ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్‌చేసుకునే ఉత్తమ ప‌ద్ధ‌తి ఇదే!

ఈపీఎఫ్ఓ సంస్థ త‌న సేవ‌ల‌ను ఉమంగ్ యాప్ వేదికగా అందిస్తోంది

ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్‌చేసుకునే ఉత్తమ ప‌ద్ధ‌తి ఇదే!

ఇది మొబైల్ ఆప్ ల కాలం, ఎక్కడ చుసిన ఆప్ లే. ఈపీఎఫ్ఓ సంస్థ కూడా త‌న సేవ‌ల‌ను ఉమంగ్ యాప్ వేదికగా అందిస్తోంది. ఈ యాప్ కేవ‌లం ఈపీఎఫ్ఓ సేవ‌ల‌కు ఉద్దేశించింది కాదు. గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌లో, విండోస్ స్టోర్‌లోనూ ఉమంగ్ యాప్ ల‌భ్యమ‌వుతుంది. ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న ఈ యాప్ ద్వారా గ్యాస్‌బుకింగ్‌, ఆధార్‌, పంట బీమా, ఈపీఎఫ్‌, ఎన్ పీఎస్ లాంటి ఇత‌ర సేవ‌ల‌ను సైతం పొందొచ్చు.

ఉమంగ్ వాడ‌కం ఇలా… ఏదైనా యాప్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ వెబైసైట్‌లోనూ యాప్ లింక్ అందుబాటులో ఉంది. https://web.umang.gov.in, … యాప్ డౌన్‌లోడ్ చేసుకునే పేజీకి ఇది తీసుకెళుతుంది. యాప్ డౌన్‌లోడ్ కోసం లొకేష‌న్‌, ఎస్ఎంఎస్‌, కాల్ డేటా కోసం మ‌నం అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. యాప్‌న‌కు రిజిస్ట‌ర్ అయ్యేందుకు వ‌న్ టైమ్ పాస్వ‌ర్డ్ (ఓటీపీ) జ‌న‌రేట్ అయి మొబైల్ నంబ‌రుకు వ‌స్తుంది. దీన్ని న‌మోదు చేయ‌గానే రెండు సెక్యూరిటీ ప్ర‌శ్న‌ల‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా పిన్ నంబ‌రు మ‌ర్చిపోయిన‌ట్ట‌యితే ఖాతాను తిరిగి పొందేందుకు ఈ ప్ర‌శ్న‌లు స‌హాయ‌ప‌డ‌గ‌ల‌వు. ఆ త‌ర్వాత యాప్ ఆధార్ నెంబ‌రును లింక్ చేసుకోవాల్సిందిగా సూచిస్తుంది. ఇప్ప‌టికైతే ఆధార్ సంఖ్య‌ను న‌మోదు చేయ‌డం తప్ప‌నిస‌రి కాదు. ఈ ప్ర‌క్రియ‌ను త‌ర్వాత చేసుకోద‌ల్చుకుంటే స్కిప్ చేయ‌వ‌చ్చు. ఇప్పుడే లింక్ చేసుకోద‌ల్చుకుంటే ఇ-కేవైసీ కోసం ఆధార్ వివ‌రాల‌ను ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ మంత్రిత్వ‌శాఖ‌కు అనుమ‌తినిస్తున్న‌ట్టు అర్థం. ఆధార్ సంఖ్య న‌మోదు చేయ‌డంతోటే మ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాలైన పేరు, పుట్టిన తేది, లింగం, చిరునామా లాంటివ‌న్నీ ప్రొఫైల్‌లోకి ఆటోమెటిక్‌గా వ‌చ్చేస్తాయి. ఆధార్ సంఖ్య‌ ఇవ్వ‌ని వారు ఈ వివ‌రాల‌న్నీ ఒక్కొక్క‌టిగా నింపాల్సి ఉంటుంది. అయితే ఈ పేజీని కూడా స్కిప్ చేసుకోవ‌చ్చు. త‌ర్వాతెప్పుడైనా నింపుకునే సౌల‌భ్యం ఉంది. యాప్ ఇన్‌స్టాల్ చేశాక, మొబైల్‌లో ప్రారంభించాక‌, హోం పేజీలో ఈపీఎఫ్ఓ ఆప్ష‌న్ కనిపిస్తుంది. దీంట్లో ‘Employee Centric Services’ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకొని EPF Universal Account Number (UAN) ను న‌మోదు చేయాలి. ఈపీఎఫ్‌తో రిజిస్ట‌ర్ అయిన మొబైల్ నంబ‌రుకు ఒక ఓటీపీ వ‌స్తుంది. దీని స‌హాయంతో లాగిన్ అవ్వొచ్చు. ఉమంగ్ యాప్‌లో ఉన్న ఈపీఎఫ్ విభాగం ప్ర‌స్తుతానికి మూడు సేవ‌ల‌ను అందిస్తుంది. పాస్‌బుక్ చూసుకోవ‌చ్చు, పింఛ‌ను విత్‌డ్రా కోసం క్లెయిం చేయ‌వ‌చ్చు. పాక్షిక విత్‌డ్రాయ‌ల్స్‌, ఫైన‌ల్ సెటిల్‌మెంట్‌ల‌నూ చేసుకోవ‌చ్చు. ఇది వ‌ర‌కే క్లెయిం చేసి ఉంటే, స్టేట‌స్‌ను ట్రాక్ చేసుకోవ‌చ్చు. ఉమంగ్ యాప్‌ను ఆధార్‌తో గానీ, ఈపీఎఫ్ తో లింక్ చేయ‌క‌పోయినా స‌రే పాస్‌బుక్ వివ‌రాలను చూసుకోవ‌చ్చు. అయితే … పింఛ‌ను విత్‌డ్రాయ‌ల్స్‌కు, క్లెయిం స్టేట‌స్ తెలుసుకునేందుకు మాత్రం ఆధార్‌తో అనుసంధానించాల్సిందే. ఆ స‌దుపాయాన్ని వినియోగించ‌లేం. ఉమంగ్ యాప్‌లో ఉన్న ఈపీఎఫ్ఓ విభాగంలో ఒక ముఖ్య‌మైన సేవ కొర‌వ‌డుతోంది. ఒక ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి మ‌రో కొత్త పీఎఫ్ ఖాతాకు బ‌దిలీ అయ్యేందుకు వీలుప‌డ‌దు. అయితే ఇది ఈపీఎఫ్ మెంబ‌ర్ పోర్ట‌ల్ నుంచి చేసుకోవచ్చు.

త్వ‌ర‌లో మ‌రిన్ని సేవ‌లు…

గూగుల్ ప్లే స్టోర్‌లో ఈపీఎఫ్ఓ అందించిన మ‌రో యాప్ ఉంది. దాని పేరు ఎం-ఈపీఎఫ్‌. ఈ యాప్ స‌హాయంతో పాస్‌బుక్ చూసుకోవ‌చ్చు. అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు. ఇప్పుడు దాన్ని తొల‌గించారు. దీని స్థానంలో ఈపీఎఫ్ ఓ సేవ‌ల‌ను అధికారికంగా అందించే యాప్‌గా ఉమంగ్‌ను ఆమోదించారు. ఈపీఎఫ్ఓ ఉమంగ్ యాప్ ద్వారా ఆధార్ సీడింగ్‌, నామినేష‌న్‌, పింఛ‌ను సేవ‌ల‌ను అందించేందుకు కృషి చేస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly