ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ

కుటుంబమంతటికీ ఒకే పాలసీ ద్వారా ఆరోగ్య బీమా అందించే ఫామిలీ ఫ్లోటర్ పాలసీ వివరాలు తెలుసుకుందాం.

ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ

పెరుగుతున్న వైద్యఖర్చులను దృష్టిలోపెట్టుకున్నట్టయితే కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. అలాగని ప్రతి ఒక్కరికీ విడివిడిగా పాలసీ తీసుకోవడం ఖరీదైన వ్యవహారంగా అనిపించవచ్చు. కుటుంబసభ్యుల్లో చిన్న వయసువారు, ఆరోగ్యవంతులు ఉంటే ఈ ప్రీమియం అనేది అనవసరపు ఖర్చుగా అనిపించవచ్చు. ఇలాంటి విషయాలను అధిగమిస్తూ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ బీమా కలిగి ఉండాలంటే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకోవడం ఉత్తమం. ప్రతి ఒక్కరికీ విడివిడిగా పాలసీ తీసుకునే కంటే ఇలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవడం వల్ల చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది.

బీమా కంపెనీలు కుటుంబాల్లో ఉండే సభ్యుల సంఖ్యను బట్టి వివిధ రకాల ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు అందుబాటులో ఉంచాయి. ఇవి ఇద్దరు పెద్దలకు లేదా ఇద్దరు పెద్దలతోపాటు ఒక సంతానం ఉన్నవారికి, ఇద్దరు పెద్దలు వారితోపాటు ఇద్దరు సంతానం ఉన్నవారికి, కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు, అత్తామామలకు కలిపి పాలసీ తీసుకునే వెసులుబాటు కల్పించారు.

ఫ్యామిలీ ఫ్లోటర్‌ ముఖ్య లక్షణాలు:

 • ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ హామీగా అందించే బీమా సొమ్ము పరిధిలో కుటుంబసభ్యులు వస్తారు.

 • కుటుంబంలోని మూడు నెలల చిన్నారుల నుంచి 65ఏళ్ల వయసున్న పెద్దల వరకు కలుపుకొని ఈ పాలసీ తీసుకోవచ్చు.

 • పాలసీలో పెద్ద వయసువారిని దృష్టిలో ఉంచుకొని ప్రీమియం విధిస్తారు.

 • ఈ పాలసీలు ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రెండేళ్లకు ఒక‌సారి పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

 • సాధార‌ణ ఆరోగ్య బీమా పాల‌సీ మాదిరిగానే నెట్‌వ‌ర్క్ ఆసుపత్రుల‌కైతే న‌గ‌దు ర‌హిత స‌దుపాయం, ఇత‌ర ఆసుప‌త్రుల‌కైతే న‌గ‌దు చెల్లింపు ఉంటుంది. ఆరోగ్య పరీక్షలకు, ఆసుపత్రికి చేరేముందు, ఆసుపత్రిలో ఉన్నకాలంలో, డిశ్ఛార్జి అయిన తర్వాత అయ్యే వైద్యఖర్చులు, శస్త్రచికిత్సలకు, అవయవ దానంచేసిన వ్యక్తికి అయిన ఖర్చులకు, అంబులెన్స్‌ ఖర్చులు, తీవ్ర అనారోగ్య సమస్యలైన క్యాన్సర్‌, గుండె జబ్బులు వంటివి ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి. వీటికి అదనంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో ప్రసూతి ఖర్చులకు, అప్పుడే పుట్టిన పిల్లలకయ్యే ఖర్చులు, ఆయుర్వేద, యునాని వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా చెల్లిస్తాయి. ఇవి పాలసీని బట్టి మారుతుంటాయి.

 • ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు ఆరోగ్య పరీక్షలకయ్యే ఖర్చులను చెల్లిస్తాయి. పాలసీని బట్టి సంవత్సరానికి ఒకసారి, మూడేళ్లకోసారి నిర్ణీత సొమ్మును చెల్లిస్తారు.

 • రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా బీమా కల్పించే పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

 • పాలసీదారుడు ఎలాంటి క్లెయిం చేయకపోతే నోక్లెయిం బోనస్ చెల్లిస్తారు

 • క్లెయింలు ఎక్కువగా చేసేకొద్దీ చెల్లించే ప్రీమియం పెరుగుతూ ఉంటుంది.

 • ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీసెస్‌లో కొన్నింటికయితే 2 ఏళ్లు, క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, అస్తమా లాంటి ఆరోగ్య సమస్యలకు 3 లేదా 4ఏళ్ల తర్వాత బీమా వర్తిస్తుంది.

 • సాధారణంగా పునరుద్ధరణ చేసుకునేందుకు గరిష్ఠ వయసు పరిమితి ఉంటుంది. పాలసీలో అందరికంటే ఎక్కువ వయసు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకొని ఈ పునరుద్ధరణ పరిమితి నిర్ణయిస్తారు. అందుకని ఎక్కువ వయసు వరకు పునరుద్ధరించుకొనే అవకాశమున్న పాలసీని ఎంచుకోవడం మంచిది.

 • పెద్ద వయసు ఉన్న వారు అనుకోకుండా మృతి చెందితే, మిగిలిన సభ్యులకు యథాతథంగా పాలసీ కొనసాగుతుంది.

 • ఈ ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీకి కొత్త సభ్యులను చేర్చేడం సులభం. కుటుంబంలోకి వచ్చిన జీవితభాగస్వామిని, చిన్నారులను, అత్తమామలను సులభంగా ఇందులో చేర్చవచ్చు.

 • ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80(డీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

 • ఈ పాలసీని మరో కంపెనీకి బదిలీచేసుకునే వీలుంటుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు:

 • ప్రీమియం అనేది పెద్ద వయసు వారిని దృష్టిలో ఉంచుకొని వసూలుచేస్తారు కాబట్టి 60ఏళ్లుపై బడిన వారెవరైనా ఉంటే వారి కోసం ప్రత్యేక పెద్దల బీమాను తీసుకొని మిగిలిన కుటుంబసభ్యులకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ తీసుకుంటే ప్రీమియంకయ్యే ఖర్చు తగ్గుతుంది
 • కొన్ని పాలసీలు 18 లేదా 20 ఏళ్ల వయసు నిండిన వారిని పిల్లలుగా కాకుండా పెద్దలుగా భావిస్తారు. సభ్యుల్లో ఎవరైనా మేజర్‌ అయితే ప్రీమియం ఛార్జీలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly