ఉన్నత విద్యా రుణం పొందే విధానం.

ఈ పథకం ద్వారా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి ఉన్నత చదువులకు ఆర్థిక చేయూతనందిస్తారు

ఉన్నత విద్యా రుణం పొందే విధానం.

ఒక దశాబ్ద కాలం ముందువరకూ చదువుల విషయాన్ని ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం అయ్యే ఖర్చు గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ప్రభుత్వమే తక్కువ ఖర్చులతో లేదా ఉచితంగా చదువులకయ్యే ఖర్చును భరించేది. ప్రస్తుతం చదువు ప్రాముఖ్యత పెరిగే కొద్దీ నాణ్యమైన విద్య అభ్యసించేందుకు ఎక్కువ డబ్బు అవసరం అవుతోంది. ఆరోగ్యం తర్వాత అంత ఎక్కువగా ఖర్చు అయ్యేది ఉన్నత చదువులకే.

వ్యక్తి జీవితంలో విద్యకు అత్యంత ప్రాముఖ్యముంది.  ఆర్థిక ఇబ్బందులు చదువులకు ఆటంకం కాకుండా ఉండేందుకు  ప్రభుత్వం విద్యారుణాలను  ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ అనుమతితో భారతీయ బ్యాంకుల సమాఖ్య (ఐబీఏ) ఏప్రిల్‌ 2001లో విద్యారుణ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి ఉన్నత చదువులకు ఆర్థిక చేయూతనందిస్తారు.

విద్యా రుణం పొందేందుకు అర్హులు :

 • విద్యార్థులు భారతీయులై ఉండాలి.
 • ఏదైనా ప్రొఫెషనల్‌ లేదా టెక్నికల్‌ కోర్సులో ప్రవేశ పరీక్ష ద్వారా అనుమతి పొంది ఉండాలి.
 • విద్యార్థి వయసుతో నిమిత్తం లేదు.
 • విద్యార్థి మంచి అకాడమిక్‌ ట్రాక్‌ రికార్డు కలిగి ఉండాలి.
 • తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు స్థిరమైన ఆదాయం ఉంటే మంచిది.
 • స్వదేశంలో కానీ విదేశాలలో కానీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ పొంది ఉండాలి.

రుణ పరిమితి

 • విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల రుణ చెల్లింపు సామర్థ్యం ఆధారంగా
  స్వదేశంలో అయితే రూ.10లక్షల వరకూ,విదేశాల్లో అయితే రూ.20లక్షల వరకూ బ్యాంకులు విద్యా రుణాలను మంజూరు చేస్తాయి.

మార్జిన్‌:

బ్యాంకులు, విద్యార్థి చదువుకయ్యే రుణంలో  కొంత శాతాన్ని విద్యార్థి భరించేలా చూస్తాయి.   దీనినే మార్జిన్ అంటారు. రూ. 4 లక్షల వరకూ  తీసుకునే విద్యారుణాలకు ఎలాంటి మార్జిన్ అవసరం లేదు. రూ. 4 లక్షల పైబడిన రుణాలకు స్వదేశంలో అయితే 5శాతం, విదేశాల్లో చదువులకు 15శాతం మార్జిన్ ఉంటుంది.  అంటే మార్జిన్‌ మేరకు అవసరమైన సొమ్మును విద్యార్థి సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థి తరపున హామీః

గృహ, వాహన రుణాల విషయంలో ఇతరుల హామీ అవసరం ఉంటుంది. విద్యా రుణాల విషయంలో రూ. 4 లక్షల వరకూ ఇతరుల హామీ అక్కర్లేదు. రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకూ తీసుకునే రుణాలకు విద్యార్థి భవిష్యత్తు ఆదాయంతో పాటు ఇతరుల హామీ అవసరం ఉంటుంది. రూ.7.5 లక్షల పైబడిన రుణాలకు ఏదైనా ఆస్తిని హామీగా ఉంచాల్సి ఉంటుంది. ఈ పరిమితులు బ్యాంకును బట్టి మారుతుంటాయి.

రుణ చెల్లింపునకు వ్యవధి :

విద్యార్థి ఉద్యోగం సంపాదించి తానే రుణాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించేందుకు  కోర్సు పూర్తయిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది గడువు ఇస్తారు. ఈ సమయంలో విద్యార్థి నుంచి చెల్లింపులు ఉండవు కనుక రుణంపై విధించే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. రుణంపై పెరిగిన వడ్డీని ఈఎమ్ఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రుణాన్ని ఈ గడువు తర్వాత 5నుంచి 7ఏళ్ల లోగా తీర్చాల్సి ఉంటుంది.

రుణం పొందేందుకు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పత్రాలు:

 • అర్హత పరీక్ష మార్కుల పత్రం
 • చేరబోయే కళాశాల అనుమతి పత్రం
 • ఫీజులు, ఇతరత్రా ఖర్చుల అంచనా
 • కేవైసీ పత్రం, పాస్‌పోర్టు ఫొటోలు, వ్యక్తిగత  గుర్తింపు, చిరునామా పత్రాలు.

విద్యారుణం పొందేందుకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

 • ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాల‌ను ఇచ్చేందుకు ప్రాముఖ్యత‌ను ఇస్తాయి.

 • కోర్సు సమయంలో వడ్డీని కనుక చెల్లిస్తే బ్యాంకులు 1శాతం రిబేటు అందిస్తాయి. ఇదే కాకుండా తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80ఈ ప్రకారం వరుసగా ఎనిమిదేళ్ల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

 • రుణాన్ని మంజూరు చేసేముందు ఉద్యోగ అవకాశాలపై ఆరా తీస్తారు.

 • రుణ మొత్తానికి, రుణ కాలావధికి కలిపి విద్యార్థికి బీమా తీసుకోవాల్సి ఉంటుంది.

 • స్వదేశంలో చదివేందుకు ప్రాసెసింగ్‌ ఛార్జీలు లేవు. విదేశీ విద్యకోసం ఇది నామమాత్రంగా ఉంటుంది. ఇది కూడా బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly