ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకొని ప్ర‌ణాళిక వేసుకోండి

ప్రతి వ్యక్తి కుటుంబం, సభ్యుల ఆరోగ్యం, కోరికలు, ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు వేరు వేరుగా ఉంటాయి.

ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకొని ప్ర‌ణాళిక వేసుకోండి

మనకు కొంచెం అనారోగ్యం కలగగానే , గతంలో ఇంట్లో ఎవరైనా అటువంటి వాటికి వాడిన మందులు ఏమైనా ఉన్నాయోమో చూస్తాము. వాటితో తగ్గకపోతే , దగ్గరలో ఉన్న మందుల దుకాణంలో మన రోగ లక్షణాలు చెప్పి మందు వాడతాము. అప్పటికి తగ్గకపోతే, చౌకగా ఉన్న క్లినిక్ కి వెళ్తాము. ఈ లోపు లోపల ఉన్న అనారోగ్యం కొంచెం ముదురుతుంది . దీనివలన మన పనిపై కూడా ప్రభావం పడుతుంది. చివరకు మంచి స్పెషలిస్ట్ వద్దకు వెళ్లి, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మందులు వాడతాము. ఈ లోపు విలువైన సమయం, డబ్బు నష్టపోతాం. ఇదంతా ఎందుకు చెప్పామంటే, దీనిని మన పెట్టుబడులకు కూడా అన్వయించుకోవచ్చు.

పెట్టుబడులను రెండు రకాలుగా విభజించవచ్చు.
మొదటిది - వస్తు రూపేణా ఉండేవి - ఇళ్ళు, స్థలాలు, పొలాలు, బంగారం వంటివి.
రెండవది - వస్తు రూపేణా కానివి - బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్స్ , షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, వంటివి.
ప్రతి పెట్టుబడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే కనీస విలువ, కాలపరిమితి, విలువలో పెరుగుదల, తరుగుదల , నగదు లభ్యత (లిక్విడిటీ ), పన్ను ప్రభావం వంటి అంశాలు.

ప్రతి వ్యక్తి కుటుంబం, సభ్యుల ఆరోగ్యం, కోరికలు, ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు వేరు వేరుగా ఉంటాయి. అతను/ ఆమె చేసే పని, ఆదాయం , ఖర్చులు ఇలా అన్ని వేరుగా ఉంటాయి. ఒకవేళ ఆదాయం ఒకేలా ఉన్నా ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు వేరుగా ఉంటాయి. ఈ విషయాలను ఒకే కుటుంబంలోని సభ్యుల మధ్యకూడా చూడవచ్చు.

ఒకే కుటుంబంలోని అన్నదమ్ములలో ఒకరు ఉద్యోగం వైపు వెళ్ళవచ్చు, మరొకరు వ్యాపారం వైపు వెళ్ళవచ్చు. అందువలన ఇద్దరి ఆశయాలు, ఆశలు, అవకాశాలు వేరుగా ఉంటాయి.

మన అవసరాలు, ఆశలు, అవకాశాలు కూడా భవిష్యతులో మారే అవకాశం ఉంటుంది. అందువలన మన పెట్టుబడులు మనకు అవసరమైనవిగా , అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎవరికో ఏదో లాభం వచ్చిందని, ఎవరో చెప్పారని మన పెట్టుబడులు ఉండకూడదు. ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో ఎవరూ లక్షాధికారులుగానీ, కోటీశ్వరులుగానీ అయిపోరు. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు మనకు అనుకూలమైనవి ఏవో తెలుసుకోవాలి. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో అనేక చోట్ల నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం కష్టపడి సంపాదించిన డబ్బుకు విలువ ఇచ్చిన వాళ్లమవుతాము.

సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ లు ఫైనాన్సియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డు లో రిజిస్టర్ అయి ఉంటారు. వీరు బీమా, పెట్టుబడులు, పదవివిరమణ నిధి, ఆదాయపు పన్ను వంటి విషయాలలో వ్యక్తులకు సహాయపడతారు. వీరు కొంత ఫీజు తీసుకుంటారు. ఫీజు చెల్లించినప్పటికీ దీర్ఘకాలంలో మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహద పడతారు.

ముగింపు:
మనకు తెలియని విషయాలలో అనవసర నిర్ణయాలు తీసుకుని డబ్బుని, సమయాన్ని వృధా చేసుకునే కన్నా , నిపుణుల సలహాల మేరకు అభివృద్ధి చెందమని చెప్పటమే ఈ క‌థ‌నం ముఖ్య ఉద్దేశ్యం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly