రెండు కంటే ఎక్కువ పొదుపు ఖాతాలున్నాయా?

అన్ని పొదుపు ఖాతాల‌లోనూ నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్ ఉండేలా చేసుకోవాలి. లేదంటే బ్యాంకులు అప‌రాధ రుసుము విధిస్తాయి.

రెండు కంటే ఎక్కువ పొదుపు ఖాతాలున్నాయా?

మీకు ఎన్ని పొదుపు ఖాతాలున్నాయి? సాధార‌ణంగా ఉద్యోగం త‌రుచూ మారేవారికి ఒక‌టి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉండే అవ‌కాశం ఉంది. అదేవిధంగా సంపాద‌న ప్రారంభ‌మ‌వ్వ‌డానికి ముందు త‌ల్లిదండ్రుల స‌హాకారంతో తెరిచిన పొదుపు ఖాతా, ప్ర‌భుత్వ సబ్సిడీలు పొందేందుకు, ఖ‌ర్చుల‌కు మ‌రొక ఖాతా ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఒక‌టి కంటే ఎక్కువ పొదుపు ఖాతాల‌ను నిర్వ‌హించే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఖాతాల‌న్నింటిని ఇప్ప‌టికీ నిర్వ‌హిస్తున్నారా?

3 ఖాతాలు మాత్ర‌మే:

బ్యాంకు ఖాతాను తెరిచే ముందు, ఆ ఖాత‌ను ఎందుకు తెరుస్తున్నాము అనేందుకు నిర్ధిష్ట కార‌ణం ఉండాలి. మీరు తీసుకున్న ప్ర‌తీ బ్యాంకు ఖాతాకు ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌యోజ‌నం ఉండాలి. ఆదాయం, ఖ‌ర్చులు, పెట్టుబ‌డులకు సంబంధించిన అన్ని అవ‌స‌రాల‌కు మూడు పొదుపు ఖాతాలు స‌రిపోతాయి.

ఉదాహ‌ర‌ణ‌కు మీ శాల‌రీ ఖాతా మీకు వ‌చ్చే ఆదాయాన్ని చూపిస్తుంది. నిత్యావ‌స‌ర వ‌స్తువులు, అద్దె, బిల్లులు చెల్లించేందుకు ఒక ఖాతా నిర్వ‌హించ‌వ‌చ్చు. నెల‌వారీ ప‌ద్ధ‌తిలో పొదుపు, పెట్టుబ‌డులు చేసేందుకు మూడో ఖాతాను ఉప‌యోగించుకోవ‌చ్చు. మీరు ఆర్థికంగా క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల వారైతే రెండు ఖాతాల‌ను వాడకంలో ఉంచితే స‌రిపోతుంది. మీ ఆదాయం, పెట్టుబ‌డుల‌కు ఒక ఖాతా, మీ వ్య‌యాల‌కు వేరొక ఖాతాను ఉప‌యోగించుకోవాలి.

మీ పొదుపును కోల్పోవ‌ల‌సి రావ‌చ్చు:

పొదుపు ఖాతాలో సేవ‌లు ఉచితంగా ల‌భించ‌వు. ఈ ఖాతాకు అందించే సేవ‌ల‌కు బ్యాంకులు రుసుము విధిస్తాయి. సాధారణంగా పొదుపు ఖాతాలో నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హించాలి. ఈ క‌నీస‌ బ్యాలెన్స్ నిర్వ‌హించ‌డంలో విఫ‌లం అయితే అప‌రాధ రుసుము చెల్లించాల్సి వ‌స్తుంది. బ్యాంకు ఖాతాలు డెబిట్ కార్డు వార్షిక రుసుము, క‌నీస నిల్వ‌, త‌క్క‌వ రాబ‌డితో వ‌స్తున్నాయ‌ని పైసాబ‌జార్‌.కామ్ పేమెంట్ ప్రొడ‌క్ట్ హెడ్ సాహిల్ అరోరా తెలిపారు.

రాబ‌డి న‌ష్టం:

ఎక్కువ ఖాతాలు ఉన్న‌ట్ల‌యితే ప్ర‌తి ఖాతాలోనూ స‌గ‌టు బ్యాలెన్స్ ఉంచాలి. కాబ‌ట్టి ఎక్కువ మొత్తం ఖాతాలో లాక్ అయ్యి ఉంటుందని బ్యాంక్ బ‌జార్‌.కామ్ ఛీప్ బిసినెస్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ న‌వీన్ చందానీ పేర్కొన్నారు. ఉదాహరణకు మీకు ఐదు పొదుపు ఖాతాలున్నాయనుకుందాం. ఒక్కో ఖాతాలో రూ. 5 వేల నుంచి రూ.10వేలు కనీస నిల్వ ఉంచాల్సి వ‌స్తే, మీరు పొదుపు ఖాతాల్లో నిర్వ‌హించే క‌నీస నిల్వ రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వ‌ర‌కు ఉంటుంది. ఖాతాల్లో ఉన్న ఈ మొత్తంపై వార్షికంగా 3 నుంచి 4 శాతం వడ్డీ వస్తుంది. ఈ ఖాతాలనూ రద్దు చేసుకొని, ఆ మొత్తాన్ని రాబడి ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెడితే కనీసం 8-9శాతం వ‌డ్డీ ఆర్జించవచ్చు.

జాయింటు ఖాతా:

త‌ల్లిదండ్రులు లేదా జీవిత భాగ‌స్వామితో జాయింట్ ఖాతాను నిర్వ‌హించ‌డం మంచిదేనా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం మీకు మీ కుటుంబ స‌భ్యుల‌తో ఉన్న అనుబంధం, ప్ర‌తీ ఒక్క ఖాతాదారుని ఆర్థిక ప‌రిస్థితిపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఖాతాదారుల మ‌ధ్య అవ‌గాహ‌న‌, న‌మ్మ‌కం ఉండి వారి ల‌క్ష్యాలు ఒక్క‌టే అయితే వారిని స‌హా ఖాతాదారునిగా ఉంచి ఖాతా తెరవ‌చ్చు. పిల్ల‌ల విద్య‌, ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి వంటి ల‌క్ష్యాల కోసం జాయింటు ఖాతాను తీసుకోవ‌చ్చు. ఒక‌వేళ ఇరువురు ఆర్థిక ప్ర‌వ‌ర్త‌న వేరుగా ఉంటే భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఇరువురు వేరువేరు ఖాతాల‌ను తీసుకోవ‌డం మంచిది.

మ‌ర్చిపోతే న‌ష్ట‌మే:

కొంత మంది 10 నుంచి 15 సంవ‌త్స‌రాల క్రితం తెరిచిన పొదుపు ఖాతాను మ‌ర్చిపోతుంటారు. మీరు తెరిచిన ఖాతాలో డ‌బ్బును ఉంచి, మ‌ర్చిపోతే, మీరు ఆ మొత్తాన్ని కోల్పోయిన‌ట్లే. ఎందుకంటే డెబిట్ కార్డు, ఇత‌ర సేవ రుసుములను మీ ఖాతాలో ఉన్న మొత్తం నుంచి తీసుకుంటారు. మీరు చూసే స‌మ‌యానికి బ్యాంకు ఖాతాలో డ‌బ్బు ఉండ‌క‌పోగా మీరే చెల్లించాల్సిన ప‌రిస్థితి రావ‌చ్చు. ఇటువంటి నిరుప‌యోగ‌మైన ఖాతాల వ‌ల్ల మీతో పాటు నామినీ కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

చివ‌రిగా:

మీ అవసరాలకు అనుగుణంగా, ఖాతాలను తీసుకోవడంలో తప్పు లేదు. అయితే, వీలైనంత వరకూ వేతన ఖాతాకు తోడుగా మరో ఖాతాను తీసుకోవడం మంచిది, తప్పదు అనుకుంటేనే మూడో ఖాతా తీసుకోవాలి. మీకు జాయింటు ఖాతా ఉన్న‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా ఒక ఖాతా ఉండ‌డం మంచిది. ఖాతాల‌కు ఆధార్‌ నెంబరు, పాన్‌ల‌తో అనుసంధానించండి. వేతన ఖాతాలో మీ వేతనానికి సంబంధించిన లావాదేవీలనే నిర్వహించండి. ఒక సంస్థ నుంచి వేరొక సంస్థకు మారిన‌ప్పుడు, కొత్త సంస్థ శాల‌రీ ఖాతా తెరిస్తే, మీ పాత సంస్థ వారు ఇచ్చిన శాల‌రీ ఖాతా ర‌ద్దు చేయ‌డం మ‌ర్చిపోకండి. ర‌ద్దు చేసే ముందు ఈ ఖాతా ప్ర‌భుత్వం నుంచి స‌బ్సిడీ వ‌చ్చే గ్యాస్ వంటి వాటికి, పీఎఫ్‌, ఇన్సురెన్స్‌, వంటి ప్రస్తుతం స‌బ్సిడీలు, భ‌విష్య‌త్తు ప‌థ‌కాల‌కు లింక్ చేశార‌మో చూసుకుని, ఒక‌వేళ లింక్ అయ్యి ఉంటే మీ కొత్త బ్యాంకు ఖాతాల‌కు వాటిని బ‌దిలీ చేసుకున్న తరువాత మాత్ర‌మే పాత ఖాతాను ర‌ద్దు చేయాలి. వాడకంలో లేని ఖాతాలను వీలైనంత వెంటనే రద్దు చేసుకోండి. మీకు ఉన్న అన్ని ఖాతాల‌లోనూ కనీస నిల్వ ఉండాలి.లేదంటే, అపరాధ రుసుములు విధిస్తారు. ఇది మీ క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly