సెకెండ్ హ్యాండ్ కారుకు బీమా అవ‌స‌ర‌మా?

కొత్త కారుతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కారు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ) విలువ తక్కువగా ఉంటుంది

సెకెండ్ హ్యాండ్ కారుకు బీమా అవ‌స‌ర‌మా?

సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసిన వారు, స‌రైన విధంగా బీమా క్లెయిమ్‌ చేయ‌క ఆర్ధికంగా ఎంత‌గానో న‌ష్ట‌పోతున్నారు. ఇందుకు కార‌ణం కారు కొనుగోలు చేసిన అనంత‌రం బీమా పాల‌సీని త‌మ పేరుమీద‌కు బ‌దిలీ చేసుకోక‌పోవ‌డం. కారు కొనుగోలు చేసిన త‌రువాత కొత్త య‌జ‌మాని పేరు బీమా పాల‌సీలో లేక‌పోవ‌డం అంటే, బీమా సంస్థ‌కు, కారు య‌జ‌మానికి మ‌ధ్య స‌రైన అగ్రిమెంట్ లేదు అనిఅర్ధం. అటువంటి సంద‌ర్భంలో కారు కొత్త య‌జ‌మాని కార‌ణంగా ఏదైనా యాక్సిడెంట్ లేదా న‌ష్టం ఏర్ప‌డితే క్లెయిమ్ చేసుకునేందుకు అర్హ‌త ఉండ‌దు. చాలా మంది కారు కొనుగోలు దారుల‌కు స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల‌, వారు చేసే క్లెయిమ్‌లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్నాయి. అందువ‌ల్ల సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేవారు పాత య‌జ‌మాని పేరుపై ఉన్న బీమా పాల‌సీల‌ను వారి పేరుమీద‌కి త‌ప్ప‌కుండా బ‌దిలీ చేసుకోవాలి. దీనిని సాధార‌ణ విష‌యంగా చూడ‌కూడ‌దు. నిర్ల‌ష్యం చేయ‌కూడ‌దు.

కొనుగోలు త‌రువాత చేయాల్సిన ప‌ని:

మోటారు వాహ‌నాల చ‌ట్టం సెక్ష‌న్ 157 ప్ర‌కారం ఒకరు ఉప‌యోగించిన కారును మ‌రొక‌రు కొనుగోలు చేసిన‌ప్పుడు, వాహ‌న కొత్త య‌జ‌మాని అత‌ని పేరు మీద‌కు పాల‌సీని బ‌దిలీ చేసుకోవాలి. లేదా నేరుగా బీమా సంస్థ‌ను సంప్ర‌దించి వాహ‌నం కొనుగోలు చేసిన 14 రోజుల లోపుగా పాల‌సీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

పాత య‌జ‌మానికీ స‌మ‌స్య కావ‌చ్చు:

ఒక‌వేళ వాహానాన్ని కొనుగోలు చేసిన వ్య‌క్తి(కొత్త‌య‌జ‌మాని) కార‌ణంగా ఏదైనా ప్ర‌మాదం సంభ‌వించి మూడ‌వ వ్య‌క్తి న‌ష్ట‌పోతే, ఆన‌ష్ట ప‌రిహారం చెల్లించ‌వ‌ల‌సిన‌దిగా పాత య‌జ‌మానికి కోర్టు నుంచి నోటుసులు రావ‌చ్చు. అందువ‌ల్ల చ‌ట్ట‌బ‌ద్దంగా ఎటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా కొనుగోలు, విక్ర‌య‌దారులు ఇరువురూ భాద్య‌త‌గా వాహ‌న బీమా పాల‌సీని బ‌దిలీ చేసుకోవాలి.

కారు బీమా పాల‌సీని బ‌దిలీ చేసుకునే విధానం:

సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసిన త‌రువాత, కారుకు సంబంధించిన బీమా పాల‌సీ పాత య‌జ‌మాని పేరు నుంచి కొత్త య‌జ‌మాని పేరు మీద‌కి, కారు కొనుగోలు చేసిన 14 రోజుల లోపుగా బ‌దిలీ అయ్యేలా చూసుకోవాలి.

  1. పాల‌సీని బ‌దిలీ చేసేందుకు కొత్త ప్ర‌తిపాద‌నా ఫార‌మ్‌తో పాటుగా కారు విక్ర‌యించిన‌ట్లుగా, ఆర్‌సీ బ‌దిలీ చేసిన‌ట్లు పాత య‌జ‌మాని సంత‌కం చేసిన ఫార‌మ్ 29,30తో పాటుగా బ‌దిలీ కోసం చెల్లించ‌వ‌ల‌సిన రుసుములు, ముందు పాల‌సీ కాపీ వంటి ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. పైన తెలిపిన వాటిని బీమా సంస్థ‌కు ఇచ్చిన త‌రువాత, బీమా బ‌దిలీకి సంస్థ ఆమోదం తెలుపుతుంది.
  2. క్లెయిమ్ చేసే స‌మ‌యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నివారించేందుకు ఆర్‌టీఓ జారీ చేసిన కొత్త ఆర్‌సీ కాపీని స‌మ‌ర్పించాలి.
  3. ఆర్‌సీ కాపీలో వాహ‌న య‌జ‌మాని మారిన‌ట్లుగా, కొత్త య‌జ‌మాని పేరు న‌మోదు కాకుండా, బీమా పాల‌సీ బ‌దిలీ అయిన‌ప్ప‌టికీ క్లెయిమ్ చేసుకునేప్పుడు ఆర్‌సీ కాపీని త‌ప్ప‌కుండా ఇవ్వాలి.
  4. ఆర్‌సీ బ‌దిలీ ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా క్లెయిమ్ చేయ‌వ‌ల‌సి వ‌స్తే, అటువంటి క్లెయిమ్‌లను కూడా తిర‌స్క‌రించ‌రు. అయితే ఆర్‌సీ బ‌దిలీ అయిన‌ట్లుగా ఆధారాల‌ను ఇచ్చిన త‌రువాత మాత్ర‌మే హామీ మొత్తం చెల్లిస్తారు.

సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు చాలా ర‌కాలుగా ఆలోచించి కొనుగోలు చేస్తుంటారు. అయితే మోట‌ర్ బీమా పాల‌సీల బ‌దిలీ చేసుకునేందుకు మాత్రం ప్రాధాన్య‌త ఇవ్వ‌రు. మోట‌రు బీమా పాల‌సీని బ‌దిలీ చేసుకోక పోతే ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా, చ‌ట్ట ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. అందువ‌ల్ల వాహ‌నాన్ని కొనుగోలు చేసిన నిర్ణీత స‌మ‌యంలోపుగా పాల‌సీని వాహ‌న య‌జ‌మాని పేరుపైకి బ‌దిలీ చేసుకోవ‌డం చాలా ముఖ్యం. కారు బీమా ప‌థ‌కాల‌ను ఆన్‌లైన్‌లో పోల్చి చూసుకుని మీరు చెల్లించే ప్రీమియంకు త‌గిన‌ క‌వ‌రేజ్‌ణు అందించే బీమా పాల‌సీని ఎంచుకోవ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly