జీవితానికి అన్వయించుకోవలసిన నాలుగు లక్షణాలు...

డ‌బ్బు సంపాదించాలన్నా లేదా ఉన్న దానిని కాపాడుకోవాలన్నా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది

జీవితానికి అన్వయించుకోవలసిన  నాలుగు  లక్షణాలు...

ధనవంతులు కావాలని ఎవరికి ఉండదు? ఎందుకంటే డబ్బుతో సుఖాలు, సౌకర్యాలు, అధికారం , మంది మార్బలం అన్ని చేకూర్చుకోవచ్చు. కొత్త పదవి పొందాలన్నా, ఉన్న పదవిలో కొనసాగాలన్నా , అలాగే పైపదవికి వెళ్లాలన్నా డబ్బు ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. డబ్బు మనో ధైర్యం, స్థైర్యం పెంచుతుంది.

చాలా మంది ఉద్యోగం చేసి సంపాదించి లేదా వ్యాపారం చేసి , అలాగే వృత్తి పరంగా అభివృద్ధి చెంది ధనికులమవుతాం అనుకుంటారు. కొంత మందికి వంశపారంపర్యంగా ఆస్థిపాస్థులు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ , కొత్తగా సంపాదించాలన్నా లేదా ఉన్న వాటిని కాపాడుకోవాలన్నా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

తార్కిక ఆలోచన (లాజికల్ థింకింగ్):
ఈ మధ్యకాలంలో మనం వింటున్న మాట పాజిటివ్ థింకింగ్. అంటే అన్నిటిని మంచి ఉద్దేశ్యంతో ఆలోచించమని. ఎదుటివారు చెప్పిన మాటనుకానీ , చేసిన పనిని కానీ మంచి దృష్టితో తీసుకోమని. దానికి తగినట్టుగా మన మాటకానీ, పనికానీ, మన ఆలోచన కానీ ఉండాలంటారు. అయితే , దీని వలన అన్ని సందర్భాలలోనూ మంచి జరుగుతుందని చెప్పడం కష్టం. చాలా సమయాల్లో మంచి ఉద్దేశ్యంతో తీసుకుని నష్టపోయే ప్రమాదం ఉంది.

దీనికంటే ఉత్తమమైనది ‘తార్కిక ఆలోచన’. అంటే ప్రతి మాటకు లేదా ప్రతి పనిని తార్కికంగా ఆలోచించినట్లయితే , దాని వెనకాల ఉన్న మర్మం అర్ధమవుతుంది. అది ఎదుటివారు చెప్పినదే కానక్కర్లేదు. మనం చేయబోయే పని లేదా మాట్లాడబోయే మాట వలన , జరగబోయే పరిణామాలను విడమర్చి ఆలోచించగలిగితే , రాబోయే అనర్ధాలను, ప్రమాదాలను అరికట్టవచ్చు. పూర్తిగా నివారించలేకపోవచ్చు. ఇది మన శారీరక, మానసిక, ఆర్ధిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివలన మీ శక్తిని మీ ఉద్యోగ, వ్యాపారాలమీద దృష్టి పెట్టి, ఉన్నతమైన విజయాలను సాధించవచ్చు.

సమయ పాలన:
అందరికి ఉన్నది 24 గంటలే. కొందరు సరైన విధంగా ఉపయోగించుకుని , అభివృద్ధి చెందుతుంటే , మరి కొందరు అనవసర విషయాల గురించి ఆలోచించి, లేదా ఏమీ ఆలోచించకుండా తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒక పని వలన తమకు నష్టం వాటిల్లితే అది ఇతరుల వలన జరిగిందని భావిస్తారు . సమయాన్ని సరిగా వినియోగించుకోవడం వలన అనవసరపు ఖర్చులను, వృధా ప్రయాసలను, మానసిక ఆందోళనలను తగ్గించుకోవచ్చు. దీనివలన ఉన్న సమయాన్ని ఉన్నతమైన విషయాలపై మళ్లించడం ద్వారా మానసికంగా, ఆర్ధికంగా ఎదగవచ్చు.

ఉదా : ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి ఉదయం 11 గంటలకు చేరుకోవాలి. ఇంటర్వ్యూ ప్రదేశానికి 15 నిమిషాల ముందే అక్కడ ఉండాలి. అది నియమం. ఆ ఉద్యోగం అతనికి చాలా అవసరం. అతని ఇంటినుంచి ఇంటర్వ్యూ చేసే ప్రదేశానికి చేరుకోవటానికి 2 గంటలు పడుతుంది. అందువలన అతను సరైన టైం ప్లాన్ వేసుకుని , అందుకు ఇంటినుంచి ఎంత సమయానికి బయలుదేరాలో నిర్ణయించుకోవాలి. ఎటువంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయి, వాటిద్వారా ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుంది, తగిన ప్రయాణ ఖర్చులకు సరిపడ నగదు, చిల్లర ఎంత తీసుకువెళ్లాలి వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, ఫోటోకాపీ తీసుకోవలసిన పత్రాలను ముందే ఉంచుకోవడం మంచిది.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే ప్రతి పనిలో సమయపాలన ఆచరిస్తే, మీ కాలంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

మనీ మేనేజ్ మెంట్ :
మనుషుల జీవనాడి- డబ్బు . ఈ రోజులలో డబ్బు లేకపోతే ఏమీ చేయలేని స్థితి . డబ్బు ఉంటే కలిగే మనోధైర్యం , ఆత్మవిశ్వాసం వేరు. ఈ డబ్బే కుటుంబ సభ్యుల మధ్య కూడా తేడా తెస్తుంది. ఒకే తల్లిదండ్రులకు కలిగిన పిల్లలలో కూడా డబ్బు వలన కలిగే తేడా కనబడుతుంది. వారి మధ్య ప్రేమ, అభిమానాలు ఉండవచ్చు. అవి డబ్బు వరకు రానంతవరకే . డబ్బు లేకపోతే ఆరోగ్యం కాపాడుకోవడం కూడా కష్టమే. కాబట్టి డబ్బు విలువ తెలుసుకో, దాన్ని కాపాడుకో.
అంటే సంపాదన మొదలైన నాటినుంచే సరైన పథకాలలో మదుపు చేయాలి. వృధా ఖర్చులను నియంత్రించుకో. ప్రతి పధకం అనుకూలతలు, ప్రతికూలతలు క్షుణ్ణంగా గ్రహించి తగిన నిర్ణయం తీసుకో. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.

ఉదా: కుటుంబలో సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన వలన, సంపాదించే శక్తిని కోల్పోతే, లేదా మరణించితే , ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎండోమెంట్, హోల్ లైఫ్ లాంటి జీవిత బీమా పాలసీ తీసుకునేవారు. అయితే , మారుతున్న కాలానికి, జీవన ప్రమాణాలకు వాటి ద్వారా పొందే హామీ మొత్తం సరిపోవు. అదీగాక వీటిలో ప్రీమియం కూడా అధికంగా ఉంటుంది. అందుకే , తగినట్లుగా టర్మ్ జీవిత బీమా పాలసీలు ప్రవేశ పెట్టారు. వీటిలో తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా హామీని పొందొచ్చు.

కమ్యూనికేషన్ :
మనం చెప్పదల్చుకున్న విషయాన్ని క్లుప్తంగా, సంక్షిప్తంగా స్వల్ప కాలంలో చెప్పగలగడం. సరైన సమయంలో చేసే కమ్యూనికేషన్ ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మనకు నచ్చినా, నచ్చకపోయినా చెప్పే విధానం చక్కగా ఉండాలి. సరైన కమ్యూనికేషన్ ద్వారా శత్రుత్వాన్ని కూడా మితృత్వంగా మార్చుకోవచ్చు. సరైన సమయంలో చేసిన కమ్యూనికేషన్ వలన శారీరక, మానసిక, ఆర్థికంగా కూడా లబ్దిపొందొచ్చు. ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఆధునిక యుగంలో దీని విశిష్టత విపరీతంగా పెరిగింది. తగినట్టుగా సాధనాలుకూడా వినియోగంలోకి వచ్చాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వంటి వాటిని సరైన పద్దతిలో వినియోగించుకుంటే ఆరోగ్యం, ఆనందం, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి.

ముగింపు:
పై విషయాలను మన జీవితాలకు అన్వయించుకుంటే ఆనందం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత , ఆర్ధిక అభివృద్ధి. సంపాదన మొదలైన నాటినుంచే, తగిన ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , సరైన పథకాలలో మదుపు చేయడం ద్వారా ఆర్థికంగాఎదగవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly