ఈపీఎఫ్ చందాదారులు..కేవైసీ పూర్తిచేయ‌డం మ‌ర్చిపోకండి..

కేవైసీ ప‌త్రాలను అప్‌డేట్ చేయడం ద్వారా నగదు బదిలీ లేదా నగదు ఉపసంహరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు

ఈపీఎఫ్ చందాదారులు..కేవైసీ పూర్తిచేయ‌డం మ‌ర్చిపోకండి..

బ్యాంకు ఖాతా తెరిచేందుకు, మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు కేవైసీ ( మీ వినియోగదారును తెలుసుకోండి) పూర్తిచేయ‌డం త‌ప్ప‌నిస‌రి. అదేవిధంగా ఉద్యోగి భ‌విష్య నిధి ఖాతాకు కూడా కేవైసీ పూర్తిచేయ‌డం అవ‌స‌రం. కేవైసీ ప‌త్రాలను అప్‌డేట్ చేయడం ద్వారా నగదు బదిలీ లేదా నగదు ఉపసంహరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఒకవేళ కేవైసీ పత్రాలను సమర్పించకపోతే, ఈపీఎఫ్ చందాదారులు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ను పొందలేరు. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈపీఎఫ్ఓ), కేవైసీని ఆన్‌లైన్ ద్వారా పూర్తిచేసేందుకు అనుమ‌తిస్తుంది. డిజిట‌ల్‌గా వెరిఫై చేసిన ఆధార్‌, పాన్‌(శాశ్వ‌త ఖాతా సంఖ్య‌) ద్వారా ఇ-కేవైసీని పూర్తి చేయ‌వ‌చ్చు.

ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ కేవైసీ పూర్తిచేయు విధానం:
స్టెప్ - 1: యూఏఎన్, పాస్‌వ‌ర్డ్‌ను ఉపయోగించి ఈపీఎఫ్ఓ యూఏఎన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి - https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/.
స్టెప్ - 2: మ్యానేజ్ టాబ్‌లో, మీకు ‘కేవైసీ’, కాంటాక్ట్ డిటైల్స్ కనిపిస్తాయి.
స్టెప్ - 3 : మీరు జాబితా(బ్యాంకు ఖాతా, పాన్‌, ఆధార్ మొద‌లైన‌) నుంచి అప్‌డేట్ చేయాలనుకుంటున్న కేవైసీ సమాచారాన్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత డాక్యుమెంట్ ప్రకారం, డాక్యుమెంట్ నంబరు, పేరును నమోదు చేయడానికి అనుమతిస్తుంది. ఒకవేళ మీరు బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేస్తున్నట్లైతే, ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ను అప్‌డేట్ చేస్తున్నట్లైతే, వాటి గడువు తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్, పాన్, ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ మొదలైనవాటిని మీరు అప్‌డేట్ చేయగలరు. కేవైసీకి పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ తప్పనిసరి.
స్టెప్ - 4 - మీరు డేటాను నమోదు చేసిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీరు కేవైసీ డేటా అప్‌డేట్ విజయవంతంగా పూర్తయిందనే పాప్ అప్ ను పొందుతారు. మీరు కేవైసీ పత్రాలను సరిగ్గా అప్‌డేట్ చేసినట్లయితే, “కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్” అనే మెసేజ్ ను చూడవచ్చు. సవరించిన వివరాలను సంస్థ యజమాని ఆమోదించే వరకు కేవైసీ స్టేటస్ పెండింగ్‌ అని చూపిస్తుంది.
ఒకవేళ మీ కేవైసీ వివరాలను సరిగ్గా నమోదు చేయకపోతే, మీరు “డిలీట్” బటన్‌ పై క్లిక్ చేయండి. ఇది మీరు సబ్మిట్ చేసిన కేవైసీ సమాచారాన్ని తొలగిస్తుంది.
స్టెప్ -5: ఈ డాక్యుమెంట్ ఫ్రూవ్ మీ సంస్థ య‌జ‌మానికి స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.

కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోడానికి ఈ కింది ప‌త్రాల‌లో ఏదో ఒక‌టి అవ‌స‌రం

  • పాన్ కార్డ్‌
  • ఆధార్ కార్డ్‌
  • పాస్ పోర్ట్‌
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఎలక్షన్ కార్డు
  • రేషన్ కార్డు
  • జాతీయ జనాభా రిజిస్టర్

కేవైసీ ధృవీకరణ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత, దానిని ఈపీఎఫ్ఓ యూఏఎన్‌ పోర్టల్ కేవైసీ విభాగంలో చూడవ‌చ్చు. మీ కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ లేదా మార్పు చేసేందుకు కూడా ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్ అనుమ‌తిస్తుంది. ఇందుకోసం అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, జెండ‌ర్ వంటి వివ‌రాల‌ను స‌రిచేసేందుకు ఆన్‌లైన్ ద్వారా అభ్య‌ర్థ‌న చేయ‌వ‌చ్చు.

కేవైసీ పూర్తి చేసిన వారు సంస్థ య‌జ‌మాని ధృవీక‌ర‌ణ లేకుండా ప్రావిడెండ్ ఫండ్ ఉప‌సంహ‌ర‌ణ క్లెయిమ్‌ల‌ను ఆన్‌లైన్ ద్వారా స‌బ్మిట్ చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్ ద్వారా ఏదైనా క్లెయిమ్ చేయాలంటే యూఏఎన్‌ను ఆధార్ నెంబ‌రుతో అనుసంధానించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఆధార్ కార్డ్‌, బ్యాంకు ఖాతా రెండింటినీ డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ స‌ర్టిఫికేట్ ద్వారా య‌జ‌మాని ఆమోదిస్తే, సంస్థ ధృవీక‌ర‌ణ లేకుండా క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly