మీ పెట్టుబ‌డిపై ఎంత రాబ‌డి వ‌స్తుందో లెక్కిస్తున్నారా?

పెట్టుబ‌డిపై ఎంత మొత్తం రాబ‌డి వ‌చ్చింది అనేదానికంటే ఎంత శాతం రాబ‌డి వ‌చ్చింది అని చూసుకోవాలి.

మీ పెట్టుబ‌డిపై ఎంత రాబ‌డి వ‌స్తుందో లెక్కిస్తున్నారా?

రాబ‌డి కావాల‌నుకున్న ప్ర‌తీఒక్క‌రూ ఆర్ధిక లేదా ఆర్థికేత‌ర ఉత్ప‌త్తుల‌లో పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం ఎంచుకునే ఉత్ప‌త్తులు ఒక‌టి కావ‌చ్చు లేదా అంతకంటే ఎక్కువ కూడా కావ‌చ్చు. కొన్ని పెట్టుబ‌డులు స్వ‌ల్ప‌కాలం కొనసాగించాల్సి వ‌స్తే, మ‌రికొన్ని పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగించాల్సి ఉంటుంది. ఒక‌టి నుంచి 5 సంవ‌త్స‌రాల కాలానికి రిక‌రింగ్ డిపాజిట్‌(ఆర్‌డీ) ఖాతా, కొన్ని చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు, వంటివి స్వల్ప‌కాల పెట్టుబ‌డుల‌కు ఉదాహ‌ర‌ణ‌లు. 5 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డి పెట్టే ఎండోమెంట్ ప్లాన్‌, యులిప్స్‌, మ్యూచువల్ ఫండ్లు, రియ‌ల్ ఎస్టేట్ వంటివి దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు ఉదాహ‌ర‌ణ‌లు. ఇవి కాకుండా ఏక‌మొత్తంగా లేదా వాయిదాల ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డులు ప్రారంభించి కొంత కాలం త‌రువాత వాయిదాల ప‌ద్ధ‌తిలో లేదా ఏక‌మొత్తంగా రాబ‌డి వ‌చ్చే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. బీమా సంస్థ‌లు అందించే యాన్యూటీ ప‌థ‌కాలు, ఇంటి రుణానికి సంబంధించిన ఈఎమ్ఐ, ఇల్లు, స్థ‌లం వంటి వాటి నుంచి వ‌చ్చే అద్దె ఈ కోవ‌లోకి వ‌స్తాయి.

మ‌నం పెట్టే పెట్టుబ‌డుల‌పై ఎంత శాతం రాబ‌డి వ‌స్తుంద‌నే విష‌యం మ‌న‌కు అవ‌గాహ‌న ఉండాలి. కొన్ని ఉత్ప‌త్తుల‌లో పెట్టుబ‌డి పెడితే కాల‌ప‌రిమితి పూర్తైన అనంత‌రం ఎంత రాబ‌డి వ‌స్తుంద‌నే విష‌యం ఆ పెట్టుబ‌డులు ప్రారంభించిన‌ప్పుడే మ‌న‌కు తెలుస్తుంది. రిక‌రింగ్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొద‌లైన వాటిపై ప్రారంభించ‌న రోజే ఖ‌చ్చిత‌మైన రాబ‌డిని లెక్కించ‌వ‌చ్చు.

అయితే బంగారం, రియ‌ల్ఎస్టేట్‌, ఈక్వీటీలు వంటి వాటిపై ఎంత రాబ‌డి వ‌స్తుంద‌ని పెట్టుబ‌డులు ప్రారంభించిన స‌మ‌యంలో అంచ‌నా వేయ‌లేము. వాటిని విక్ర‌యించిన‌ప్పుడు మాత్ర‌మే ఖ‌చ్చిత‌మైన రాబ‌డి తెలుస్తుంది. అయితే, ఈ విధ‌మైన ఉత్ప‌త్తుల‌లో ఎంత శాతం రాబ‌డి రావ‌చ్చు అనే దానిని మాత్రం అంచ‌నా వేయ‌వ‌చ్చు.

చాలా మంది వారు పెట్టుబ‌డి పెట్టిన న‌గ‌దుపై ఎంత మొత్తం రాబ‌డి వ‌చ్చింద‌ని చూస్తారు త‌ప్ప, ఎంత శాతం రాబ‌డి వ‌చ్చింద‌ని లెక్కించ‌రు. అధిక రిస్క్ ఉన్న పథకాల్లో అధిక రాబడి పొందవచ్చు, అలాగే వాటిలో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది అన్నిసార్లు నిజం కావాల‌ని లేదు. వ‌డ్డీ రేట్ల‌ను వార్షికంగా లెక్కిస్తారు.

రాబ‌డులను అంచ‌నా వేసేందుకు మార్గాలు:

ఏక‌మొత్తంగా చెల్లించి ఏక‌మొత్తంగా తిరిగి తీసుకునే పెట్టుబ‌డులు:

ఖ‌చ్చిత‌మైన రాబ‌డి/ మొత్తం రాబ‌డి: మ‌నం తిరిగి పొందిన మొత్తం నుంచి పెట్టిన పెట్టుబ‌డుల‌ను తీసివేస్తే, ఎంత రాబ‌డి పొందామో తెలుస్తుంది. ఈ ప‌ద్ధ‌తిలో కాలాన్ని ప‌రిగ‌ణించ‌రు.

ఉదాహ‌ర‌ణ‌: ర‌ఘు జ‌న‌వ‌రి 1,2015లో రూ. 1 ల‌క్ష రూపాయిలు మ‌దుపు చేస్తే, అక్టోబ‌ర్‌1,2018న అత‌నికి వ‌చ్చిన మొత్తం రూ. 1.6 ల‌క్ష‌లు. అత‌ను 3 సంవ‌త్స‌రాల 9 నెల‌ల కాలం పెట్టుబ‌డి పెట్టాడు. అయితే మొత్తం పెట్టుబ‌డిపై 60 శాతం ఖ‌చ్చిత‌మైన రాబ‌డి వ‌చ్చిద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డి పెట్టిన కాలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు.

రెండ‌వ ప‌ద్ధ‌తి సీఏజీఆర్‌- వార్షిక వృద్ధి రేటును కాంపౌండ్ చేయాలి. ఇందులో పెట్టుబ‌డి పెట్టిన కాలాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. దీని ద్వారా వార్షిక రాబ‌డి రేటును అంచ‌నా వేయ‌వ‌చ్చు. పైన ఉదాహ‌ర‌ణ‌లో వార్షిక రాబ‌డి రేటును లెక్కిస్తే వార్షికంగా 13.35 శాతం రాబ‌డి వ‌స్తుంది.

ఐఆర్ఆర్‌( ఇంట‌ర్న‌ల్ రేట్ ఆఫ్ రిటర్న్స్‌): వివిధ తేదీల‌లో జ‌మ చేసిన, విత్‌డ్రా చేసిన వేరు వేరు మొత్తాల ద్వారా ఈ విధానాన్ని ఉప‌యోగించి ఖ‌చ్చిత‌మైన రాబ‌డిని లెక్కించ‌వ‌చ్చు.

ఈ కింది ప‌ట్టిక తేదీల వారిగా డిపాజిట్‌ల‌ను, విత్‌డ్రాల‌ను చూపిస్తుంది. కాల‌ప‌రిమితి ముగిసే స‌మయానికి ఉన్న‌ ఫైన‌ల్ మొత్తం తెలిసిన త‌రువాత ఐఆర్ఆర్‌ను లెక్కించ‌వ‌చ్చు.

returns.jpg

ప్ర‌త్యేకంగా దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డిని లెక్కించేందుకు ఐఆర్ఆర్ ప‌ద్ధ‌తి చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఎండోమెంట్ బీమా పాల‌సీలు, యులిప్స్‌, గృహ రుణ ఈఎమ్ఐ, సిప్‌-క్ర‌మానుగ‌త చెల్లింపులు మొద‌లైన వాటిని లెక్కించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఎవ‌రైన అధిక రాబ‌డి వ‌స్తుంద‌ని ఏదైనా ప‌థ‌కం లేదా పాల‌సీ గురించి తెలిపితే ఈ విధానం ద్వారా ఎంత రాబ‌డి వ‌స్తుందో లెక్కించి తెలుసుకోవ‌చ్చు.

ఇందుకోసం మ‌రొక ఉదాహ‌ర‌ణగా ఎండోమెంట్ పాల‌సీని తీసుకుందాం. ప‌రిమిత‌మైన ప్రీమియం చెల్లింపులు, కాలానుగుణ విత్‌డ్రాలు, పాల‌సీ మొత్తాన్ని ఒకేసారి లేదా నెల‌వారీ ఆదాయంగా పొంద‌డం వంటి అనేక అంశాలు ఈ పాల‌సీల‌లో అందుబాటులో ఉంటాయి. ఎండోమెంట్ పాల‌సీలో ఈ కింది రెండు సౌక‌ర్యాలు ఉండ‌డం వ‌ల్ల చాలా మంది ఈ పాల‌సీల‌ను కొనుగోలు చేస్తుంటారు.

  1. బీమా కవ‌ర‌వుతుంది.
  2. పెట్టుబ‌డి ప‌ట్టే మొత్తంపై ప్ర‌తీ సంవ‌త్స‌రం ఖ‌చ్చినమైన రాబ‌డి వ‌స్తుంది.

కానీ నిజానికి ఇటువంటి పాల‌సీలు పూర్తి బీమాను గానీ, పెట్టుబ‌డుల‌పై త‌గిన రాబ‌డిని కానీ అందించ‌లేవు. ఉదాహ‌ర‌ణ‌కు, వార్షిక ప్రీమియం రూ. 1,09,890 చొప్పున 5 సంవ‌త్స‌రాలు ప్రీమియం చెల్లిస్తే 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి పూర్తయ్యాక ఏక‌మొత్తంగా వ‌చ్చే రాబ‌డి రూ.11 ల‌క్ష‌లు అనుకుందాం. ఇందులో మీరు ప‌రిశీలించ‌వ‌ల‌సిన మొద‌టి విష‌యం- హామీ మొత్తం చాలా త‌క్కువ‌. అనుకోకుండా పాల‌సీదారునికి ఏమైనా జ‌రిగితే వ‌చ్చే రూ. 11 ల‌క్ష‌ల‌తో ఆ కుటుంబ స‌భ్య‌లు ఎంత కాలం జీవించ‌గలుగుతారు.ఒకవేళ కాల పరిమితి వరకు పాలసీ దారుడు జీవించి ఉన్నడనుకుందాం. ద్ర‌వ్యోల్భ‌ణాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఇప్ప‌టి రూ. 11 ల‌క్ష‌ల విలువ 15 సంవ‌త్స‌రాల తరువాత ఎంత ఉంటుంది. అందువ‌ల్ల బీమా, పెట్టుబ‌డులను క‌లుప‌కూడ‌దు. అధిక హామీ మొత్తం కోసం ప్ర‌త్యేకించి ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవ‌డం మంచిది. దీర్ఘ‌కాల పెట్టుబ‌డులకు పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఎస్ఎస్‌వై, బ్యాంకు ఎఫ్‌డీలు, మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి వాటిని ఎంచుకోవ‌డం మంచిది.

rr.jpg

పైన తెలిపిన ఉదాహ‌ర‌ణలో మాదిరిగానే న్యూఎండోమెంట్ పాల‌సీ, జీవ‌న్ ల‌క్ష్యా, న్యూ జీవ‌న్ ఆనంద్‌, జీవ‌న్ ఉమాంగ్‌(హోల్ లైఫ్ ) వంటి ఎల్ఐసీ పాల‌సీలు ప‌నిచేస్తాయి.
ఎస్‌బీఐ లైఫ్స్ స్మార్ట్ స‌మృద్ధి, మ్యాక్స్ లైఫ్స్ అస్యూర్డ్ వెల్త్ ప్లాన్‌, బ‌జాజ్ అలియాంజ్ లైఫ్స్ సూప‌ర్ లైఫ్ అస్యూర్ మొద‌లైన పాల‌సీలు ఈకోవ‌లోకే వ‌స్తాయి. ఈ పాలసీల రాబడులను పరిశీలించి చూసాము. వివిధ ఎండోమెంట్, హోల్‌లైఫ్ పాల‌సీల‌పై దాదాపు 4 నుంచి 5 శాతం మాత్ర‌మే రాబ‌డి ఉంటుందని తెలుస్తోంది.

చివ‌రిగా:
ఈ విధ‌మైన ప్రాథ‌మిక‌ లెక్కింపుల‌తో అన‌వ‌స‌ర‌మైన పెట్టుబ‌డుల‌ను నివారించ‌వ‌చ్చు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు సుర‌క్షితంగా ఉండే ప‌థ‌కాల‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ మీరు స్వ‌ల్ప‌కాల ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టినా, ప్రారంభంలో ఉప‌సంహ‌రించుకుని న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ మీరు దీర్ఘ‌కాల ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టి మ‌ధ్య‌లో ఉప‌సంహ‌రించుకున్నా న‌ష్ట‌మే, చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించినా త‌క్కువ రాబ‌డి రావ‌చ్చు. అందువ‌ల్ల ఏదైనా ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టేముందు క‌నీస పెట్టుబ‌డి కాలం, కాల‌ప‌రిమితి, రాబ‌డి శాతం, న‌ష్ట‌భ‌యం, లాక్‌-ఇన్‌-పిరియ‌డ్, వంటి అన్ని అంశాల‌ను ప‌రిశీలించి పెట్టుబ‌డి పెట్టాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly