ధ్య‌లోనే ఆపివేసి వెళ్లిపోవ‌చ్చు. అప్ప‌టికే చాలా డ‌బ్బు తీసుకొని ఉండొచ్చు. ఇలాంటి సంద‌ర్భాల్లో ప్లాట్ కొనుగోలు చేసిన‌వారు బాగా ఇబ్బందుల‌కు గురికావాల్సి రావొచ్చు. ప్లాటు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తికాక‌పోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిందో లేదో తెలుసుకోవాలంటే స‌మ‌యంతో పాటు అద‌నంగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మ‌న‌కు చూపించే ప్లాటు ఒక‌టి ఉంటుంది. కాగితాల‌పైన కేటాయింపు వేరే స్థ‌లంలో ఉంటుంది. దీంతో మ‌నం కోరుకున్న విధంగా ఉండ‌దు. ప్లాట్లో కొంత భాగం న‌ష్ట‌పోయినా పోవ‌చ్చు. కొన్ని సార్లు చూపించే ప్లాటు రోడ్డుకు స‌మీపంలో చూపిస్తారు. తీరా ప్లాటు కొన్నాక లోప‌ల ఎక్క‌డో ఉంటుంది.

ఆ డ‌బ్బుతో ఏం చేయ‌వ‌చ్చు?

ప్లాటు కొనుగోలు చేయ‌కుండా అదే డ‌బ్బుతో కొన్ని ఆర్థికప‌ర‌మైన‌ పెట్టుబ‌డుల్లో పెట్ట‌డం లాభ‌దాయ‌క‌త‌ను చేకూరుస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఇందు కోసం ప‌రిశీలించ‌వ‌చ్చు. ఒకే కాల‌వ్య‌వ‌ధిలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టే దాంతో వ‌చ్చే రాబ‌డితో పోలిస్తే భూమిపై పెట్టిన పెట్టుబ‌డి విలువ త‌క్కువే ఉంటుంద‌ని నిపుణులు చెబుతారు.

ఇలా జ‌మ చేసుకునే సొమ్ముతో మ‌న‌కు అనుకూల‌మైన ప్ర‌దేశంలోనే మంచి ఇల్లు కొనుగోలు చేసుకునేందుకు ఉప‌యోగించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly