మూడు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి... కొన‌సాగించాలా?

ఒకే యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌రు ఉన్న‌ట్ల‌యితే ఎన్ని ఈపీఎఫ్ ఖాతాలున్నా వాటికి అనుసంధానం చేసుకోవ‌చ్చు.

నేను ప్ర‌స్తుతం విదేశాల్లో ప‌నిచేస్తున్నాను. భార‌తదేశంలో నేను వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేశాను. వాటికి సంబంధించి 3 పీఎఫ్ ఖాతాలు అలాగే ఉన్నాయి. వాటిని కొన‌సాగించాలా ? లేదా మూసివేయాలో అర్థం కావ‌డం లేదు. ఈ 3 ఖాతాల‌ను ఒక్క ఖాతాగా మ‌ల‌చుకునే అవ‌కాశాలేమైనా ఉన్నాయా? అలా కాకుండా 3 ఖాతాల నుంచి డ‌బ్బును ఆన్‌లైన్‌లోనే విత్ డ్రా చేసుకునేందుకు ఏవైనా మార్గాలున్నాయా? ఒక వేళ విత్‌డ్రా చేసుకున్న ప‌రిస్థితుల్లో వాటిని ఎందులో పెట్టుబ‌డిగా పెట్టాలో తెలుప‌గ‌ల‌రు? ---- సింహ‌

మీరు ఈ పీఎఫ్ ఖాతాల‌న్నింటికకీ కేవైసీ వివరాలు నమోదు చేసి ఒకే యూఏఎన్ కింద ఖాతా తెరిచారో లేదో వివ‌రించలేదు. ఒక వేళ ఒకే యూఏఎన్ కింద మూడు ఖాతాలూ తెరిచి ఉంటే మీరు పూర్వ సంస్థ‌లను సంప్ర‌దించ‌కుండానే ఆన్‌లైన్ ద్వారా అన్ని ఖాతాలను కలిపి ఒకే ఖాతాగా మలుచుకునే అవకాశం, లేదా ఖాతాలలో సొమ్మును ఆన్లైన్ ద్వారా విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని ఈపీఎఫ్ సంస్థ క‌ల్పిస్తుంది.

అలాకాకుండా ఒకే యూఏఎన్ కింద అన్ని పీఎఫ్ ఖాతాలు లేక‌పోతే … మీ పూర్వ సంస్థ‌ను నేరుగా సంప్ర‌దించి మాత్ర‌మే సొమ్ము విత్ డ్రా చేసుకునేందుకు వీల‌వుతుంది.

మీరు ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నారు గ‌నుక తిరిగి భార‌త‌దేశం వ‌చ్చి ఇక్క‌డ వేరే ఉద్యోగంలో చేరినప్పుడు ఈ మూడు ఖాతాల‌ను ఒకే ఖాతాగా న‌మోదుచేయించుకోవ‌డం మంచిది. ఇప్పటికి ఈ ఖాతాల‌ను కొన‌సాగించడమే మేలు. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం మీ ఖాతాల్లో ఉన్న సొమ్ముపై వ‌డ్డీ జ‌మ అవుతూ ఉంటుంది.

ప్రవాస భారతీయులకు సంబంధించిన కధనాలు

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎన్.ఆర్‌.ఐలు మ‌దుపు చేయాలంటే…
ఆదాయ ప‌న్ను శాఖ కోణంలో ప్ర‌వాస భార‌తీయులు
విదేశానికి వెళుతున్నారా? ఫెమా చ‌ట్టం ఏం చెబుతోంది?

— స‌మాధానం ఇచ్చిన‌వారు
---- బ‌స‌వ‌రాజ్ తొన‌గ‌ట్టి, స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్‌

నేను బ్యాంకు ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాను. అయితే ఉద్యోగం వచ్చేందుకు ఇంకొంత సమయం పట్టేలా ఉంది. మా సోద‌రుడు రూ.50వేల మొత్తం ఇచ్చి షేర్ మార్కెట్లో పెట్టుబ‌డి పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. కాబ‌ట్టి షేర్ల‌లో పెట్టుబ‌డి పెట్టే విధానం గురించి తెలుప‌గ‌ల‌రు. దీంతో పాటు మంచి లాభాల‌ను ఎలా పొందొచ్చో చెప్ప‌గ‌ల‌రు.

                --- విజ‌య సుష్మా

షేర్ మార్కెట్లో పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుగా షేర్ మార్కెట్ ప‌నిచేసే విధానం, కంపెనీల ప‌నితీరు, షేర్ పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూపించే అంశాల‌పై ప్రాథ‌మిక అవగాహ‌న పెంచుకోవ‌డం మంచిది. ఇందుకోసం బిజినెస్ ప‌త్రిక‌లు, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, దీంతో పాటు www.eenadusiri.net లో వ‌చ్చే విభిన్న‌క‌థాంశాల‌ను చదవడం ఉపయోగకరంగా ఉంటుంది.

షేర్ మార్కెట్‌ నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు స‌మ‌యం ప‌డుతుంది. ఈ లోగా మీ సొద‌రుడు మీకు ఇచ్చిన సొమ్మును ఆర్థిక స‌ల‌హాదారును సంప్ర‌దించి మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబ‌డి పెట్టవలసిందిగా సూచిస్తున్నాం.

మీకు ఇష్ట‌మైన రంగంలో ఉద్యోగం సంపాదించేందుకు త‌గిన నైపుణ్యాల‌ను అభివృద్ధి చేసుకొని త్వ‌ర‌గా స్థిర‌ప‌డాల‌ని ఆశిస్తున్నాం. ఉద్యోగంలో చేరితే క్ర‌మ‌మైన ఆదాయం చేతికందుతుంది. ఆర్థికంగా స్వతంత్రులై మ‌రింత ఎక్కువ సొమ్మును పెట్టుబ‌డిగా మ‌లిచేందుకు మీకు అవ‌కాశం ల‌భిస్తుంది.

ఆల్ ద బెస్ట్‌!

సంబంధిత క‌థ‌నాలు

షేర్ మార్కెట్లు, స్టాక్‌ ఎక్స్చేంజీలు అంటే!!

డీమ్యాట్ ఖాతా తెరిచే విధానం

---- స‌మాధానం ఇచ్చిన‌వారు
----- ఈనాడు- సిరి.నెట్‌ బృందం

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly