ఆర్థిక స‌ర్వేలోని అంశాలు

2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

ఆర్థిక స‌ర్వేలోని అంశాలు

బడ్జెట్‌కు ముందు 2018-19 సంవత్సర ఆర్థిక సర్వేను నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీనిని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తయారు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులను ఇది ప్రతిబింబించింది. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించింది. రాజకీయ స్థిరత్వం, పెట్టుబడులు సహాయపడటంతో, ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి ఐదేళ్ల కనిష్ట స్థాయి నుండి పుంజుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరానికి నిజమైన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 7% గా అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన వార్షిక ఆర్థిక సర్వే నివేదికలో తెలిపింది.
ఆర్థిక సర్వేలోని కీలక అంశాలు ఇవి…

 • 2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
 • డిమాండ్‌, రుణ లభ్యత పెరగడంతో 2020లో పెట్టుబడుల వృద్ధి రేటు కూడా పెరిగే అవకాశం ఉంది.
 • వ్యయాలు పెరగడం, ప్రైవేటు పెట్టుబడుల్లో వృద్ధి కారణంగా 2019-20లో జీడీపీ వేగంగా పెరుగుతుంది.
 • ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనం, వాణిజ్య ఘర్షణలు పెరగడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
 • భారత్‌ 2025నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మాత్రం వృద్ధి రేటు ఇప్పటి నుంచే 8శాతం దాటాలి.
 • చమురు ధరలు అందుబాటులో ఉండటం వల్ల వినిమయ శక్తి పెరగవచ్చు. ఈ ఏడాది చమురు ధరలు తగ్గవచ్చు.
 • పెట్టుబడుల రేటు 2011-12 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2019-20 నుంచి మళ్లీ పెట్టుబడుల రేటు పెరిగే అవకాశం ఉంది.
 • గ్రామీణ ప్రాంతాల్లో వేతనాల్లో వృద్ధి కనిపించే అవకాశం ఉంది. 2018 వరకు వీటిలో వృద్ధి నిలిచిపోయింది. ఆ తర్వాత నుంచి పెరుగుదల కనిపిస్తోంది.
 • వృద్ధిరేటులో మందగమనం, జీఎస్‌టీ, వ్యవసాయ పథకాల ఒత్తిడి ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది.
 • దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం పెట్టుబడుల వాతావరణాన్ని పెంచుతుంది.
 • ఎఫ్‌డీఐల నియంత్రణ తగ్గించేలా ప్రభుత్వ పాలసీలు ఉండే అవకాశం ఉంది.
 • ఈ ఏడాది ద్రవ్యలోటు తగ్గి 5.8శాతం ఉండొచ్చు. అదే 2018లో 6.4శాతంగా ఉంది.
 • మొండిబాకాయిలు తగ్గుముఖం పట్టడం… మూలధన వ్యయాల పెంపునకు సహకరించవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly