ఆర్ధిక భ‌విష్య‌త్తుకు భ‌రోసాగా..

పొదుపు చేయ‌డం వ‌ల్ల సంపద సృష్టి తో పాటు జీవితంలో ఎదుర‌య్యే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఉంటుంది.

ఆర్ధిక భ‌విష్య‌త్తుకు భ‌రోసాగా..

ఆర్థికప్రణాళిక అనేది ఒక వ్య‌క్తి సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించే కీలకమైన అంశం. జీవితంలోని అనేక అంశాలు మ‌నం చేసే పొదుపు, మ‌నం డబ్బును ఎలా ఉప‌యోగించాం అనే దానిపై ఆధారపడి ఉంటాయి. పొదుపు చేయ‌డం వ‌ల్ల సంపద సృష్టి తో పాటు జీవితంలో ఎదుర‌య్యే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఉంటుంది. చాలామంది పెట్టుబ‌డి చేసే ప్రక్రియను ఆలస్యం చేస్తారు, అయితే ఇది మ‌న‌కు ల‌భించే కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నాల‌ను దూరం చేస్తుంది. కాబ‌ట్టి, వీలైనంత త్వ‌ర‌గా మ‌దుపు చేయ‌డం ప్రారంభించాలి. కాలంతో పాటు మ‌నం చేసే మ‌దుపు కూడా వృద్ధి చెందుతుంది. పొదుపు చేసేంద‌కు నియమం, మీ నెలవారీ ఆదాయం లో కనీసం 25 నుంచి 30 శాతం పొదుపు చేసేలా ఉండాలి. పొదుపు ముందు చేసి త‌రువాత‌ ఖర్చు చేయండి.

సెక్షన్80సీ ద్వారా రూ.1.5ల‌క్ష‌ల వ‌ర‌కూ పన్నుఆదా చేసుకోవ‌చ్చు. ఈ పన్ను ఆదా చాలా ప్రాథమిక పద్ధతుల్లో ఒకటి అయినా చాలామంది ఈ విషయంలో అశ్ర‌ద్ధ చేయ‌డం ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌లేక‌పోవ‌డం జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఈ విష‌యంలో మ‌దుప‌ర్లు శ్ర‌ద్ధ వ‌హిస్తే ప‌న్ను ఆదా సుల‌భంగా పొంద‌వ‌చ్చు. సెక్ష‌న్ 80సీ కింద‌ పీపీఎఫ్ లో మ‌దుపు చేయోచ్చు. అయితే పీపీఎఫ్ తో పాటు ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్లు (ఈఎల్ఎస్ఎస్) ఎంచుకోవ‌డం మంచిది. చారిత్రాత్మకంగా పీపీఎఫ్ కంటే ఈఎల్ఎస్ఎస్ లో రాబ‌డి అధికంగా వ‌చ్చింది. అయితే, ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం) కూడా ఒక రకమైన ఈక్విటీ ఫండ్. కనీసం 10 ఏళ్ళు మదుపు చేయాలనుకుంటే ఇందులో మదుపు చేయవచ్చు. స్వల్ప కాలం లో ఇందులో నష్ట భయం ఉంటుంది. సెక్ష‌న్ 80సీ కింద ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల (ఈపీఎఫ్, జీవిత బీమా ప్రీమియం లాంటివి అన్ని కలిపి) వరకు పెట్టుబడి పెట్టేందుకు అనుమ‌తి ఉంటుంది. ఉదాహరణకు, మీ మొత్తం వార్షిక ఆదాయం రూ. 7.5 లక్షలుగా ఉంటే రూ. 1.5 లక్షల పెట్టుబడులు పెట్టవచ్చు, మీ పన్ను చెల్లించదగిన ఆదాయం రూ.6 లక్షలకు తగ్గుతుంది. అయితే, పన్ను ఆదా కోసం బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పథకాల్లో పెట్టుబడి పెట్టి నష్ట పోకుండా చూసుకోవాలి.

పొదుపు చేయాల‌నుకున్న మొత్తం నిర్ణ‌యించ‌కున్నాక ఈ పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా తీసుకోగలిగే వారు, యుక్త వ‌య‌సులో ఉన్న వారు ఈక్విటీ లో ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. అలాంటి వారు ఈక్విటీ-స్థిరాదాయ‌ నిష్ప‌త్తి 70:30 లో చేయ‌వ‌చ్చు. అయితే, న‌ష్ట‌భ‌యం తక్కువ తీసుకునేట్టయితే, మీ స్థిరాదాయ‌ భాగం పెంచుకోవాలి. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టినప్పుడు, సిప్ విధానం ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబ‌డి చేసేవారు దీర్ఘ‌కాలం మ‌దుపు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. గత 10 సంవత్సరాల్లో మంచి రాబ‌డులు అందిస్తూ, మంచి ప‌నితీరు క‌న‌బ‌రుస్త‌న్న మ్యూచువల్ ఫండ్లను ప‌రిశీలించి ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు పది సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 100 పెట్టుబడి పెట్టి, అంచ‌నా 15 శాతం రాబడి (సీఏజీఆర్) తీసుకుంటే, మీకు 10 సంవత్సరాలలో రూ. 28,300 అవుతుంది. స్థిరాదాయ పెట్టుబ‌డి సాధనాల్లో సాంప్రదాయ బ్యాంకు ఎఫ్‌డీ లు పొదుపు సాధనంగా ప్రాచుర్యం పొందాయి. కానీ ప్రభుత్వ బాండ్లు, డెట్ ఫండ్లు లాంటివి మీ రాబడిని సంవత్సరానికి 2-3 శాతం వరకు పెంచవచ్చు. అయితే వీటిలో న‌ష్ట‌భ‌యం కూడా ఉంటుంది. 20 లేదా 30 శాతం పన్ను స్లాబు లో ఉన్న వారు డెట్ ఫండ్ల లో కనీసం 3 సంవత్సరాల వ్యవధిని మించి పెట్టుబ‌డి చేస్తే పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

మీపై ఆధార‌ప‌డి ఉండే వారి కోసం జీవిత బీమా త‌ప్ప‌క తీసుకోవాలి. బీమా హామీ మొత్తం మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండేలా జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయాలి. కవరేజ్ మొత్తం రుణాలు, పిల్లల విద్య వంటి భవిష్యత్ ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని అందించే విధంగా ఉండాలి. జీవిత బీమాతో పాటు, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఆరోగ్య బీమా కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యమైనది.

పొదుపుకు అనుగుణంగా ఉండే యాప్ ల‌ను వినియోగించండి. షాపింగ్ సమయంలో డబ్బు ఆదా చేసుకునేందుకు వివిధ సైట్లు,యాప్లు ఉన్నాయి, ప్రయాణానికి టికెట్ బుకింగ్లు, స‌రుకుల కొనుగోళ్లు త‌దిత‌రాల‌కు అందుబాటులో ఉండే ప్లాట్‌ఫామ్ ల‌ను వాడ‌టం ద్వారా కొనుగోళ్ల‌పై డిస్కౌంట్లు పొంద‌చ‌వ్చు. అలాంటి వాటిని ఉప‌యోగించ‌డం మంచిది. అయితే వీటిని ఉప‌యోగించేట‌పుడు అధికంగా, అన‌వ‌స‌ర కొనుగోళ్లు చేయ‌కుండా ఉండాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly