ఇక‌పై ఈపీఎఫ్ విత్‌డ్రా స‌మ‌యంలో క్యాలిక్యులేష‌న్ స్టేట్‌మెంట్‌

ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో 6 కోట్ల మంది చందాదారులు ప్ర‌యోజ‌నం పొంద‌నున్నారు.

ఇక‌పై ఈపీఎఫ్ విత్‌డ్రా స‌మ‌యంలో క్యాలిక్యులేష‌న్ స్టేట్‌మెంట్‌

ఈపీఎఫ్ చందాదారులు త‌మ నిధుల‌ ఉప‌సంహ‌ర‌ణ‌కు క్లెయిమ్ చేసుకున్న‌ప్పుడు ఈపీఎఫ్ క్యాలిక్యులేష‌న్ షీట్‌ను అందించాల్సిందిగా ఉద్యోగ‌భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రాంతీయ కార్యాల‌యాల‌కు సూచించింది. ఈపీఎఫ్ ఫైన‌ల్ సెటిల్‌మెంట్ లేదా నిధుల ఉప‌సంహ‌ర‌ణ చేసుకునే స‌మ‌యంలో పూర్తి వివ‌రాల‌తో కూడిన ఉప‌సంహ‌ర‌ణ లెక్కింపు ప‌త్రాన్ని ప్రాంతీయ కార్యాల‌యాలు జారీచేయ‌నున్నాయి. దీంతో ఈమెయిల్ లేదా న‌మోదిత మొబైల్ నంబ‌ర్ ద్వారా ఈ క్యాలిక్యులేష‌న్ షీట్ చందాదారుల‌కు చేరుతుంది. చందాదారుల‌కు మ‌రింత సౌల‌భ్యాన్ని క‌ల్పించేదుకు పీఎఫ్ సెటిల్‌మెంట్ స‌మ‌యంలో క్యాలిక్యులేష‌న్ షీట్‌ను అందించ‌నున్న‌ట్లు మార్చి 22 న ఈపీఎఫ్ఓ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో తెలిపింది. దీంతో చందాదారులు ఎటువంటి గంద‌ర‌గోళానికి గుర‌వ‌కుండా పూర్తి వివ‌రాల‌ను సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ క్లెయిమ్‌ల‌కు కూడా ఈ స‌దుపాయం ల‌భిస్తుంది. ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) చందాదారులు వ‌చ్చే ఏడాది నుంచి ఉద్యోగం మారిన ప్రతిసారీ భవిష్య నిధికి జమ చేసే సొమ్ము వివరాలపై కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదని, త‌దుప‌రి ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి స్వయంచాలిత (ఆటోమేటిక్‌) పద్ధతిని అమలు చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు ఇటీవ‌ల తెలిపింది. ప్రస్తుతం ఉద్యోగులకు సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ -యూఏఎన్‌) ఉన్నప్పటికీ ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈపీఎఫ్‌ క్లెయింల విషయమై దరఖాస్తు సమర్పించాల్సి వస్తోంది.

ఏటా ఇలాంటి దరఖాస్తులు ఎనిమిది లక్షల వరకు వస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి. లావాదేవీలన్నింటినీ కాగిత రహితంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆటోమేటిక్‌ పద్ధతిలో క్లెయింలను మార్పిడి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ త‌న‌ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అధ్య‌యనం చేసేందుకు సీ-డీఏసీ ను నియ‌మించింది. ఈపీఎఫ్ఓలో ప్ర‌స్తుతం 80 శాతం ప‌నులు ఆన్‌లైన్ ద్వారా జ‌రుగుతున్నాయి.

స్యయం చాలిత బ‌దిలీ ద్వారా ఈపీఎఫ్ఓ పూర్తి పేప‌రు ర‌హితంగా ప‌నిచేస్తుంది. కొత్త యజమాని నూతనంగా చేరిన ఉద్యోగి పేరున నెలవారీ పీఎఫ్‌ చందాను చెల్లించేటప్పుడే యూఏఎన్‌ను ఆధారంగా అతని ఖాతాలో సొమ్ము జమ అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాత యజమాని జమ చేసిన సొమ్ము, దానిపై వచ్చిన వడ్డీ అన్నీ కొత్త ఖాతాలో జమ అవుతాయి. అంటే ఇక నుంచి యూఏఎన్‌ కూడా బ్యాంకు ఖాతా మాదిరిగానే పనిచేస్తుంది. ఎన్ని ఉద్యోగాలు, ప్రదేశాలు మారినా జీవితాంతం పీఎఫ్‌ ఖాతా మాత్రం మారదు.

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) లెక్కింపులో యజమానులు ఉద్యోగులకు అందించే ప్రత్యేక అలవెన్సులను కూడా మూల వేతనం కిందే పరిగణించి పీఎఫ్‌ మొత్తాన్ని గణించాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్‌ మొత్తాన్ని మినహాయించి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. దీనికి అదనంగా యజమాని కూడా అంతే మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగి మూల వేతనంలో ప్రత్యేక అలవెన్సు కూడా కలవడంతో ఎక్కువ మొత్తం పీఎఫ్‌ ఖాతాకు వెళుతుంది. ఇంతే మొత్తం యజమాని కూడా జమ చేయడంతో పీఎఫ్‌ ఖాతాలోకి అధిక మొత్తం చేరుతుంది. ఇది ఉద్యోగులకు లాభం క‌లిగిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly