ఈటీఎఫ్‌ల‌లో 15 శాతం పెట్టుబ‌డులు

స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల ప‌రిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పెంచింది.

ఈటీఎఫ్‌ల‌లో 15 శాతం పెట్టుబ‌డులు

ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో పెట్టుబడుల పరిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి(సీబీటీ) అంగీక‌రించింది. దీంతో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈపీఎఫ్ఓ రూ.18000 కోట్ల‌ను స్టాక్‌మార్కెట్ల‌లో పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది.
ప్ర‌స్తుతం భార‌త మార్కెట్లు రికార్డ్ స్థాయుల‌లో మ‌దుప‌రుల‌కు లాభాలు పంచుతున్న వేళ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. పుణేలో శనివారం కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనికి అంగీకారం ల‌భించిందని సీబీటీ స‌భ్యుడు ప్ర‌భాక‌ర్‌.జే.బ‌న‌సురే తెలిపారు.

దీనిపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ ఈ పెట్టుబ‌డుల ప‌రిమితిని పెంచ‌డం వ‌ల్ల మెరుగైన లాభాల‌ను ఆర్జించాల‌నేదే సంస్థ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. దీని గురించి భ‌య‌ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌న్నారు.

సంస్థ‌ ఏటా దాదాపు రూ.1.2 ల‌క్ష కోట్ల నిధుల‌ను నిర్వ‌హిస్తోంది. మొట్ట మొద‌ట‌గా ఈటీఎఫ్‌లో 5 శాతం పెట్టుబడులు పెట్టేందుకు ఆగ‌ష్టు, 2015లో కేంద్రం నిర్ణయించింది. 2016లో ఆ పరిమితిని 10 శాతానికి పెంచింది. ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్‌, యూటీఐ మ్యూచువ‌ల్ ఫండ్‌, రిల‌య‌న్స్ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న ఈటీఎఫ్‌ల ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ సంస్థ‌ రూ.18600 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టింది. ఇవి దాదాపు 13 శాతం పైనే రాబ‌డుల‌ను అందించాయి.

భ‌విష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్‌) కింద చెల్లిస్తున్న చందాను 12 నుంచి 10 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనను సీబీటీ తిర‌స్క‌రించింది. దీని గురించి కూడా సీబీటీ స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్రస్తుతం ఉద్యోగులు, సంస్థ‌ల యజమానులు మూలవేతనం, కరవు భత్యంలో 12 శాతాన్ని చందాగా చెల్లిస్తున్నారు. దీనిని ప్ర‌స్తుత‌మున్న 12% నుంచి 10% నికి త‌గ్గించేందుకు ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లి అంగీక‌రించ‌లేద‌ని పీ.జే. బ‌న‌సురే తెలిపారు.

అలాగే మార్కెట్ల నుంచి అవ‌సర‌మైన‌ప్పుడు సొమ్మును వెన‌క్కి తీసుకునే విధానానికి సీబీటీ అంగీక‌రించింది. అయితే ఈ నిష్క‌మ్ర‌ణ విధానాన్ని(ఎగ్జిట్ పాలసీ)ని మాత్రం ఖ‌రారు చేయ‌లేదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly